అర్జీ ఇచ్చినా పట్టించుకోని చంద్రబాబు

10 May, 2021 11:36 IST|Sakshi

ఆత్మహత్య  చేసుకుంటానన్న వైఎస్సార్‌ జిల్లా వాసి

అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు

బంజారాహిల్స్‌: టీడీపీ అధినేత చంద్రబాబుకు కష్టం చెప్పుకుందామని వస్తే కలవకపోగా తానిచ్చిన అర్జీలు కూడా పట్టించుకోవడంలేదని, ఇదేమిటని ప్రశ్నించడానికి వెళ్తే పోలీసులు అనుమతించడం లేదని ఒక వ్యక్తి హైదరాబాద్‌లోని ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటి సమీపంలో తచ్చాడుతుండగా జూబ్లీహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్‌ జిల్లా రాజంపేట సమీపంలోని పెనమలూరు మండలం చక్రంపేటకు చెందిన సిరిగిరి సుబ్బారెడ్డి (40) తనకు తన కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉన్నట్లు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయమై చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేసేందుకు గత బుధవారం హైదరాబాద్‌ వచ్చి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం వద్ద పోలీసులకు అర్జీ ఇచ్చారు. చంద్రబాబు నుంచి కబురు వస్తుందేమోనని నాలుగు రోజుల నుంచి సమీపంలోని ఫుట్‌పాత్‌పై పడుకుంటున్నాడు. ఆదివారం తన అర్జీ సంగతి తెలుసుకునేందుకు చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారు. చంద్రబాబు పీఏ రాలేదని, ఆయన కార్యాలయంలోనే అర్జీ ఉందని అక్కడి పోలీసులు తెలిపారు. తనను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆందోళన చేశాడు. దీంతో అతడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. తాను గోడు చెప్పుకుందామని వస్తే చంద్రబాబు, ఆయన కొడుకు, పీఏ ఎవరూ కలవడం లేదని సుబ్బారెడ్డి వాపోయారు. తనకు న్యాయం జరగకపోతే బాబు ఇంటిముందే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు.
చదవండి: 
‘ఎంత కృతజ్ఞత లేని వాడివి నీవు.. చంద్రం’
లాయర్ల హత్య: ఏరోజు  ఏం జరిగిందంటే..? 

మరిన్ని వార్తలు