రివర్షన్లు.. ప్రమోషన్లు.. విద్యుత్‌ సంస్థల్లో పదోన్నతుల్లో మార్పులు

17 Nov, 2022 04:39 IST|Sakshi

విద్యుత్‌ సంస్థల్లో కొత్త సీనియారిటీ జాబితా

2014 జూన్‌ 1 నాటి సీనియారిటీతో పదోన్నతుల్లో మార్పులు 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రక్రియ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో సీనియారిటీ జాబితాలు, పదోన్నతుల్లో మార్పులు జరగనున్నాయి. విద్యుత్‌ సంస్థలు గతంలో ఏపీకి రిలీవ్‌ చేసిన ఉద్యోగుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్ర విభజనకు ఒకరోజు ముందు అంటే 2014 జూన్‌ 1 నాటికి ఉన్న సీనియారిటీ జాబితాల ఆధారంగా పదోన్నతులను సవరించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సంస్థల్లో.. తెలంగాణ ఉద్యోగులు, గతంలో రిలీవ్‌ చేసి తిరిగి చేర్చుకున్న ఏపీ ఉద్యోగులను కలిపి కొత్త సీనియారిటీ జాబితాను సిద్ధం చేశారు.

ఈ అంశంపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం విద్యుత్‌ సౌధలో సమీక్షించారు. అయితే ఏపీకి రిలీవ్‌ చేసి తిరిగి చేర్చుకున్న ఉద్యోగుల్లో చాలా మంది సీని యర్లు ఉన్నారని.. వారు కొత్త జాబితాల్లో పైన ఉంటారని తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. దీనివల్ల ఇప్పటికే ప్రమోషన్‌ పొందిన తెలంగాణ ఉద్యోగులు తిరిగి పాత హోదాలకు రివర్షనయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పదోన్నతులు కోల్పోయే వారిలో తెలంగాణ ఇంజనీర్లు, అకౌంట్స్, పీఅండ్‌జీ తదితర విభాగాలకు చెందినవారు 150 మందికిపైగా ఉంటారని పేర్కొంటున్నా యి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఇప్పటికే పొందిన పదోన్నతులకు రక్షణ కల్పించేందుకు సూపర్‌ న్యూమరరీ పోస్టులను సృష్టించాలని తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు బుధవారం విద్యుత్‌ మంతిజి.జగదీశ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే సూపర్‌ న్యూమరరీ పోస్టుల సృష్టికి విద్యుత్‌ సంస్థలు సుముఖంగా లేనట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి.

ఇదీ చదవండి: జోహార్‌ నటశేఖరా! హీరో కృష్ణకు అభిమానుల కన్నీటి వీడ్కోలు

మరిన్ని వార్తలు