ప్రాధాన్యత అంశాలపై చర్చ

26 Aug, 2020 10:38 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న సభ్యులు, అధికారులు

సాక్షి, ఆదిలాబాద్‌‌: జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాల్లో ప్రభుత్వ ప్రాధాన్యత పనులపై చర్చ జరిగింది. కోవిడ్‌–19, కమ్యూనిటీ టాయిలెట్స్, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, శ్మశాన వాటికలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, డంపింగ్‌ యార్డులు, ట్రాక్టర్ల కొనుగోళ్లు, ఉచిత బియ్యం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ, విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు, రోడ్లు, బ్రిడ్జీలు, ఇంటింటికి నల్లా నీళ్లు, తదితర అంశాలను చర్చించేందుకు సభ్యులు ఎక్కువ సమయం కేటాయించారు. కాగా, సమావేశాలకు హాజరుకాని సీపీవో, డీఈవో, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈపై చైర్మన్‌ జనార్దన్‌ అసహనం వ్యక్తం చేశారు. జిల్లాకు ఇన్‌చార్జి సీపీవోగా ఉన్న సమావేశాలకు ఎందుకు రాలేదని, ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. జిల్లా విద్యాధికారి కూడా గైర్హాజరయ్యారని డీఈవో తరఫున వచ్చిన అధికారిని ప్రశ్నించారు. ఇలా చేస్తే సరెండర్‌ చేస్తామని హెచ్చరించారు. పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ సమావేశానికి గైర్హాజరు కావడంతో ఆయనకు మెమో జారీ చేయాలని జెడ్పీ సిబ్బందిని ఆదేశించారు.

కాగా, మంగళవారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్, ఆయా కమిటీల అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగాయి. కోరం లేక రెండు స్థాయీ సమావేశాలు వాయిదా పడగా, ఐదింటిలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్, జెడ్పీ సీఈవో కిషన్, జెడ్పీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ మాట్లాడుతూ మేజర్‌ గ్రామ పంచాయతీల్లో మొబైల్‌ టాయిలెట్‌ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించాలని, ఈ విషయం జెడ్పీ స్టాండింగ్‌ కమిటీలో చర్చకు వచ్చినట్లు కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి తెలియపర్చాలన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల్లో వెనుకబడి ఉన్నందున పనులు జరగని చోట, కాంట్రాక్టర్లు ముందుకు రాని చోట ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ శాఖల ద్వారా నిర్మాణాలు చేపట్టాలని, ఈ విషయమై జెడ్పీ సమావేశంలో చర్చ జరిగిందని హౌసింగ్‌ ఎండీకి లెటర్‌ రాయాలని హౌసింగ్‌ మేనేజర్‌కు సూచించారు. ఐటీడీఏ ద్వారా ఎన్ని డబుల్‌ ఇళ్లు నిర్మిస్తున్నారో వివరాలివ్వాలని సంబంధిత అధికారిని కోరగా, వివరాలు లేకపోవడంతో చైర్మన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

సమావేశాలు ఇలా..
స్థాయీ సంఘం సమావేశాల్లో మొదటగా గ్రామీణాభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. చైర్మన్‌ జనార్దన్‌ అధ్యక్షతన వహించిన ఈ స్థాయీ సమావేశం ఎజెండాలో 11 అంశాలు ఉన్నాయి. ఇందులో అన్నింటిపై చర్చ జరిగినా.. ప్రాధాన్యత గల పనులపైనే లోతుగా చర్చించారు. గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేనిచోట, రద్దీ ప్రాంతాలు ఉన్న చోట మొబైల్‌ టాయిలెట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సభ్యులు కోరా రు. జిల్లాకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరై మూడేళ్లు గడుస్తున్నా ఇంకా నిర్మాణాలు పూర్తికావడం కాలేదని, 3213 ఇళ్లు మంజూరైతే కేవలం 455 ఇళ్లు పూర్తయ్యాయని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సభలో ప్రసావించారు. గాదిగూడలో పూర్తయిన ఇళ్లు లబ్ధిదారులకు కేటా యించుకున్నా.. ఇళ్లలో ఉంటున్నారని, ఇది అధికారుల బాధ్యత కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంట్రాక్టర్లు ముందుకు రాని చోట శాఖల ద్వారా పనులు చేయించాలన్నారు. సహకార శాఖ పరిధిలోని సొసైటీలు అటవీ భూ ములు సాగు చేస్తున్న వారికి రుణాలు ఇవ్వడం లేదని, వన్‌–బీ, పహణీ వాళ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారని భీంపూర్‌ జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్‌ సభలో ప్రస్తావించారు. ఈ సమస్య జిల్లా అంతా ఉందని సభ్యులు సభలో పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో కోటా ద్వారా రేషన్‌ బియ్యం ఇప్పించాలని, కొత్త డీలర్‌ను నియమించకున్నా.. ఉన్న డీలర్‌ను కొత్త, పాత రెండు జీపీల్లో పంపిణీ చేసేలా చూడాలని ఎమ్మెల్యే సక్కు పేర్కొన్నారు. రెండు సార్లు పంపిణీ చేసిన కందిపప్పు నిజంగా లబ్ధి దారులకు చేరిందా.? అని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పరిశీలన చేయాలని డీసీఎస్‌వోకు సూచించారు.

విద్యావైద్యారోగ్యం: 
జిల్లాలో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదైన మరణాలు 1.4 శాతమే ఉన్నాయని, ఇప్పటి వరకు 656 మంది డిశ్చార్జి అయినట్లు డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ తెలిపారు. ముఖ్యంగా మురికివాడల ప్రాంతాలపై దృష్టి సారించినట్లు వివరించారు. నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి మండలాల్లోని గ్రామాలకు చెందిన కిడ్నీ బాధితులకు ఉట్నూర్‌లో డయాలాసిస్‌ చేయడం లేదని, దీనిపై దృష్టి సారించాలని జెడ్పీ చైర్మన్‌ సభలో ప్రస్తావించారు. డాక్టర్‌ పోస్టులు మంజూరైన ఇంకా భర్తీ కాలేదని, ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేసి భర్తీ చేసేలా చూడాలని సభలో డీఎంహెచ్‌వో పేర్కొన్నారు. అనంతరం గురువారం నుంచి ఉపాధ్యాయులకు పాఠశాలలకు వెళ్తారని, సెప్టెంబర్‌ 1 నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు మొదలవుతాయని అధికారులు తెలుపగా, ఏ విధంగా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తారు.. విద్యార్థులు ఎలా వింటారు.. స్మార్ట్‌ఫోన్, టీవీలు, నెట్‌ సౌకర్యం లేని విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలేమిటి అనే అంశాలు అడిగి తెలుసుకున్నారు. తద్వారా జరిగిన సాంఘిక సంక్షేమ శాఖ కమిటీ సమావేశం ఉట్నూర్‌ జెడ్పీటీసీ చారులత రాథోడ్‌ అధ్యక్షతన జరిగింది. వివిధ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, పనులపై సభ్యులు అడిగి తెలుసుకున్నారు.  

పనులు, ప్రణాళిక కమిటీ 
ఈ సమావేశం జెడ్పీ చైర్మన్‌ అధ్యక్షతన జరిగింది. ఇందులో ముఖ్యంగా పీఆర్, ఆర్‌అండ్‌బీ ద్వారా చేపట్టిన రోడ్డు పనులు, బ్రిడ్జీల నిర్మాణాలపై చర్చించారు. తలమడుగులోని అర్లి(కె), కప్పర్‌దేవి, ఖోడద్‌ గ్రామాల్లో పీఆర్‌ ద్వారా పంచాయతీ భవనాలు నిర్మిస్తున్నారని, ఏళ్లు గడుస్తున్న పెండింగ్‌లోనే ఉన్నాయని జెడ్పీటీసీ గణేశ్‌రెడ్డి సభలో అధికారులను ప్రశ్నించారు. రాములుగూడకు 25 డబుల్‌ ఇళ్లు     మంజూరయ్యాయని, అగ్రిమెంట్‌ కాకముందే పనులు ఎలా ప్రారంభిస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సరైన సమాధానం ఇవ్వాలన్నారు. ఉమ్రి నుంచి కోసాయి మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రోడ్డు ఆర్‌అండ్‌బీది కాదు, పీఆర్‌దీ కాదు.. మరేవరిదని సభలో జెడ్పీటీసీ ప్రస్తావించారు. దీనిపై అధికారులు సమాధానమిస్తూ జీవో ప్రకారం అది పీఆర్‌ పరిధిలోని రోడ్డని తెలిపారు.

దహెగాం ముంపు గ్రామ ప్రజలకు ఆర్‌అండ్‌ఆర్‌ ద్వారా పునరావాసం కల్పించాలని బజార్‌హత్నూర్‌ జెడ్పీటీసీ మల్లేపూల నర్సయ్య సభలో ప్రస్తావించారు. ఇందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. దేవాపూర్‌ నుంచి బరంపూర్, సుండికి నుంచి తలమడుగు రోడ్డు మార్గాల్లో లోలెవల్‌ వంతెనలు ఉన్నాయని, వాటిని హైలెవల్‌ వంతెనలుగా నిర్మించాలని జెడ్పీటీసీ సభలో పేర్కొనగా, ఇందుకు కొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు. మిషన్‌ భగీరథ ద్వారా చెడిపోయిన సీసీ రోడ్లను వెంటనే రిపేరు చేయించాలని సభలో సభ్యులు పేర్కొన్నారు. అనంతరం విద్యుత్, నీటిపారుదల, భూగర్భ జల, మైన్స్, తదితర అంశాలపై చర్చ జరిగింది.

మరిన్ని వార్తలు