Chess Boxing: చెస్‌తో చెక్‌.. బాక్సింగ్‌ కిక్‌..

18 May, 2021 09:07 IST|Sakshi

సాక్షి సెంట్రల్‌ డెస్క్‌: చెస్‌ అంటే స్మార్ట్‌.. బాక్సింగ్‌ అంటే స్ట్రాంగ్‌.. రెండూ కలిపితే చెస్‌ బాక్సింగ్‌.. స్మార్ట్‌ అండ్‌ స్ట్రాంగ్‌. ఓ రకంగా చెప్పాలంటే సూపర్‌ హీరోలన్న మాట. చెస్‌కు, బాక్సింగ్‌కు లింకేమిటని ఆశ్చర్యపోవద్దు. కొన్నేళ్లుగా నడుస్తున్న సరికొత్త ట్రెండ్‌ ఇది. ప్రపంచవ్యాప్తంగా మెల్లగా చెస్‌ బాక్సింగ్‌కు క్రేజ్‌ పెరుగుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు కూడా జరుగుతున్నాయి. మన దేశంలోనూ జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నారు. మంచి తెలివితేటలతో పాటు శారీరకంగా కూడా బలంగా ఉంటే చెస్‌ బాక్సింగ్‌ చాంపియన్‌ కావొచ్చు. మరి ఈ చెస్‌ బాక్సింగ్‌ సంగతేంటో తెలుసుకుందామా?    

తెలివి, బలం కలిస్తే..
పేరుకు తగ్గట్టుగానే చెస్‌ బాక్సింగ్‌ మిశ్రమ క్రీడ. చెస్, బాక్సింగ్‌ రెండింటి నిబంధనలు పాటిస్తూ.. చెస్‌ బోర్డు మీద, బాక్సింగ్‌ రింగ్‌లో తలపడాల్సి ఉంటుంది.

  • భూమ్మీద అత్యంత తెలివైన, బలమైన మహిళ, పురుషుడు ఎవరనేది తేల్చే ఆటే చెస్‌ బాక్సింగ్‌ అని దీని రూపకర్త లీప్‌ రూబింగ్‌ చెప్తుండేవారు.

సైంటిఫిక్‌ ఫిక్షన్‌ నుంచి ఆచరణలోకి..
నెదర్లాండ్స్‌కు చెందిన లీప్‌ రూబింగ్‌ అనే క్రీడాకారుడు 2003లో చెస్‌ బాక్సింగ్‌కు రూపకల్పన చేశాడు. 1992లో విడుదలైన సైన్స్‌ ఫిక్షన్‌ నవల ‘ఫ్రాయిడ్‌ ఈక్వేటర్‌’ నుంచి స్ఫూర్తి పొంది చెస్‌ బాక్సింగ్‌కు రూపం పోశాడు. ఆ నవలలో ‘ఫ్యూచర్‌ బాక్స్‌’ అనే డివైజ్‌ ఉంటుంది. అందులో పెద్ద చెస్‌ బోర్డుపై హీరో, విలన్లు పోరాడుతారు. చెస్‌ బాక్సింగ్‌ తొలి మ్యాచ్‌ నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగింది.

మ్యాచ్‌లు జరిగేదెలా?
ప్రతి గేమ్‌లో వరుసగా మొదట చెస్‌ రౌండ్, తర్వాత బాక్సింగ్‌ రౌండ్, మళ్లీ చెస్, బాక్సింగ్‌.. ఇలా జరుగుతూ వస్తాయి. ఇలా గరిష్టంగా 11 రౌండ్ల వరకు ఆడుతారు. లేదా మధ్యలోనే విజేత ఎవరో తేలిపోతుంది.

  • ప్రత్యర్థిని బాక్సింగ్‌లో నాకౌట్‌ చేసిగానీ, చెస్‌లో చెక్‌మేట్‌ పెట్టిగానీ గెలవొచ్చు. లేదా నిర్ణీత సమయాన్ని మించి తీసుకోవడం, జడ్జి నిర్ణయం ఆధారంగా కూడా విజేతలను ప్రకటిస్తారు. చెస్‌ రౌండ్‌ 4 నిమిషాలు, బాక్సింగ్‌ రౌండ్‌ 3 నిమిషాలు ఉంటాయి.
  • చెస్‌ రౌండ్లలో ఎలాంటి ఫలితం తేలకుండా డ్రా అయితే.. బాక్సింగ్‌ పాయింట్ల ఆధారంగా గెలుపు ఎవరిదో నిర్ధారిస్తారు. బాక్సింగ్‌ పాయింట్లు కూడా సమానంగా వస్తే.. చెస్‌లో నల్ల పావులతో ఆడినవారిని విజేతగా ప్రకటిస్తారు.

మన దేశంలో చెస్‌ బాక్సింగ్‌
చెస్‌ బాక్సింగ్‌ మన దేశంలో కూడా కొన్నేళ్లుగా ప్రాచుర్యంలోకి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2011లో ‘చెస్‌ బాక్సింగ్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీబీఓఐ)ని ఏర్పాటు చేసింది.

  •  కోల్‌కతాకు చెందిన ప్రముఖ కిక్‌ బాక్సింగ్‌ మాస్టర్, మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణుడు సెన్సీ మోంటు దాస్‌ నేతృత్వంలో సీబీఓఐని స్థాపించారు.
  • మోంటు దాస్‌ 2020 జూన్‌లో ప్రపంచ చెస్‌ బాక్సింగ్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు.

ఇప్పటిదాకా చాంపియన్లు వీరే..
చెస్‌ బాక్సింగ్‌లో ప్రస్తుతం లైట్, మిడిల్‌ వెయిట్, హెవీ వెయిట్‌ కేటగిరీల్లో చాంపియన్‌ షిప్‌లు నిర్వహిస్తున్నారు. వీటిలో గెలిచిన ఆటగాళ్లు వారి ముద్దుపేర్లతో బాగా పాపులర్‌ 
అయ్యారు.
ప్రస్తుతం చెస్‌ బాక్సింగ్‌లో ప్రముఖ ఆటగాళ్లు వీరే..

  • జర్మనీకి చెందిన ఫ్రాంక్‌ స్టోల్ట్‌ (యాంటీ టెర్రర్‌), 2008లో వరల్డ్‌ చాంపియన్‌.
  • రష్యాకు చెందిన నికోలాయ్‌ సెర్గీవిచ్‌ (ది చైర్మన్‌), 2012 నుంచీ వరల్డ్‌ చాంపియన్‌.
  • కెనడాకు చెందిన సీయాన్‌ మూనీ (ది మెషీన్‌), మిడిల్‌ వెయిట్‌లో 2015 నుంచీ చాంపియన్‌.
  • భారత్‌కు చెందిన జీత్‌ పటేల్, అమెచ్యూర్‌ వరల్డ్‌ చాంపియన్‌–2017 

‘ప్రపంచంలో నంబర్‌ వన్‌ తెలివైన ఆటను.. నంబర్‌ వన్‌ పోరాట క్రీడను కలిపితే వచ్చిందే.. చెస్‌ బాక్సింగ్‌’’ – చెస్‌ బాక్సింగ్‌ రూపకర్త లీప్‌ రూబింగ్‌
► ‘చెస్‌ బాక్సింగ్‌ చాలా కష్టం. అటు బాక్సింగ్‌లో ప్రత్యర్థిని ఎదుర్కొంటూ, దెబ్బలు తగులుతూ ఉంటే.. ఇటు ప్రశాంతంగా, సహనంతో చెస్‌ ఆడాల్సి ఉంటుంది. మనసు, శరీరం రెండింటినీ ఒకే సమయంలో నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది’’ – చెస్‌ బాక్సింగ్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు మోంటు దాస్‌

మరిన్ని వార్తలు