చిరుధాన్యాలతో రక్తహీనతకు చెక్‌

20 Oct, 2021 04:37 IST|Sakshi

హిమోగ్లోబిన్, ఫెర్రిటిన్‌ మోతాదుల్లో వృద్ధి: ఇక్రిశాట్‌ చిరుధాన్యాలు.. ఆరోగ్య ‘సిరి’ధాన్యాలు అని అందరికీ తెలుసు. మధుమేహం, గుండె సంబంధిత సమస్యల నియంత్రణలో చిరుధాన్యాలు మేలు చేస్తాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. వీటితో రక్తహీనతకూ చెక్‌ పెట్టొచ్చని తాజా పరిశోధన తేల్చిచెప్పింది. 
–సాక్షి, హైదరాబాద్‌  

చిరుధాన్యాలకు పుట్టినిల్లు తెలంగాణ. వరిసాగు పెరిగాక... వాటి సాగు, వాడకం తగ్గిపోయింది. ఆరోగ్య స్పృహ పెరగడంతో మళ్లీ చిరుధాన్యాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ చిరుధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్‌తోపాటు రక్తంలోని ఫెర్రిటిన్‌ మోతాదు కూడా పెరుగుతుందని అంతర్జాతీయ పరిశోధన ఒకటి తెలిపింది. అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌) నేతృత్వంలో నాలుగు దేశాల్లోని ఏడు సంస్థలు రక్తహీనత, చిరుధాన్యాల వాడకంపై పరిశోధన నిర్వహించాయి. 22 అధ్యయనాల పునఃసమీక్ష ఆధారంగా తాజా విషయాలను ఇక్రిశాట్‌ వెల్లడి చేసింది. 

ఫెర్రిటిన్‌ మోతాదు సగం హెచ్చు... 
రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఆరికలు, సామలు.. ఇలా మొత్తం ఆరు చిరుధాన్యాలను ఆహారంగా తీసుకున్న వెయ్యిమందిపై ఇప్పటికే జరిగిన అధ్యయనాల ఫలితాలను తాము విశ్లేషించామని, ఇతరులతో పోలిస్తే వీరిలో హిమోగ్లోబిన్‌ మోతాదు 13.2 శాతం, ఇనుము కలిగి ఉన్న ప్రొటీన్‌ ఫెర్రిటిన్‌ 54.7 శాతం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని తాజా అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇక్రిశాట్‌ సీనియర్‌ పౌషకాహారవేత్త డాక్టర్‌ ఎస్‌.అనిత తెలిపారు.

21 రోజులనుంచి నాలుగున్నరేళ్ల పాటు చిరుధాన్యాలను ఆహారంగా తీసుకున్నవారిపై అధ్యయనం నిర్వహించినట్లు ఆమె చెప్పారు. ‘‘చిరుధాన్యాలు సగటు మనిషికి అవసరమైన రోజువారీ ఇను ము మొత్తాన్ని అందించగలవని స్పష్టమైంది. కానీ తినే ధాన్యం, ఎలా శుద్ధి చేశారన్న అంశాలను బట్టి ఎంత మోతాదులో అందుతుందనేది ఆధారపడి ఉంది. దీన్ని బట్టి రక్తహీనత సమస్యను ఎదుర్కొనేందుకు చిరుధాన్యాలు బాగా ఉపయోగపడతా యని స్పష్టంగా చెప్పవచ్చు’’అని డాక్టర్‌ అనిత వివ రించారు. ఫ్రాంటియర్స్‌ ఇన్‌ న్యూట్రిషన్‌ తాజా సం చికలో అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి.  

174 కోట్ల మందిలో సమస్య.. 
ప్రపంచవ్యాప్తంగా రక్తహీనతను ఎదుర్కొంటున్న వారు 174 కోట్ల మంది ఉన్నారు. వీరి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జాక్వెలిన్‌ హ్యూగ్స్‌ తెలిపారు. రక్తహీనత పిల్లల మానసిక, శారీరక అభివృద్ధిని నిరోధిస్తుందని ఇప్పటికే పలు పరిశోధనలు తెలిపాయని, వీటికి పరిష్కారం చిరుధాన్యాల వాడకమేననని ఆయన వివరించారు. చిరుధాన్యాల్లోని సూక్ష్మపోషకాలు శరీరానికి అందవనడంలో ఏ మాత్రం నిజం లేదని, మిగిలిన ఆహార పదార్థాలతోపాటు చిరుధాన్యాలను తీసుకున్నప్పుడు, వాటిలోని ఇనుమును శరీరం శోషించుకుంటోందని ఈ అధ్యయనంలో స్పష్టమైందని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.హేమలత తెలిపారు.

‘మై ప్లేట్‌ ఫర్‌ ద డే’పేరుతో చిరుధాన్యాలను ఎలా వాడుకోవచ్చో తెలిపామని, ఈ రకమైన ఆహారం ద్వారా భారత్‌లో రక్తహీనత సమస్యను అధిగమించవచ్చని ఆమె చెప్పారు. పులియబెట్టడం, పాప్‌కార్న్‌ మాదిరిగా చేయడం ద్వారా చిరుధాన్యాల్లోని ఇనుము మూడు రెట్లు అధికంగా అందుతుందని, పిండిని ఆవిరిలో ఉడికించి చేసే ఆహారం ద్వారా 5.4 రెట్లు అందుతుందని, మొలకెత్తినవి, పొట్టు తొలగించినవి తినడం వల్ల రెండు రెట్లు ఎక్కువ ఇనుము శరీరానికి అందుతుందని ఆమె వివరించారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు