TSRTC: తక్కువ ధరకు ‘కర్ణాటక డీజిల్‌’ కథ ఆదిలోనే కంచికి..

9 May, 2022 02:26 IST|Sakshi

ఆయిల్‌ భారం నుంచి ఆర్టీసీ ఉపశమనం పొందే అవకాశం మిస్‌ 

సదుద్దేశంతో మంచి యత్నమే చేసినా.. అనుమతించని నిబంధనలు 

దీంతో పొరుగు రాష్ట్రం నుంచి కొనే యోచన విరమణ 

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటక నుంచి కాస్త చవకగా డీజిల్‌ కొనేందుకు తెలంగాణ ఆర్టీసీ చేసిన ప్రయత్నం రెండు ట్యాంకర్లతో కంచికి చేరింది. చమురు భారంతో అతలాకుతలమవుతున్న ఆర్టీసీ సదుద్దేశంతో చేసిన ప్రయత్నం కొత్త సమస్యలకు దారితీసే పరిస్థితి ఉండటంతో దాన్ని విరమించుకుంది. దీంతో మళ్లీ డీజిల్‌ భారంతో దిక్కుతోచని పరిస్థితిలో ఎప్పటిలాగే ప్రైవేటుగా కొనేందుకు రిటైల్‌ బంకులకేసి సాగుతోంది. బల్క్‌ డీజిల్‌ ధర భగ్గుమనటంతో పెట్రోలు కంపెనీలతో ఉన్న ఒప్పందానికి తాత్కాలిక విరామమిస్తూ కాస్త తక్కువ ధర ఉన్న బంకుల్లో కొంటున్న విషయం తెలిసిందే.  

నిబంధనలకు విరుద్ధమని తెలిసి... 
ప్రస్తుతం బల్క్‌ డీజిల్‌ లీటరుకు ధర రూ.119 ఉండగా, బంకుల్లో రూ.115కు చేరింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చూపు పొరుగు రాష్ట్రం కర్ణాటకపై పడింది. అక్కడి ప్రభుత్వ పన్నులు తక్కువగా ఉండటంతో, సగటున లీటరు ధర రూ.95 పలుకుతోంది. దీంతో ఇటీవల సరిహద్దుకు చేరువగా ఉన్న కొన్ని కర్ణాటక బంకు యజమానులతో చర్చించి ట్యాంకర్లతో డీజిల్‌ కొనాలని బస్‌భవన్‌ కేంద్రంగా అధికారులు భావించారు.

ఓ బంకు నుంచి తక్కువ ధరకే రెండు ట్యాంకర్ల డీజిల్‌ కూడా వచ్చింది. కానీ ఇలా పొరుగు రాష్ట్రం నుంచి ట్యాంకర్లతో పెద్దమొత్తంలో డీజిల్‌ తెప్పించుకోవటం నిబంధనలకు విరుద్ధమన్న విషయాన్ని ఆర్టీసీ అధికారులు తర్వాత గుర్తించారు. తక్కువ పన్నులున్న రాష్ట్రం నుంచి ఎక్కువ పన్నులున్న మరో రాష్ట్రానికి తరలించటం సరికాదని.. అధికారులు చమురు కంపెనీలతో ఆరా తీసి తెలుసుకున్నారు. ఆ వెంటనే కర్ణాటక డీజిల్‌ను కొనాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.  

దిక్కుతోచని పరిస్థితి.. 
ఇటీవలే డీజిల్‌ సెస్‌ అంటూ ఆర్టీసీ టికెట్‌ ధర కొంతమేర పెంచింది. ఆ రూపంలో దాదాపు రూ.30 కోట్ల వరకు ఆదాయన్ని పెంచుకోగలిగింది. కానీ అది ఏమాత్రం చాలని పరిస్థితి. అయితే, ఇప్పటికిప్పుడు మళ్లీ సెస్‌ పెంచితే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఆర్టీసీ భయపడుతోంది. ఇక గతంలో ప్రభుత్వం ముందుంచిన చార్జీల పెంపు ప్రతిపాదనకు మోక్షం కల్పించమని ప్రభుత్వాన్ని కోరుతోంది. 

మరిన్ని వార్తలు