జీఎస్టీలో ‘మూడు ముక్కలాట’!

12 Sep, 2022 01:19 IST|Sakshi

పన్నులు వసూలు చేసి కేంద్రానికి ఇవ్వడమెందుకనే ధోరణిలో రాష్ట్ర పన్నుల శాఖ 

పాత బకాయిలు, ఓటీఎస్, వ్యాట్‌ వసూలుపైనే ప్రత్యేక దృష్టి... రూ.3 వేల కోట్లు రాబట్టడంపైనే ఫోకస్‌ 

కేంద్ర పన్నుల శాఖ అధికారులదీ అదే దారి... సెంట్రల్‌ ఎక్సైజ్‌ పన్ను, పాత బకాయిలపైనే దృష్టంతా 

మధ్యలో సతమతమవుతున్న డీలర్లు 

సాక్షి, హైదరాబాద్‌: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో వృద్ధి మాత్రమే కాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల పనితీరులో వ్యత్యాసం కూడా కనిపిస్తోంది. జీఎస్టీ కింద పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్ని వేల కోట్లు సమీకరించినా అందులో సగం కేంద్రానికి ఇవ్వాల్సి వస్తుండటంతో రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు పాత బకాయిల వసూలుకే ప్రాధాన్యమిస్తున్నారు. 

అదే తరహాలో కేంద్ర పన్నుల శాఖ అధికారులు కూడా సెంట్రల్‌ ఎక్సైజ్‌ పన్నులు, కేంద్రానికి రావాల్సిన పాత బకాయిల వసూళ్లే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. రెండు ప్రభుత్వాల అధికారులూ పాతబకాయిల పైనే దృష్టి పెట్టడంతో డీలర్లు సతమతం కావాల్సి వస్తోందనే చర్చ జరుగుతోంది. ఎప్పుడో ఐదారేళ్ల నాటి బకాయిలు కట్టాలని ఇరు ప్రభుత్వాల పరిధిలోకి వచ్చే డీలర్లకు నోటీసుల మీద నోటీసులు వెళ్తున్న నేపథ్యంలో ఇంకెన్నాళ్లీ పాత బకాయిల గోల అని వారు పెదవి విరుస్తున్నారు. ఓవైపు పాతబకాయిలు కట్టుకుంటూ పోతే కొత్త పన్నులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని, ఈ విషయంలో ప్రభుత్వాల వైఖరిలో మార్పు రావాలని కోరుతున్నారు.  

రూ.3వేల కోట్లపై మాటే.. 
రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు ప్రతి నెలా రూ.4వేల కోట్ల వరకు వస్తున్నాయి. జీఎస్టీ కింద ఎంత వసూలు చేసినా అందులో సగం కేంద్రానికి వెళ్తుంది. దీంతో జీఎస్టీ వసూళ్ల కోసం పనిచేస్తున్న రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు కొత్త పన్నులపై కాకుండా పాత బకాయిలపైనే దృష్టి పెడుతుండటం గమనార్హం. జీఎస్టీ అమల్లోకి రాకముందు నుంచీ పెండింగ్‌లో ఉన్న పాత బకాయిలు, వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్లు, విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) వసూళ్ల కోసమే తాము పనిచేయాల్సి వస్తోందని, ఇప్పటివరకు పాతబకాయిలు రూ.3వేల కోట్లకు పైగానే ఉన్నాయని ఓ అధికారి వెల్లడించారు.

తామే కాదని, కేంద్ర పన్నుల శాఖ అధికారులు కూడా కేంద్ర ఖజానాకు వెళ్లే పన్నులపై దృష్టి సారిస్తున్నారే తప్ప రాష్ట్ర ఖజానాకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించడం లేదన్నారు. కనీసం ఇతర రాష్ట్రాల అడ్రస్‌లతో రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్న డీలర్లను కనీసం అప్‌డేట్‌ చేయడం లేదని, ఐజీఎస్టీ కింద రాష్ట్రానికి రావాల్సిన పన్నులను కూడా ఇవ్వడం లేదని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో జీఎస్టీ పరిధిలోకి వచ్చే డీలర్లు 3.5 లక్షల వరకు ఉంటారు.  

అయినా... వసూళ్లలో వృద్ధి 
జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టకపోయినా వృద్ధి కనిపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో రూ.3,871 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదే గత ఏడాది ఆగస్టులో అయి తే రూ.3,525 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి జీఎస్టీ వసూళ్లలో 20శాతానికి పైగా వృద్ధి కనిపించింది. ఈ ఆర్థిక సంవత్సంలో ఆగస్టు వరకు జీఎస్టీ వసూళ్లు రూ.21,256.97 కోట్లుగా నమోదైంది. గత ఏడాదిలో ఇది రూ.17,226.78 కోట్లు మాత్రమే. గత ఏడాది తో పోలిస్తే 23 శాతం వృద్ధి నమోదైందని అధికారులు చెబుతున్నారు.    

మరిన్ని వార్తలు