‘పారాబాయిల్డ్‌ రైస్‌ కొనం’.. అసలు ఉప్పుడు బియ్యం అంటే ఏంటి

20 Nov, 2021 20:37 IST|Sakshi

ప్రశ్నార్థకంగా రైస్‌మిల్లుల భవితవ్యం

నల్గొండ జిల్లాలో 200కు పైగా  పారా బాయిల్డ్‌ మిల్లులు

కేంద్ర ఉప్పుడు బియ్యం తీసుకోకపోతే మిల్లర్లకు తీవ్ర నష్టం

వాటిపై ఆధారపడిన సిబ్బంది,  కూలీల జీవనోపాధి కష్టమే

సాక్షి, నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం విషయంలో తీసుకున్న నిర్ణయంతో పారాబాయిల్డ్‌ మిల్లుల భవిషత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 250 మిల్లులు ఉండగా అందులో 209 వరకు పారాబాయిల్డ్‌ రైస్‌ మిల్లులే. అవన్నీ కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కోసం ఏర్పాటు చేసినవే. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసి ఇచ్చిన దొడ్డు రకం ధాన్యాన్ని మిల్లులు బియ్యంగా మార్చి సీఎంఆర్‌ కింద ప్రభుత్వానికి అందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇస్తోంది. ఇప్పుడు ఉప్పుడు బియ్యం పట్ల దేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లో అంతగా ఆసక్తి చూపడం లేదని, పైగా ఇతర రాష్ట్రాల్లోనూ వరి విస్తీర్ణం పెరిగిందని, దీంతో ఉప్పుడు బియ్యం తీసుకోబోమని, రా రైస్‌ మాత్రమే తీసుకుంటాని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో జిల్లాలోని బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు ఇబ్బందుల్లో పడే ప్రమాదం నెలకొంది.  

ఇదీ పరిస్థితి..
వానాకాలంలో సాగు చేసే సన్న రకం (పచ్చి బియ్యం) ధాన్యాన్ని రైతులు కొంతమేర తినడానికి ఉంచుకోగా మిగతా వాటిని మిల్లర్లు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. యాసంగిలో మాత్రం రైతులు దొడ్డు ధాన్యాన్ని అధికంగా సాగు చేస్తారు. ఈ యాసంగి సీజన్‌లో నల్లగొండ జిల్లాలో 1,84,576 హెక్టార్లలో వరి సాగు చేయగా, 11,03,421 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. సూర్యాపేటలో 1,87,808 హెక్టార్లలో వరి సాగు చేయగా, 11,26,858 మెట్రిక్‌ టన్నులు, యాదాద్రిలో 1.12 లక్షల హెక్టార్లలో వరి సాగుచేయగా.. ఏడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి రానుంది.

మొత్తంగా వచ్చే 29 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యంలో సాధారణ రకం (దొడ్డు బియ్యం) 15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మిగతా సన్నరకం ధాన్యం మిల్లర్లే కొనుగోలు చేస్తున్నారు. యాసంగిలో పండే వరి ధాన్యం మిల్లుల్లో ఆడిస్తే నూకల శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి మిల్లర్లు యాసంగిలో వచ్చే ధాన్యాన్ని బాయిల్డ్‌ చేసి ఉప్పుడు బియ్యాన్ని ప్రభుత్వానికి సీఎంఆర్‌ కింద ఇస్తే ఇతర దేశాలు, రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ వస్తున్నారు.  

నిర్వహణ కష్టమే..
నల్లగొండ జిల్లాలో 130 వరకు మిల్లులు ఉండగా అందులో 110 పారాబాయిల్డ్‌ మిల్లులే ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 83 రైస్‌ మి ల్లులు ఉండగా అందులో 66 పారాబాయిల్డ్‌ మిల్లులు ఉన్నాయి. మరోవైపు యాదాద్రి 37 మిల్లులు ఉంటే అందులో 33 పారాబాయిల్డ్‌ మిల్లులు ఉన్నాయి. మొత్తం మిల్లులు 250 ఉంటే అందులో 209 పారాబాయిల్డ్‌ మిల్లులే. వాటిపైనే ఈ ప్రభావం తీవ్రంగా పడనుంది. ప్రభుత్వం సీఎంఆర్‌ కోసం ధాన్యం కొనుగోలు చేసి ఇస్తేనే అవి నడుస్తాయి. ఇప్పుడు కేంద్రం బాయిల్డ్‌ రైస్‌ తీసుకోబోమని చెప్పడంతో మిల్లర్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

కేంద్రం ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయకపోతే ఉమ్మడి జిల్లాలో 209 మిల్లుల పరిస్థితి ప్రశ్నార్ధకమే. పారాబాయిల్డ్‌ మిల్లులను రా రైస్‌ మిల్లులగా మార్చాలంటే మిల్లులో కొని పార్టులను మార్చాలి. దానికి కూడా పెద్దఎత్తున ఖర్చవుతుంది. ఇప్పటికే మిల్లులు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక్కో మిల్లుకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు వేచ్చించారు. ఈ దశలో కొందరు మిల్లులను మూసివేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా ఒక్కో మిల్లులో పనిచేసే 60 నుంచి 70 మంది సిబ్బంది జీవనోపాధి కోల్పోతారు.

మిల్లర్లు నష్టపోతారు
బాయిల్డ్‌ రైస్‌ తీసుకోకపోతే మిల్లర్లు తీవ్రంగా నష్టపోతారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల ధాన్యం తడిసి నూక శాతం పెరిగి 30 నుంచి 40 శాతమే రైస్‌ వస్తుంది. బాయిల్డ్‌ అయితే నూక శాతం తగ్గుతుంది. ఆ అవకాశం లేకపోతే తీవ్ర నష్టం తప్పదు.
–కేశవరెడ్డి, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్,   నకిరేకల్‌ డివిజన్‌ అధ్యక్షుడు 

మరిన్ని వార్తలు