రూ.152 కోట్లు వెంటనే చెల్లించండి!

29 Nov, 2022 01:25 IST|Sakshi

రాష్ట్రానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోటీసులు!

నిబంధనలకు విరుద్ధంగా ‘ఉపాధి’పనులు చేశారని అభ్యంతరాలు

ఇతర పనులకు నిధులు మళ్లించారని ఆక్షేపణ 

అవి నోటీసులు కాదు.. కేంద్రం ‘యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌’లు అడిగింది 

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ అధికారుల వివరణ 

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీపథకం నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర పనులకు వినియోగించారంటూ రాష్ట్రానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోటీసులు ఇచ్చింది. ఈ పథకం కింద అనుమతించని పనులు చేపట్టినందుకు, నిధులు దారి మళ్లించినందుకు ఈ నెల 30వ తేదీలోగా కేంద్రానికి రూ.151.9 కోట్లు తిరిగి చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

ఈ నోటీసులకు స్పందించకపోయినా, దారి మళ్లించిన మేర నిధులు తిరిగి కేంద్రానికి చెల్లించక పోయినా తదుపరి ఉపాధి నిధులు విడుదల చేయబోమని స్పష్టంచేసినట్టు సమాచారం. అదేవిధంగా ఇకపై భూమి అభివృద్ధి పనులకు సంబంధించి అన్నింటికీ ఒకేవిధమైన అనుమతి (బ్లాంకెట్‌ పర్మిషన్‌ ఫర్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌) జారీచేయొద్దని రాష్ట్రానికి సూచించినట్టు తెలుస్తోంది. 

ఇవీ ఉల్లంఘనలు..?
మార్గదర్శకాలకు భిన్నంగా ఆయా పనుల అంచనావ్యయం, వాటికి ఆమోదం, ధాన్యం ఆరబెట్టే కల్లాల నిర్మాణం, మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల్లో పూడికతీత, అటవీ ప్రాంతాల్లో ‘స్టాగర్డ్‌ ట్రెంచేస్‌’తదితర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులు వినియోగించినట్లు ఆ నోటీసుల్లో పేర్కొన్నారని సమాచారం. ఉన్నతస్థాయి సాంకేతిక బృందం (సుపీరియర్‌ టెక్నికల్‌ అథారిటీ) ఆమోదం పొందాల్సిన పరిధి నుంచి తప్పించేందుకు అధిక వ్యయమయ్యే వివిధ పనులను చిన్నచిన్న పనులుగా విభజించడం, పనులు చేపట్టడానికి ముందు, ఆ తర్వాత కమ్యూనిటీ ఇన్ఫర్మేషన్‌ బోర్డుల ఏర్పాటులో నిబంధనల ఉల్లంఘన, జాబ్‌కార్డుల నిర్వహణ, గ్రామపంచాయతీల్లో ఆయా పనులకు సంబంధించిన డాక్యుమెంటేషన్, వాటి నిర్వహణ వంటి అంశాల్లో లోపాలు చోటుచేసుకున్నట్టు గుర్తించారు.

తెలంగాణలోని కొన్ని బ్లాక్‌లలో అత్యధికంగా ఉపాధి హామీ నిధుల వెచ్చింపు జరుగుతున్నట్టు కేంద్రం దృష్టికి రాగా గత జూన్, సెప్టెంబర్‌లలో వివిధ జిల్లాల్లో ఈ పనుల క్షేత్రస్థాయి పరిశీలనకు పలు బృందాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిశీలన అనంతరం ఆయాజిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా వివిధ పనులు చేపట్టారంటూ, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు పంపించాల్సిందిగా గతంలోనే రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి లేఖలు వచ్చాయని తెలుస్తోంది. 

‘యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌’లు అడిగారు
ఇదిలా ఉండగా రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చినవి నోటీసులు కావని, గతంలో లేవనెత్తిన అంశాలకు సంబంధించి ‘యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌’లు, ఇతర వివరణలు మాత్రమే అడిగారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారి ఒకరు సాక్షికి తెలిపారు. ఇదిలా ఉంటే కేంద్రం నుంచి వచ్చిన తాఖీదులపై రాష్ట్ర పీఆర్‌ శాఖలో ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ బాధ్యతలు చూసే ఓ అధికారి తాజాగా ఢిల్లీ వెళ్లి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.

కాగా, పనుల్లో తేడాలకు సంబంధించి పూర్తి నివేదికలు సిద్ధంగా ఉంచాలని కేంద్రం ఆదేశించినట్టు తెలుస్తోంది. మరో పక్క ఈ వివరాలను తాము ఇప్పటికే సమర్పించినట్లు రాష్ట్ర అధికారులు వెల్లడించారు. ఆయా పనుల నిర్వహణలో నిధుల దుర్వినియోగం జరగలేదని, సాంకేతిక పరమైన ఏవైనా అంశాలు ఉంటే పాటించకపోవడం వంటిదే జరిగిందని వారు తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం ఉపాధి నిధులు నిలిపేసేంత స్థాయిలో ఈ పథకం అమల్లో ఉల్లంఘనలు జరగలేదని అధికారులు చెపుతున్నారు.  

మరిన్ని వార్తలు