ధాన్యం సేకరణకు మిల్లర్లకు అవకాశమివ్వాలి

11 Nov, 2021 05:09 IST|Sakshi

దక్షిణ భారత రైస్‌ మిల్లర్ల సమాఖ్య అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి 

ధాన్యం కాకుండా బియ్యాన్ని సేకరించాలి 

అనుమతిస్తే బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తాం 

లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌): రైతుల నుంచి మిల్లర్లు నేరుగా ధాన్యం సేకరించడానికి అవకాశమివ్వాలని దక్షిణ భారత రైస్‌ మిల్లర్ల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.  అలాగే ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాల్లో కూడా కొనుగోళ్లు కొనసాగించాలని అన్నారు. ధాన్యం కాకుండా బియ్యం సేకరణ చేయాలన్నారు. బాయిల్డ్‌ రైస్, రా రైస్‌ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని చర్చించకుండా ఇటు రైతులను అటు మిల్లర్లను ఇబ్బందుల్లోకి నెట్టేయడం తగదన్నారు. బియ్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు.

దాంతో ఎప్పటికప్పుడు బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం అనుమతిస్తే తామే విదేశాలకు ఎగుమతి చేసుకుంటామన్నారు. బుధవారం ఆయన హరితా ప్లాజాలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రతి ధాన్యం గింజ కొంటామంటూనే తగిన ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం రైతులను సంక్షోభంలోకి నెడుతోందన్నారు. రైతుల సంక్షేమం, వినియోగదారులకు లాభం చేకూరే కోణంలో కేంద్రం ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర, రాష్ట్ర అనాలోచిత విధానాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు.  క్షేత్రస్థాయిలో గన్నీ సంచులు, హమాలీల కొరత, రవాణా, గోదాముల సమస్యలున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు ఐకేపీ కేంద్రాల వద్ద కూడా కమీషన్ల పేరిట నష్టపోతున్నారని, బియ్యం సేకరణ వేగవంతం చేయకపోవడంతో రైస్‌మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధాన్యం దిగుబడిని తగ్గించాలనుకోవడం సమస్యకు పరిష్కారం కాదన్నారు.  సమావేశంలో హైదరాబాద్‌ సంఘం అధ్యక్షుడు పబ్బ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు