మరో 8 ఎల్‌ఎంటీలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

12 Aug, 2022 02:44 IST|Sakshi

పారాబాయిల్డ్‌ ఫోర్టిఫైడ్‌ రైస్‌ సేకరణకు కేంద్రం ఓకే 

సాక్షి, హైదరాబాద్‌: యాసంగి ధాన్యం నుంచి మరో 8 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) ఫోర్టిఫైడ్‌ పారాబాయిల్డ్‌ రైస్‌ (పౌష్టికాహార ఉప్పుడు బియ్యం)ను సెంట్రల్‌ పూల్‌కు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి గురువారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. కేంద్రం గతంలో సెంట్రల్‌ పూల్‌ కింద తీసుకునేందుకు అంగీకరించిన 6.05 ఎల్‌ఎంటీల ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌కు ఇది అదనం.

దీంతో పాటు తడిసిన యాసంగి ధాన్యానికి సంబంధించి 3 ఎల్‌ఎంటీల ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌ తీసుకునేందుకు 2 రోజుల కిందట కేంద్రం అంగీకరించింది. అంటే ఈ యాసంగి సీజన్‌ కు సంబంధించి మొత్తం 17.05 ఎల్‌ఎంటీల ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి సేకరించనుందన్న మాట.  

రాష్ట్ర రైతులు ఇబ్బంది పడకూడదనే సేకరణ 
తెలంగాణ నుంచి మరో 8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఫోర్టిఫైడ్‌ పారాబాయిల్డ్‌ రైస్‌ సేకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది: మంత్రి గంగుల 
‘యాసంగి ధాన్యం మిల్లింగ్‌ విషయంలో సమస్యను కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లాం. దీంతో  కేంద్రం స్పందించింది. 8 ఎల్‌ఎంటీల ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌ తీసుకునేందుకు అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది.’    

మోదీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం: బండి సంజయ్‌ 
‘రాష్ట్రం నుంచి 8 ఎల్‌ఎంటీల ఫోర్టిఫైడ్‌ పారాబాయిల్డ్‌ రైస్‌ సేక రించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. రైతులు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మోదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ప్రధానికి, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్‌ గోయల్‌కు కృతజ్ఞతలు.’  

మరిన్ని వార్తలు