లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు  

13 May, 2021 02:42 IST|Sakshi
కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్‌ చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేసున్న ఎస్పీ భాస్కరన్‌

రాష్ట్రంలో లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు..  

కోదాడ రూరల్‌/ నాగార్జునసాగర్‌/దామరచర్ల/ జహీరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటయ్యాయి. లాక్‌డౌన్‌ తొలిరోజు బుధవారం పోలీసు ఉన్నతాధికారులు పలు చెక్‌పోస్టుల వద్ద స్వయంగా తనిఖీలు పర్యవేక్షించారు. అత్యవసర సర్వీసులు, అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించి మిగతా వాటిని వెనక్కి పంపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా లోని సరిహద్దుల్లో గల చెక్‌పోస్టుల్లో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు, మఠంపల్లి మండలం మట్టపల్లిలోని కృష్ణానది వద్ద, చింతలపాలెం మండలం వజినేపల్లి క్రాస్‌రోడ్డు, పులిచింతలప్రాజెక్ట్‌ వద్ద, నాగార్జునసాగర్‌లోని కొత్త బ్రిడ్జి, దామరచర్ల మండలం వాడపల్లి వంతెన వద్ద ఉన్న చెక్‌పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులు, అత్యవసర విభాగం, వ్యవసాయ రంగానికి సంబంధించిన వాహనాలను మాత్రం నేరుగా అనుమతించారు. మిగతా వాహనాలకు ఈ పాస్‌లు ఉంటేనే అనుమతించారు.  

ఖమ్మం, సంగారెడ్డి సరిహద్దుల్లోనూ.. 
సత్తుపల్లి–చింతలపూడి మధ్యలో.. మధిర–వత్సవాయి, పెనుబల్లి–ముత్తగూడెం, వల్లభి–గండ్రాయి మధ్య చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు. ఇక సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని మాడ్గి వద్ద 65వ నంబర్‌ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద కూడా   తనిఖీలు నిర్వహించారు. అంబులెన్సులను అనుమతిస్తున్న అధికారులు.. రాష్ట్రంలోకి వచ్చే కోవిడ్‌ బాధితుల వివరాలు, ఏ ఆసుపత్రికి వెళ్తున్నారు? అనే వివరాలు సేకరిస్తున్నారు. సంబంధీకుల ఫోన్‌ నంబర్‌ తీసుకుంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చే అంబులెన్సులను కూడా అనుమతిస్తు న్నారు.  ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సరిహద్దుల వద్ద ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను ఎలాంటి ఆటంకాలూ లేకుండా అనుమతించారు. 

చదవండి: లాక్‌డౌన్‌: జనమంతా ఇళ్లలోనే!

మరిన్ని వార్తలు