అంతా కలిసి రండి

1 Oct, 2021 01:41 IST|Sakshi
‘ప్రభుత్వాల బందీగా ప్రజాస్వామ్యం’ పేరుతో తాను రాసిన  పుస్తకాన్ని భట్టి విక్రమార్కకు అందజేస్తున్న చాడ వెంకట్‌ రెడ్డి 

అక్టోబర్‌ 2 నుంచి డిసెంబర్‌ 9 వరకు విద్యార్థి, నిరుద్యోగ పోరాటం చేద్దాం 

అఖిలపక్ష భేటీలో సీఎల్పీ నేత భట్టి 

ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వడంలో కేసీఆర్‌ విఫలం: చాడ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నియంత పాలన సాగుతోందని, అనుకున్న లక్ష్యాల కోసం అంతా కలిసి పోరాటం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. గురువారం గాంధీభవన్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. సీఎల్పీ నేత భట్టి అధ్యక్షతన జరిగి ఈ భేటీకి సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, టీజేఎస్‌ ఉపాధ్యక్షుడు ప్రొ. విశ్వేశ్వరరావ్, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, కాంగ్రెస్‌ నాయకులు మల్లు రవి, న్యూ డెమోక్రసీ, టీటీడీపీ, లిబరేషన్‌ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. అక్టోబర్‌ 2 నుంచి డిసెంబర్‌ 9 వరకు చేపట్టిన విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని భట్టి అఖిలపక్ష నేతలను కోరారు.

అన్ని పక్షాలు సూత్రప్రాయంగా మద్దతు తెలిపాయని, అదే విధంగా పోడు భూములు, ఇతర సమస్యలపై కాంగ్రెస్‌ చేసే పోరాటానికి మద్దతు తెలుపుతామని చెప్పాయన్నారు. ఆయా పార్టీలే కాకుండా వాటి అనుబంధ సంఘాలు కూడా తమతో కలిసి వస్తాయని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం అందరం కలిసి పోరాటం చేశామని, సాధించుకున్న తెలంగాణలో పోరాట లక్ష్యాలు నెరవేరేందుకు మరింతగా పోరాడిల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. తెలంగాణలో నిరసన కార్యక్రమాలు చేసే హక్కు కూడా లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కనీసం ఖాళీలను కూడా భర్తీ చేయడం లేదని ధ్వజమెత్తారు.

తాము అసెంబ్లీలో పోరాటం చేస్తున్నామని, మీ అంశాలు తెలియజేస్తే మీ గొంతుకను కూడా శాసనసభలో వినిపిస్తామని భట్టి అన్నారు. సీపీఐ కార్యదర్శి చాడ మాట్లాడుతూ, కేంద్ర రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటంతోపాటు పోడు భూముల సమస్య పై పోరాటం ఉధృతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించామన్నారు. నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్‌తో కలసి పోరాటం చేస్తామన్నారు. ఉద్యోగాలు, నిరుద్యోగభృతి ఇవ్వడంలో కేసీఆర్‌ విఫలం అయ్యారని ఆరోపించారు. ఢిల్లీలో ప్రతిపక్షాలు కలిసి పనిచేసినట్లుగానే రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో మద్దతు తెలిపే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

మరిన్ని వార్తలు