ఈ మందుతో అన్ని రకాల ఫంగల్‌ ఇన్ఫెక్షన్లకు చెక్‌..!

30 May, 2021 02:48 IST|Sakshi

ట్యాబ్లెట్ల రూపంలో అభివృద్ధి చేసిన ఐఐటీ హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు

ఇంజెక్షన్‌ రూపం కన్నా దుష్ప్రభావాలు తక్కువ అని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: బ్లాక్‌ ఫంగస్‌కు చెక్‌ పెట్టే మందును ఐఐటీ హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బ్లాక్‌ ఫంగస్‌ మాత్రమే కాకుండా దాదాపు అన్ని రకాల ఫంగల్‌ (శిలీంధ్రం) ఇన్ఫెక్షన్ల చికిత్సలోనూ దీన్ని వాడొచ్చని, ఏదైనా ఫార్మా కంపెనీ ముందుకొస్తే ఈ మందు తయారీ సాంకేతికతను అందించేందుకు తాము సిద్ధమని ఐఐటీ హైదరాబాద్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

బ్లాక్‌ ఫంగస్‌కు ప్రస్తుతం ఆంఫోటెరిసిన్‌–బి అనే ఇంజెక్షన్‌తో చికిత్స కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ మందు ఖరీదైనది మాత్రమే కాకుండా.. పలు దుష్ప్రభావాలూ ఉన్నాయి. గతంలో ఇదే మందును కాలా అజార్‌ వ్యాధి చికిత్సలోనూ ఉపయోగించారు. ఈ నేపథ్యంలో ఇంజెక్షన్‌ రూపంలో అందిస్తున్న ఆంఫోటెరిసిన్‌–బిపై రెండేళ్ల నుంచే ఐఐటీ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్‌ సప్తర్షి మజుందార్, డాక్టర్‌ చంద్రశేఖర్‌ శర్మ, పీహెచ్‌డీ స్కాలర్లు మృణాళిని గాయ్‌ధనే, అనిందిత లాహాలు పరిశోధనలు చేస్తున్నారు. 

నానో టెక్నాలజీ సాయంతో...
ఈ మందును నానోస్థాయి పోగులతో కలిపి ట్యాబ్లెట్ల రూపంలో తయారు చేయొచ్చని వీరంతా గుర్తించారు. ట్యాబ్లెట్ల రూపంలో ఆంఫోటెరిసిన్‌–బి తయారు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, అతితక్కువ మోతాదుల్లో ప్రభావవంతంగా మందు అందించవచ్చని, ఇంజెక్షన్‌ ద్వారా అందించేటప్పుడు మూత్రపిండాలపై ఎక్కువ భారం పడుతుండగా ట్యాబ్లెట్ల ద్వారా ఈ దుష్ప్రభావం తక్కువగా ఉంటుందని ప్రొఫెసర్‌ సప్తర్షి మజుందార్‌ తెలిపారు. ఇంజెక్షన్‌ రూపంలో ఇచ్చినప్పుడు ఆంఫోటెరిసిన్‌– బి శరీరంలో చిన్నచిన్న గడ్డలు కట్టే అవకాశాలు ఉంటాయని, వీటిని శరీరం నుంచి తొలగించేందుకు మూత్రపిండాలు ఎక్కువ భారం మోయాల్సి వచ్చేదని ఆయన వివరించారు. జిలాటిన్‌ పదార్థంతో కలిపి తాము ఈ మందును తయారు చేశామని చెప్పారు.

పెద్ద ఎత్తున ఉత్పత్తి అవసరం..
బ్లాక్‌ఫంగస్‌తో పాటు ఇతర శిలీంధ్ర సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ మాత్రలను పెద్ద ఎత్తున తయారు చేయడం అవసరమని అన్నారు. ఇంజెక్షన్ల మాదిరిగా ఈ ట్యాబ్లెట్లూ ఖరీదుగా మారకుండా ఉండేందుకు తాము ఈ టెక్నాలజీపై పేటెంట్‌ హక్కులేవీ పొందలేదని, కేవలం 60 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్‌తో ఆంఫోటెరిసిన్‌–బి మందు నెమ్మదిగా.. స్థిరంగా 8 గంటల పాటు శరీరానికి అందించవచ్చన్నారు. ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ.200 వరకూ ఉండొచ్చని చెప్పారు. ఏదైనా ఫార్మా కంపెనీ ట్యాబ్లెట్ల తయారీకి పూనుకుంటే వాటి క్లినికల్‌ ట్రయల్స్‌కు మార్గం సుగమం అవుతుందని అన్నారు. 

>
మరిన్ని వార్తలు