ఇ–వాణిజ్యంపై జాతీయ విధానం

19 Apr, 2022 03:50 IST|Sakshi
సమావేశంలో విజయసాయిరెడ్డి, నామా నాగేశ్వరరావు, మంత్రి కేటీఆర్‌ తదితరులు 

కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ సూచన 

పారిశ్రామిక ప్రోత్సాహకాలు, విధానపరమైన నిర్ణయాలతోనే మేకిన్‌ ఇండియా సాధ్యం 

ప్రాంతీయ భాషల్లో డిజిటల్‌ అక్షరాస్యత ప్రోత్సహించాలి 

విజయసాయి రెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: ఇ–కామర్స్‌పై జాతీయ విధానానికి రూపకల్పన చేయడంతో పాటు ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్‌ సెక్యూరిటీ, మొబైల్‌ చెల్లింపులు, ఉత్తమ ఇంటర్‌నెట్‌కు సంబంధించి కేంద్రం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పారిశ్రామిక ప్రోత్సాహకాలు, తీసుకునే విధానపరమైన నిర్ణయాలతోనే మేకిన్‌ ఇండియా నినాదం ఆచరణ సాధ్యమవుతుందని అన్నారు. వాణిజ్యం (కామర్స్‌)పై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం తెలంగాణ శాసనసభ కమిటీ హాల్‌లో సోమవారం కమిటీ చైర్మన్, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. 

సైబర్‌ నేరాల కట్టడికి చట్టం 
సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇతర సాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను భారత్‌ అందిపుచ్చుకునేందుకు విధాన నిర్ణయాలు, మౌలిక వసతుల కల్పనపై వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ఇ–కామర్స్, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పుల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు అవకాశముందని చెప్పారు. ప్రాంతీయ భాషల్లో డిజిటల్‌ అక్షరాస్యత పెంచడంపై దృష్టి సారించాలని, భారత్‌ నెట్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ ఇంటర్‌నెట్‌కు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. సైబర్‌ నేరాలను కట్టడి చేసేందుకు నల్సార్‌ యూనివర్సిటీ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకురానున్న ప్రత్యేక చట్టం తరహాలో జాతీయ స్థాయిలోనూ చట్టం అవసరమని పేర్కొన్నారు. 

తెలంగాణపై వివక్ష 
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పుడే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ౖతెలంగాణ అభివృద్ధి అంటే భారత్‌ అభివృద్ధి అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ సంపద దేశంలోని ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వినియోగం అవుతుండటం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. అయితే అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని, విభజన హామీల అమలు, వివిధ పథకాల కింద అందాల్సిన సాయంపై కేంద్రం శీతకన్ను వేసిందన్నారు. బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, నేషనల్‌ డిజైన్‌ సెంటర్, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు, ఇండస్ట్రియల్, డిఫెన్స్‌ కారిడార్లు, హైదరాబాద్‌ ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులకు అవసరమైన ఆర్థిక సాయం ఇవ్వడంలో కేంద్రం సానుకూలంగా స్పందించడం లేదన్నారు. 

ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేయాలి     
దేశంలోని సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేయాలని, ఆదిలాబాద్‌లోని సీసీఐ యూనిట్‌ను పునరుద్ధరించాలని కేటీఆర్‌ కోరారు. సమావేశంలో కమిటీ సభ్యులుగా ఉన్న ఎంపీలు సంతోష్‌కుమార్‌ గంగ్వార్, రూపా గంగూలీ, మంజులత మండల్, ప్రసూన్‌ బెనర్జీ, గౌతమ్‌ సింగమని పొన్, నామా నాగేశ్వర్‌రావుతో పాటు తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి.నర్సింహాచార్యులు, వాణిజ్య సంఘాలు ఫిక్కి, డిక్కి ఫార్మా, ఎస్‌బీఐ ప్రతినిధులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు