550 కోట్ల కేంద్ర నిధులు హుళక్కే!

4 Nov, 2022 01:51 IST|Sakshi

ఎస్సీ విద్యార్థుల ఉపకార, ఫీజు నిధుల వాటా విడుదలకు కేంద్రం షరతులు 

ఒప్పుకోని రాష్ట్ర ప్రభుత్వం.. రెండేళ్లుగా నిలిచిన నిధులు 

సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ కోర్సులు చదువుతున్న దళిత విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ సాయం బంద్‌ అయ్యింది. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ విధించిన షరతులతో రెండేళ్లుగా ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల కాలేదు. షరతులకు లోబడి పథకాన్ని అమలు చేస్తేనే నిధులిస్తామని కేంద్రం పేర్కొనగా వాటిని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంది.

దీంతో రెండేళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి విడుదల కావాల్సిన రూ. 550 కోట్లు వచ్చే అవకాశం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా 2021–22 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక కోటాలో నిధులు విడుదల చేసింది. వాటిని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు విద్యార్థుల ఖాతాల్లో జమ చేశారు. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ అభివృద్ధి శాఖ వద్ద ఉన్న నిధులను సర్దుబాటు చేస్తూ సీనియర్‌ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించింది. ఈ రెండేళ్లకు సంబంధించి కేంద్ర వాటా విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. 

ఎందుకిలా... షరతులేంటి?: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇవ్వగా కేంద్రం 40 శాతం నిధులిచ్చింది. 2021–22 వార్షిక సంవత్సరం నుంచి కేంద్రం ఎస్సీ విద్యార్థులకు మరింత ఎక్కువ బడ్జెట్‌ను కేటాయిస్తూ 60 శాతం కేంద్రం భరిస్తూ 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేలా మార్పులు చేసింది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై కొంతమేర భారం తగ్గనుందని అధికారులు సైతం భావించారు. కానీ తాము నిర్దేశించినట్లుగానే పథకాన్ని అమలు చేయాలంటూ కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి విద్యార్థి వివరాలను తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు కాకుండా లబ్ధిదారుల ఖాతాలకే నేరుగా పంపుతామని తెలిపింది.

అయితే ఈ నిబంధనలకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీల యాజమాన్యాలకు చెల్లిస్తున్నందున కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థుల వివరాలను సమర్పిస్తే పథకం అమలు స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం భావించి మిన్నకుండిపోయింది. ఫలితంగా రెండేళ్లుగా కేంద్రం తన వాటా నిధుల విడుదలను నిలిపేసింది.   

మరిన్ని వార్తలు