‘శ్రీశైలం’ ఎఫ్‌ఐఆర్‌లో మార్పులు!

26 Aug, 2020 06:02 IST|Sakshi

కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ అధికారులు

నిర్లక్ష్యం.. నిర్వహణ లోపాలపై ఆరా

సాక్షి, హైదరాబాద్‌: తొమ్మిది మందిని బలితీసుకున్న శ్రీశైలం దుర్ఘటన ప్రైమరీ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఎఫ్‌ఐఆర్‌)లో మార్పులు జరిగాయి. గత గురువారం రాత్రి 4వ ఫేజ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదం తొమ్మిది మంది మరణానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీనిపై స్థానిక పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. శనివారం హైదరాబాద్‌ నుంచి ఈగలపెంట వెళ్లిన సీఐడీ బృందం పలు కీలక ఆధారాలు సేకరించింది. వారు గమనించిన అంశాల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌లో మార్పులు జరిగాయని సమాచారం. కేసును మలుపు తిప్పే ఆధారాలు సీఐడీ విభాగానికి లభించాయని, అందుకే, ఎఫ్‌ఐఆర్‌లో మార్పులు చేసి ఉంటారని పలువురు ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

నిర్లక్ష్యమా? నిర్వహణ లోపమా?: ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో పోలీసులు ప్రధానంగా నిర్లక్ష్యం, కుట్ర, నిర్వహణ లోపాలపై దృష్టి సారిస్తారు. ఈ కేసులో కుట్రకు అవకాశం లేకపోవడంతో సీఐడీ అధికారులు నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలపైనే దృష్టి పెట్టారని సమాచారం. ఈ రెండు అంశాలపై లోతైన దర్యాప్తు జరపనున్నారు. ఇందులో భాగంగా సీఐడీ అధికారుల బృందం శ్రీశైలం పవర్‌ప్లాంట్‌ను ఈ వారంలోనే సందర్శించే అవకాశాలు ఉన్నాయి.

సొంత రెస్క్యూ టీమ్‌ ఎక్కడ?: సింగరేణి భూగర్భ గనులు ఉన్న ప్రాంతాల్లోనూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడ టన్నెల్‌ 1.2 కిలోమీటరుకుపైగా భూమి లోపలికి ఉంటే.. సింగరేణి బొగ్గు గనులు 5 కిలోమీటర్లకుపైగా ఉంటాయి. గనుల్లో ప్రమాదాలు జరిగితే కార్మికులను రక్షించేందుకు ప్రత్యేకం గా రెస్క్యూ సిబ్బంది ఉంటారు. సింగరేణిలో ఎక్కడ ప్రమాదం జరిగినా.. క్షణాల్లో వీరికి సమాచారం చేరుతుంది. కొద్ది నిమిషాల్లోనే వీరు ఘటనా స్థలానికి చేరి సహాయక చర్యలు ప్రారంభిస్తారు. కానీ, శ్రీశైలం పవర్‌ప్లాంట్‌కు ఈ తరహా ఏర్పాటు లేదు. పవర్‌ప్లాంట్‌లో రక్షణ చర్యల విషయంలో సీఐడీ అధికారులు సంతృప్తిగా లేరని సమాచారం. ప్రత్యేక రెస్క్యూ విభాగం ఉంటే ప్రాణనష్టం తక్కువగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. మంటలనార్పేందుకు ప్రస్తుతం ఉన్న వ్యవస్థపైనా అధికారులు పెదవి విరుస్తున్నారు. వందల కిలోవాట్ల మేర సామర్థ్యమున్న మెషీన్లకు అగ్నిప్రమాదం సంభవిస్తే.. ఆర్పేందుకు ధీటైన అగ్నిమాపక సదుపాయాలు లేవన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమైనట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు