ఫాస్టాగ్‌ ఉంటేనే రాయితీలు

28 Aug, 2020 05:14 IST|Sakshi

రహదారులపై టోల్‌ చెల్లింపు విధానంలో కొత్త నిర్ణయాలు 

గెజిట్‌ విడుదల చేసిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ 

పాత విధానం రద్దు దిశగా అడుగులు 

సాక్షి, హైదరాబాద్‌: టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లించే విధానాన్ని త్వరలోనే పూర్తిగా నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. టోల్‌ రుసుము మొత్తం ఫాస్టాగ్‌ విధానంలో చెల్లించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫాస్టాగ్‌ మొదలైన తర్వాత కూడా ఇంకా 40 శాతం మంది వాహనదారులు టోల్‌ ఫీజును నగదు రూపంలో చెల్లిస్తున్నారు. దీన్ని పూర్తిగా నియంత్రించి క్రమంగా వాహనదారులంతా ఫాస్టాగ్‌ పొందేలా కొన్ని నెలలుగా ముమ్మ రంగా ప్రచారం చేస్తోంది. అయినప్పటికీ వాహనదారుల్లో ఇంకా ఆశించిన స్థాయి స్పందన ఉండడం లేదని భావిస్తున్న కేంద్రం ఉపరితల రవాణా శాఖ క్రమంగా నగదు చెల్లించేవారిని నియంత్రించేందుకు కొత్త మార్గాలు ఎంచుకుంటోంది. ఈ క్రమంలోనే టోల్‌ చెల్లింపులో ఉన్న రాయితీలన్నింటినీ కేవలం ఫాస్టాగ్‌ చెల్లింపుదారులకే పరిమితం చేయాలని నిర్ణయించించింది. వాస్తవానికి ఈ నిర్ణయం లాక్‌డౌన్‌ కంటే ముందే తీసుకున్నా దాని అమలు పూర్తిస్థాయిలో ప్రారంభించలేదు. తాజాగా దీనికి సంబంధించి కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఓ గెజిట్‌ విడుదల చేసింది. దీన్ని కచ్చితంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల్లోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులను కేంద్రం ఆదేశించింది. 

రాయితీలు ఇవే..  
24 గంటల్లో వస్తే తగ్గింపు హుళక్కే 
టోల్‌గేట్‌ దాటిన ఇరవై నాలుగు గంటల్లోనే తిరుగుప్రయాణంలో వస్తే రాయితీ ఉంది. తిరుగు ప్రయాణపు టోల్‌ చార్జీలో 50 శాతం రాయితీ ఉంటుంది. ఇప్పటివరకు వాహనదారులంతా ఇది పొందుతున్నారు. ఇక నుంచి ఫాస్టాగ్‌ ఉన్న వాహనదారులు మాత్రమే దీన్ని పొందే అవకాశం ఉంది. ఫాస్టాగ్‌ లేకుండా నగదు ద్వారా టోల్‌ ఫీజు చెల్లించే వాహనదారులు పూర్తి చార్జీని భరించాల్సిందే. 

⇒ లోకల్‌ డిస్కౌంట్‌ కూడా.. 
టోల్‌గేట్‌కు 10 కిలోమీటర్ల పరిధిలో ఉండే వాహనదారులకు ప్రత్యేక లోకల్‌ డిస్కౌంట్‌ వసతి ఉంది. టోల్‌ రుసుములో నిర్ధారిత మొత్తం రాయితీ రూపంలో తగ్గింపు లభిస్తుంది. దాన్ని స్థానికులు పొందుతున్నారు. ఇప్పుడు ఇది కూడా ఫాస్టాగ్‌ ఉంటేనే పొందే అవకాశం ఉంది. 

 నెలవారీ పాస్‌కు ఫాస్టాగ్‌ 
క్రమంగా టోల్‌ గేట్లు ఉన్న రోడ్లపై ప్రయాణించేవారు నెలవారీ పాస్‌లు పొందు తుంటారు. ఒకేసారి నెల చార్జీ చెల్లిస్తుండడంతో టోల్‌లో కొంత తగ్గుదల ఉంది. ఇప్పుడు ఆ పాస్‌లను కేవలం ఫాస్టాగ్‌ ఉన్నవారికి మాత్రమే ఇస్తారు. మిగతా వారు ఏరోజుకారోజు చెల్లించాల్సిందే. దీంతో వారికి టోల్‌ భారం పెరుగుతుంది. 

⇒ త్వరలో అన్ని గేట్లూ ఫాస్టాగ్‌కే 
నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం రహదారులపై టోల్‌ ఫీజు విషయంలోనూ దాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతోపాటు రోడ్లపై నగదు రూపంలో టోల్‌ చెల్లించాల్సి రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. దీన్ని నియంత్రించి గేట్ల వద్ద వాహనాలు నిలపాల్సిన పని లేకుండా ఫాస్టాగ్‌ విధానం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే

మరిన్ని వార్తలు