తెలంగాణ నమూనా దేశవ్యాప్తం కావాలి

27 Jan, 2023 01:44 IST|Sakshi
గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమైన శంభాజీ రాజె. చిత్రంలో ఎమ్మెల్సీ కవిత 

ఛత్రపతి శివాజీ వారసుడు శంభాజీ రాజె

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అమలవుతున్న ప్రగతి నమూనా మహారాష్ట్ర సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజే ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో కూడా అమలు చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు, సాహూ మహరాజ్‌ మనవడు, కొల్హాపూర్‌ సంస్థాన వారసుడు, స్వరాజ్‌ ఉద్యమ కారుడు అయిన శంభాజీ రాజె గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

కేసీఆర్‌ మధ్యాహ్న భోజనంతో శంభాజీ రాజెకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో అమల వుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పట్ల ప్రభుత్వ విధానాలను రాజె ఆరా తీశారు. 

వినూత్న ఎజెండాతో ప్రజల ముందుకు
అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా కేసీఆర్, శంభాజీ రాజె నడుమ చర్చ జరిగింది. దేశ అభివృద్ధి, సమగ్రత, ప్రజా సంక్షేమం లక్ష్యంగా వినూత్న ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరముందనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. సందర్భాన్ని బట్టి మరోమారు కలిసి మరిన్ని అంశాలపై చర్చించాలని నిర్ణయించారు.

శంభాజీ రాజె పూర్వీకులు శివాజీ మహరాజ్‌  నుంచి సాహూ మహరాజ్‌ దాకా దేశానికి అందించిన సేవలను ఇరువురు స్మరించుకున్నారు. సమానత్వం, ప్రజా సంక్షేమం దిశగా వారందించిన పాలన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘రాజర్షి సాహు ఛత్రపతి’ పుస్తకాన్ని కేసీఆర్‌కు శంభాజీ రాజె అందించారు. ఈ భేటీలో మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు శంభాజీ రాజెతో పాటు వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు