పసుపు బోర్డు ఏర్పాటు అవసరం లేదు: పురుషోత్తమ్‌ రూపాలా

17 Mar, 2021 14:43 IST|Sakshi

ఎంపీ ఉత్తమ్‌ ప్రశ్నకు కేంద్ర మంత్రి పురుషోత్తమ్‌ రూపాలా సమాధానం  

సాక్షి, న్యూఢిల్లీ: నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు అవసరం లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే పసుపు సాగు, మార్కెటింగ్‌కు ఉపయోగపడేందుకు నిజామాబాద్‌లో మసాలా బోర్డు డివిజనల్‌ కార్యాలయాన్ని రీజనల్‌ కార్యాలయంగా మార్చి ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్‌ రూపాలా తెలిపారు. మసాలా బోర్డు పరిధిలో పసుపుతో పాటు మొత్తం 50 పంటలు ఉన్నాయని, నిజామాబాద్‌ జిల్లాలో సాగయ్యే పసుపు కోసమే ఈ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ ప్రత్యేకంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. స్పైసెస్‌ పార్క్‌ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మంగళవారం నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు అంశంపై లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు పురుషోత్తమ్‌ రూపాలా ఇచ్చిన సమాధానంతో సభలో కొద్దిసేపు రసాభాస జరిగింది. 

పేరేదైనా పని జరుగుతోంది కదా అంటూ పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రశ్న అడిగిన ఉత్తమ్‌కు రూపాలా ఎదురు ప్రశ్న వేశారు. కాగా, పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన గురించి అడిగితే, మంత్రి సూటిగా సమాధానం చెప్పకుండా స్పైసెస్‌ బోర్డు గురించి చెబుతున్నారని మంత్రిపై ఉత్తమ్‌ అసహనం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్ర నేతలు రాజ్‌నాథ్‌ సింగ్, ప్రకాశ్‌ జవదేకర్, రాంమాధవ్‌లు నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పా టు చేస్తామంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. హామీ ఇచ్చాక పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి ఇబ్బందేంటని కేంద్రాన్ని నిలదీశారు. 
 

మరిన్ని వార్తలు