మీ అయ్య సొమ్మా: చల్లా ధర్మారెడ్డి

29 Aug, 2020 12:29 IST|Sakshi
మృతులకు సంతాప సూచకంగా మౌనం పాటిస్తున్న కార్పొరేటర్లు

సాక్షి, వరంగల్‌ : ‘పట్టణ ప్రగతి ద్వారా ఇప్పటి వరకు రూ. 32కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులతో పాటు సీఎం ప్రత్యేక నిధుల ద్వారా ఎక్కడ పనులు జరుగుతున్నాయి, ఏయే పనులు పూర్తి చేశారు.. మిగతావి ఏ స్థాయిలో ఉన్నాయో బల్దియా ఇంజినీర్లు వెల్లడించాలి. టెండర్లు జరిగి రెండేళ్లు పూర్తయినా కొన్ని పనులు ప్రారంభించడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎందరు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకున్నారు. ఏ వివరాలు అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. ఈ పైసలేమైనా మీ అయ్య సొమ్మా?’ అంటూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బల్దియా ఇంజనీర్లపై నిప్పులు చెరిగారు. హన్మకొండలోని అంబేద్కర్‌ భవన్‌లో శుక్రవారం జరిగిన గ్రేటర్‌ కౌన్సిల్‌ సమావేశం వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గరంగరంగా సమావేశం
వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కౌన్సిల్‌ సమావేశం వాడీవేడిగా సాగింది. తొలుత ఇటీవల మృతి చెందిన మాజీ కౌన్సిలర్లు వీరస్వామి, ఈశ్వరయ్య, జర్నలిస్టు ప్రవీణ్, టీఆర్‌ఎస్‌ నాయకుడు, కార్పొరేటర్‌ కావేటి కవిత భర్త రాజుకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్పొరేటర్ల ఒక నెల వేతనాన్ని కార్పొరేటర్‌ కావేటి కవితకు అందించేందుకు కౌన్సిల్‌ ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం అజెండాలోని 30 అంశాలతో పాటు టేబుల్‌ అజెండాగా 32 అంశాలను తీసుకుని చర్చించి ఆమోదముద్ర వేశారు. అర్బన్‌ మలేరియా ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యలపై కార్పొరేటర్‌ బయ్య స్వామి, బోడ డిన్నా మాట్లాడగా, బొంది వాగు నాలా మార్కింగ్‌పై ఎంబాడి రవీందర్‌ విమర్శించారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష కార్పొరేటర్లు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. ఇంకా ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్‌ ఖాజా సిరాజుద్దీన్‌తో పాటు కోఆప్షన్‌ సభ్యులు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. 

45 డివిజన్లకు రూ. 30కోట్లు
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, డ్రెయినేజీల మరమ్మతు కోసం 45 డివిజన్లకు రూ.30కోట్ల జనరల్‌ ఫండ్‌ నిధులు కేటాయిస్తూ మేయర్‌ ప్రకాశ్‌రావు చేసిన ప్రతిపాదనకు సభ్యులు ఆమోదముద్ర వేశారు. దేశంలోనే వరంగల్‌లో అత్యధికంగా వర్షపాతం నమోదు కాగా, పరిహారం కింద రూ. 500కోట్ల మంజూరుకు మంత్రి కేటీఆర్‌కు నివేదించాలనే తీర్మానాన్ని కూడా ఆమోదించా రు. అంతేకాకుండా ప్రతీ డివిజన్‌కు రూ.5లక్షలు నామినేషన్‌ కింద నిధులు మంజూరు చేస్తున్నట్లు మేయర్‌ వెల్లడించారు. ఇక నెలకు రెండుసార్లు కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటుచేస్తామని, ఇందులో భాగంగా వచ్చే నెల 16న కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు