గత వానాకాలం సీఎంఆర్‌ గడువు పెంపు

27 Oct, 2022 02:06 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో నవంబర్‌ 30 వరకు గడువు

అదనంగా మరో 4 ఎల్‌ఎంటీ ‘ఫోర్టిఫైడ్‌’రైస్‌కి అనుమతి

ఇటీవలే 8 ఎల్‌ఎంటీకి అనుమతిచ్చిన కేంద్రం

రాష్ట్ర ప్రభుత్వానికి రూ.180 కోట్ల మేర ఆదా: మంత్రి గంగుల

సాక్షి, హైదరాబాద్‌: గత సంవత్సరం వానాకాలం (2021–22) సీజన్‌కు సంబంధించి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) గడువును కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పెంచింది. సెప్టెంబర్‌ నెలాఖరుతో ముగిసిన ఈ గడువును పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు పలుమార్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖను అభ్యర్థించినా స్పందించలేదు.

దీంతో అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని మిల్లులనుంచి వానాకాలం సీజన్‌కు సంబంధించి సీఎంఆర్‌ తీసుకోవడం లేదు. గత వానాకాలం సీజన్‌లో 70.22 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, సీఎంఆర్‌ కింద 47.04 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సెంట్రల్‌ పూల్‌ ద్వారా ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. కానీ సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి 30 ఎల్‌ఎంటీ బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి ఇచ్చారు.

మరో 17 ఎల్‌ఎంటీ అప్పగించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ, ఎఫ్‌సీఐ అధికారులతో మాట్లాడిన ఆయన, నవంబర్‌ వరకు గడువు ఇస్తే పూర్తిస్థాయిలో సీఎంఆర్‌ అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అశోక్‌కుమార్‌ వర్మ నవంబర్‌ ఆఖరు వరకు గడువు పెంచుతూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. 

యాసంగి ఫోర్టిఫైడ్‌ రైస్‌.. మరో 4 ఎల్‌ఎంటీకి కేంద్రం అనుమతి
గత యాసంగిలో ఉత్పత్తి అయిన ధాన్యం నుంచి సీఎంఆర్‌ కింద అదనంగా 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ఫోర్టిఫైడ్‌ పారాబాయిల్డ్‌ రైస్‌ను సెంట్రల్‌పూల్‌కు తీసుకునేందుకు కూడా కేంద్రం ఒప్పుకున్నట్లు మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. గత జూలై నుంచి కురిసిన వర్షాలకు మిల్లుల్లోని ధాన్యం తడిసిపోగా, ముడి బియ్యంగా సీఎంఆర్‌ చేయడానికి పనికిరాని పరిస్థితి నెలకొందని తెలిపారు.

అలాగే సాధారణ యాసంగి ధాన్యం సైతం ముడిబియ్యంగా మిల్లింగ్‌ చేస్తే నూకలు ఎక్కువ వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల 8 లక్షల మెట్రిక్‌ టన్నుల యాసంగి ధాన్యాన్ని ఫోర్టిఫైడ్‌ పారాబాయిల్డ్‌ బియ్యంగా తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. తాజా అనుమతితో కలిపి మొత్తం 12 ఎల్‌ఎంటీ పారాబాయిల్డ్‌ ఫోర్టిఫైడ్‌ రైస్‌ను సెంట్రల్‌పూల్‌కు ఇస్తామని చెప్పారు. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.180 కోట్లు ఆదా అవుతాయని మంత్రి గంగుల కమలాకర్‌ హర్షం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు