బ్లాక్‌ ఫంగస్‌ మహమ్మారే!

21 May, 2021 02:04 IST|Sakshi
బ్లాక్‌ ఫంగస్‌తో బాధపడుతూ కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో చేరిన బాధితుడు

అంటువ్యాధుల చట్టం కిందకు మ్యూకోర్‌మైకోసిస్‌ 

బ్లాక్‌ ఫంగస్‌పై అప్రమత్తం.. కేసుల గుర్తింపు, చికిత్సలో ప్రత్యేక నిబంధనలు 

రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు 

తెలంగాణ సహా 3 రాష్ట్రాల్లో అలర్ట్‌ 

వివరాలు ఇవ్వాలని ఆస్పత్రులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదేశాలు 

రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు..కోఠి ఈఎన్‌టీకి భారీగా బాధితులు 

కొత్తగా వైట్‌ ఫంగస్‌ కలకలం..పట్నాలో నలుగురికి గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సోకి, కోలుకున్నామన్న సంతోషం తీరకముందే బ్లాక్‌ ఫంగస్‌ కాటేస్తోంది. ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చేశామన్న ఆనందం రెండుమూడు రోజులకే ఆవిరవుతోంది. మొదట్లో కరోనా సోకిన కొందరిలోనే కనిపించిన ఈ బ్లాక్‌ ఫంగస్‌.. కొద్దిరోజులుగా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా తెలంగాణ సహా 8 రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘బ్లాక్‌ ఫంగస్‌ (మ్యూకోర్‌మైకోసిస్‌)’ మహమ్మారేనని కేంద్రం గురువారం ప్రకటించింది. పరిస్థితి ఆందో ళనకరంగా మారుతోందని, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. బ్లాక్‌ ఫంగస్‌ను అంటువ్యాధుల చట్టం కింద మహమ్మారిగా గుర్తించాలని.. కేసుల నమోదు, చికిత్సలో ప్రత్యేక నిబంధనలు పాటించాలని ఆదేశించింది.

దీనిపై స్పందించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ  బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, అనుమానితులు, చికిత్స వివరాలు ఇవ్వాలని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆదేశించింది. రాష్ట్రంలో మూడు రోజులుగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలోనే 90 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. గురువారం కూడా వందలాది మంది బాధితులు చికిత్స కోసం వచ్చారు. పలు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ పదుల సంఖ్యలో బాధితులు ఉన్నట్టు సమాచారం. బ్లాక్‌ ఫంగస్‌పై మరీ ఆందోళన అవసరం లేదని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖానికి సంబంధించి కొత్తగా ఏ సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. 

వైట్‌ ఫంగస్‌ కూడా..!
ఓవైపు బ్లాక్‌ ఫంగస్‌ విరుచుకుపడుతోంటే.. మరోవైపు వైట్‌ ఫంగస్‌ కూడా దాడి మొదలుపెట్టింది. ఇప్పటికే బీహార్‌లో నాలుగు కేసులు నమోదు అయ్యాయి. బ్లాక్‌ ఫంగస్‌ కన్నా ఇది మరింత ప్రమాదకరమని, శరీరంలోని అన్ని అవయవాలపైనా దాని ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తులతో పాటు చర్మం, మూత్రపిండాలు, గోర్లు, కడుపు, జననేంద్రియాలకూ వ్యాపిస్తుందని.. సులువుగా ఇతరులకు సోకే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు