అదనపు టీఎంసీతో లబ్ధి ఎంత?

2 Sep, 2020 05:31 IST|Sakshi

ఎంత కొత్త ఆయకట్టు వినియోగంలోకి వస్తుంది?

ఏయే జిల్లాలకు లబ్ధి..

కేంద్ర జలసంఘం అనుమతులున్నాయా?

కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులపై రాష్ట్రానికి కేంద్రం ప్రశ్నలు

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ప్రస్తుతం ఉన్న 2 టీఎంసీల నీటి ఎత్తి పోతలకు అదనంగా మరో టీఎంసీ నీటి ఎత్తిపోతలకు సంబంధించి చేపడుతున్న పనులతో ఎంత కొత్త ఆయకట్టు వినియోగంలోకి వస్తుందో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు కేంద్ర జల సంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేవని స్పష్టం చేసిన కేంద్రం, పర్యావరణ అనుమతులపై సైతం ఆరా తీయగా, తాజాగా అదనపు టీఎంసీతో చేకూరే ప్రయోజనాలపై వివరణ కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంగళవారం రాష్ట్రానికి లేఖ రాసింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు 2015లో సమర్పించిన వ్యయ అంచనాల మేరకు టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపిందని లేఖలో ప్రస్తావిస్తూ, ప్రస్తుత అంచనా వ్యయాలు ఎంతో చెప్పాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. 98 రోజుల పాటు రోజుకు 2 టీఎంసీల చొప్పున 195 టీఎంసీల నీటి ఎత్తిపోతలకు మాత్రమే టీఏసీ అనుమతిచ్చిందని గుర్తుచేసింది. అయితే అదనంగా రోజుకు మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ప్రతిపాదన ఏదైనా సిద్ధం చేశారా? అలాంటి ప్రతిపాదన ఉంటే.. ఆ వివరాలను తమకు తెలపాలని కేంద్రం ఆదేశించింది. ఇక అదనపు టీఎంసీ పనులపై కేంద్ర జల సంఘానికి ఏవైనా ప్రతిపాదన పంపారా? అని ప్రశ్నిం చింది. నీటి వినియోగానికి సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్నంత తమకు అందజేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో పాటే ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఎస్సారెస్పీ స్టేజ్‌–1, స్టేజ్‌–2, వరద కాల్వ, సింగూరు, నిజాంసాగర్‌ ప్రాజెక్టుల కింద స్థిరీకరణ ఆయకట్టు వివరాలనూ కోరింది. 

పాత ఆయకట్టునే కొత్తగా చూపిస్తున్నారంటూ..
కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులతో కొత్తగా వృధ్ధిలోకి వచ్చే ఆయకట్టు పెద్దగా లేదని, ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టునే కాళేశ్వరం ఆయకట్టు కింద చూపుతున్నారని వివిధ పార్టీల ఎంపీలు, రిటైర్డ్‌ ఇంజనీర్ల ఫోరం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ వివరాలను కోరినట్లుగా తెలిసింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను సమర్పించాలని పలుమార్లు కోరినా రాష్ట్రం స్పందించలేదు. కాళేశ్వరం అంచనా వ్యయం రూ.80,150 కోట్లుగా గతంలో పేర్కొన్నారని, ప్రస్తుతం సవరించిన అంచనాలు ఎంతో తెలపాలని కేంద్రం ఆదేశించింది. దీనిపై కొనసాగింపుగా ప్రస్తుతం ప్రాజెక్టు అదనపు టీఎంసీతో వృద్ధిలోకి వచ్చే ఆయకట్టు, ప్రయోజనాల వివరాలను కోరడంతో కేంద్రం కాళేశ్వరం అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు కనబడుతోందని ఇరిగేషన్‌ వర్గాలే అంటున్నాయి. 

>
మరిన్ని వార్తలు