కార్మిక హక్కులను కాపాడాలి 

30 Mar, 2022 02:00 IST|Sakshi
టీఎస్‌పీఈజేఏసీ ఆధ్వర్యంలో మింట్‌కాంపౌండ్‌లో ఆందోళన చేస్తున్న విద్యుత్‌ ఉద్యోగులు 

వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్‌ డిమాండ్‌ 

రెండో రోజు రాష్ట్రంలో కొనసాగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె 

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా రెండు రోజులపాటు జరిగిన కార్మికుల సమ్మె తెలంగాణలో పాక్షికంగా, ప్రశాంతంగా ముగిసింది. సింగరేణి, జాతీయ బ్యాంకుల సిబ్బంది, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. వామపక్షాలు సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ.. కార్మిక హక్కులను కాపాడాలని, రైతులకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

 సమ్మెలో భాగంగా రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. బ్యాంకులు మూతపడ్డాయి. సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపులో భాగంగా హైదరాబాద్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌ మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ దోపిడీదారుల కోసమే ప్రధాని నిరంకుశ విధానాలు అవలంభిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ఆరోపించారు. 

విద్యుత్‌ సంస్థల జోలికొస్తే మసే.. 
విద్యుత్‌ సంస్థలు, ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించినట్లు చరిత్రలో లేదని, తమ జోలికొస్తే.. మాడిమసై పోతారని విద్యుత్‌ ఉద్యోగులు హెచ్చరించారు. తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు మంగళవారం వేర్వేరుగా      మహాధర్నాలు నిర్వహించారు. టీఎస్‌పీఈజేఏసీ ఆధ్వర్యంలో మింట్‌కాంపౌండ్‌లో, టీఈఈఏ   ఆధ్వర్యంలో విద్యుత్‌ సౌధలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

అలాగే విద్యుత్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సైబర్‌సిటీ ఎస్‌ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వేర్వేరుగా నిర్వహించిన ఈ మహాధర్నాల్లో ఆయా అసోసియేషన్ల ప్రతినిధులు పి.రత్నాకర్‌రావు, పి. సదానందం, సాయిబాబు, అనిల్‌కుమార్, ఎన్‌.శివాజీ, రామేశ్వర్‌శెట్టి, వినోద్, తుల్జా రాంసింగ్, పి.అంజయ్య, పరమేష్, వెంకటేశ్వర్లు, వీరస్వామి, బాలచంద్రుడు, గోవర్థన్, కొండా రెడ్డి, శ్రీనివాస్, నాగరాజు, మురలయ్య, తులసినాగరాణి, వెంకన్నగౌడ్, శ్యామ్‌మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు