Karimnagar: ‘స్మార్ట్‌’ పనులకు.. ఒక్క రూపాయి ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం 

27 Aug, 2021 07:42 IST|Sakshi
కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ

సాక్షి, కరీంనగర్‌: కరీం‘నగరం’స్మార్ట్‌ సిటీ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్‌ ప్రత్యేక చొరవతో 2017లో జూన్‌ 23వ తేదీన కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఫిబ్రవరి 25వ తేదీన స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో స్మార్ట్‌సిటీ నిర్మాణం, ఆధునీకరణ పనులు మొదలయ్యాయి. గతంలో ఉన్న 50 డివిజన్ల నుంచి 31 డివిజన్లు ఎంపికకాగా మొదటిదశలో 11 రోడ్లను వీటిలో 9 ఆధునిక సీసీరోడ్లు అందుబాటులోకి వచ్చాయి.

జీవన ప్రమాణాల్లో 22వ స్థానం, నగరపాలక పనితీరులో 21వ స్థానాన్ని కరీంనగర్‌ దక్కించుకుంది. ఓడీఎఫ్‌ ప్లస్‌ప్లస్‌ స్థానం సాధించింది. నగరపాలక సంస్థ ఇప్పటివరకు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 2015లో 259వ ర్యాంకు, 2017లో 201, 2018లో 73 ర్యాంక్‌ సాధించగా, 2019లో 99వ ర్యాంక్‌కు పడిపోయింది 2020లో కస్తా మెరుగుపడి 72వ ర్యాంక్‌ సాధించింది. 2021లో 10లోపు ర్యాంకు సాధించడానికి చర్యలు తీసుకుంటున్నారు. స్మార్ట్‌సిటీ పనులకోసం కేంద్రం ఇప్పటివరకు రూ.196 కోట్లు విడుదల చేయగా రాష్ట్రం మాత్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు.

నాడు...నేడు...
కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో 60 డివిజన్లు ఉండగా 600 కిలోమీటర్ల మేరకు డ్రైనేజీలు, 650 కిలోమీటర్లకుపైగా ప్రధాన అంతర్గత రోడ్లు ఉన్నాయి. వివిధ కాలనీలతోపాటు నగరంలోని నడిబోడ్డున ఉన్న భగత్‌నగర్‌కు కనీస రహదారి లేక ఇబ్బందులు పడేవారు. కలెక్టరేట్‌ రోడ్డు మొ త్తం నీటితో నిండిపోయి రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఉండేది. స్మార్ట్‌సిటీగా కరీంనగర్‌ నగరపాలక సంస్థను ఎంపిక చేయడంతో పట్టణం అభివృద్ధిబాట పట్టింది. రూ.1878 కోట్లతో మొ దటగా 54 పనులు చేపట్టాలని డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌) రూపొందించారు. స్మార్ట్‌సిటీ(ఎస్‌ఆర్‌ఎం) కింద రూ.975 కోట్లు కేటాయించగా, కన్వెర్జన్స్‌గా రూ.472 కోట్లు పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) కింద రూ.393 కోట్లు కేటాయించి ముందుకుసాగుతున్నారు.

మొదటి దశ పనులు 
స్మార్ట్‌సిటీలో భాగంగా రూ.1878 కోట్లతో డీపీఆర్‌లు రూపొందించగా మొదటిదశలో రూ. 416 కోట్లతో 11 పనులకు ఆమోదం తెలుపగా రూ.266.66 కోట్లతో 9 పనులు కొనసాగుతున్నాయి. రూ.3.80 కోట్లతో సర్కస్‌ మైదానం పార్క్‌ పనులు, రూ. 7.20 కోట్లతో పురాతన పాఠశాల మైదానం పార్క్‌ పనులు, రూ. 53.70 కోట్లతో ప్యాకేజీ–3 కింద హౌసింగ్‌బోర్డు రహదారుల నిర్మాణం పనులు, రూ.18 కోట్లతో అంబేద్కర్‌ స్టేడియం స్పోర్ట్‌ కాంప్లెక్స్‌ పనులు, రూ.16.90 కోట్లతో టవర్‌ సర్కిల్‌ అభివృద్ధి పనులు, రూ.84 కోట్లతో ప్యాకేజీ–1 కింద ప్రధాన రహదారుల నిర్మాణం, రూ. 80 కోట్లతో ప్యాకేజీ–2 కింద రోడ్ల పనులు చేపడుతున్నారు. రూ.2.43 కోట్లతో కంప్యాక్టర్‌ స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. 

రెండోదశ పనులు
సుమారు రూ.500 కోట్లతో పనులు చేయడానికి ఆమోద ముద్ర వేస్తూ జూలై 8వ తేదీ 2020న నిర్ణయం తీసుకున్నారు. రూ.78 కోట్లతో డంపుయార్డ్‌ ఆధునీకరణ, రూ. 68 కోట్లను మూడు జోన్లలో రోజు వారి మంచినీటి పథకానికి కేటాయించారు. స్మార్ట్‌సిటీలో ఈ–బస్సుల కోసం రూ.20 కోట్లు, ఈ–స్మార్ట్‌క్లాస్‌ రూంలకోసం రూ.21 కోట్లు, రూ.150 నుంచి రూ.180 కోట్లతో కమాండ్‌ కంట్రోల్‌రూం నిర్మాణంకోసం బోర్డు ఆమోద ముద్ర వేసింది. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీకి రూ.52 కోట్లు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేయడానికి రూ.20 కోట్లు, అలుగునూర్‌ చౌరస్తా అభివృద్ధికి రూ.5 కోట్లు, మల్టిపర్పస్‌ పార్క్‌ల నిర్మాణానికి రూ.3 కోట్లు, స్మృతివనం కోసం ప్రతిపాదించిన ప్రకారం ఎంతైనా నిధులు వినియోగించుకునే అవకాశం, రూ.11 కోట్లతో సోలార్‌సిస్టం ఏర్పాటుకు, రూ. 07 కోట్లతో ఇంకుడు గుంతల నిర్మాణంకోసం కేటాయించారు. 

ఇంకా నిధుల కొరత 
నిధులు విడుదల లేకపోవడంతో స్మార్ట్‌ సిటీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. డీపీఆర్‌ ప్రకారం మొదట 54 పనులకు ఆమోదం తెలిపి పనులు ప్రారంభించారు. వివిధవర్గాల విజ్ఞప్తుల మేరకు మరో 6 పనులు వాటికి కలుపుకుని మొత్తం 60 పనులు చేయడానికి డీపీఆర్‌ సిద్ధం చేశారు. వీటిలో 10 పూర్తిస్థాయిలో కాగా మరో10 పనులు వచ్చే మూడునెలల్లోనే అందుబాటులోకి వస్తాయని మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి చెబుతున్నారు. ఇవికాకుండా మరో 5 పనులు టెండర్లు పూర్తయి అనుమతికోసం వేచి చూస్తున్నాయి. మరో30 పనులు డీపీఆర్‌ సిద్ధం చేసి ఉంచారు. వీటికి అనుమతి లభించడంతో త్వరలో టెండర్లు పిలవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

పనులకు అనుమతి 
మొదటిదశ పనులకు రూ.196 కోట్ల పనులకు అనుమతి లభించింది. రూ.174 కోట్ల పనులు పూర్తి చేయగా వీటిలో రూ.119 కోట్లు కాంట్రాక్టర్‌కు చెల్లించారు. ఎస్‌పీవీ వద్ద రూ. 18 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ. 61 కోట్ల రూపాయలున్నాయి. వచ్చే రెండునెలల్లో రూ.18 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇవికాకుండా రూ.375 కోట్ల పనులు కొనసాగుతున్నాయి. ఇవి వచ్చే మూడు నెలల్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరో రూ.200 కోట్ల రూపాయల డీపీఆర్‌లు సిద్ధంగా ఉన్నాయి. వీటిని త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా నిధులు సరైన సమయంలో విడుదల చేయకపోవడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.

కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీ కింద రూ. 900 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.196 కోట్లు విడుదల చేసింది. వీటి నుంచి రూ.192 కోట్ల నిధులు స్మార్ట్‌సిటీ ఖాతాకు జమ అయ్యాయి. అంతేమొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ షేర్‌ కింద వాటా జమ చేయాలి.. ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. కేంద్ర వాటాలోని రూ.900 కోట్ల రూపాయల నుంచి సగం వాటా సుమారు రూ.400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. సీఎం అస్యూరెన్స్‌ కింద కరీంనగర్‌కు ప్రత్యేకంగా రూ.350 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు రూ.147 కోట్లు విడుదల చేశారు. వీటిని స్మార్ట్‌సిటీలో ఎంపిక కాని డివిజన్లు, శివారు ప్రాంతాల అభివృద్ధికి వినియోగిస్తున్నారు.

చదవండి: కష్టాలు తెలుసుకుని కన్నీళ్లు తుడిచేందుకే..

మరిన్ని వార్తలు