గాలం వేసి కాపుకాచి.. భద్రత దళాలకు భారీదెబ్బ!

5 Apr, 2021 02:46 IST|Sakshi

పీఎల్‌జీఏ కమాండర్‌ హిడ్మా ఉన్నాడని ఉప్పందించిన మావోలు 

బలగాలను రప్పించేందుకు పక్కా పథకం 

పెద్ద సంఖ్యలో గుట్టలపై నక్కి.. వాటికి దగ్గరగా వచ్చేలా చేసి.. 

రాకెట్‌ లాంచర్లు, లైట్‌ మెషీన్‌ గన్స్‌తో విరుచుకుపడిన వైనం 

హైదరాబాద్‌: మావోయిస్టులు భద్రతా బలగాలను మరోసారి భారీ దెబ్బకొట్టారు. బలిమెల దాడుల తరహాలో దాదాపు పదమూడేళ్ల తర్వాత భారీ స్థాయిలో ప్రతీకార దాడికి దిగారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ దాడిలో చనిపోయిన జవాన్ల సంఖ్య శనివారం నాడు ఐదుగురుగా ఉండగా.. ఆదివారం 23కు చేరింది. గతంలో 2008లో బలిమెల రిజర్వాయర్‌లో కూంబింగ్‌ కోసం వెళ్లిన గ్రేహౌండ్స్‌ పోలీసులను, 2010 వేసవిలో రెండు ఘటనల్లో 100 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని, 2013లో బస్తర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నేతలను చంపేసిన మావోయిస్టులు.. ఆ తర్వాత చేసిన అతి పెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. దండ కారణ్యంలో తమకు ఇంకా పట్టు మిగిలే ఉందని చాటేందుకే అధునాతన ఆయుధాలతో అంబుష్‌ (ఎరవేసి చుట్టుముట్టి దాడి చేయడం) దాడికి పాల్పడ్డారని, అందుకే మృతుల సంఖ్య భారీగా ఉందని ఛత్తీస్‌గఢ్‌ పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. కొంతకాలంగా దండకారణ్యంలో జరుగుతున్న పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో.. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, స్థానిక పోలీసులు కలిసి కూంబింగ్‌ పెంచారు. ఈ క్రమంలోనే పీఎల్‌జీఏ కమాండర్‌ హిడ్మా ఉన్నాడంటూ కావాలని ఉప్పందించిన మావోలు.. వారు ముందుగానే సిద్ధంగా ఉన్న ప్రాంతానికి భద్రతా బలగాలు రావడంతో ఒక్కసారిగా చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు. 


బీజాపూర్‌లోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌ ఆఫీసు నుంచి స్వస్థలాలకు మృతదేహాలను తరలిస్తున్న జవాన్లు

ఇంతగా ప్రాణనష్టం ఎందుకు? 
తెర్రం దాడి ఘటనలో పోలీసుల వైపు ఇంత భారీగా ప్రాణనష్టం ఎందుకు జరిగిందన్న దానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు భారీ సంఖ్యలో ఒకేసారి వెళ్లడం, అప్పటికే మావోయిస్టులు ఎత్తుగా ఉన్న గుట్టలపై అప్పటికే పొంచి ఉండటం, ఆకస్మికంగా దాడి చేయడం, అత్యాధునిక ఆయుధాలు వాడటం వంటివి ప్రధాన కారణమని కొందరు పోలీసులు చెప్తున్నారు. ఎత్తులో ఉన్న వారికి ప్రత్యర్థులు అడవిలో చెట్లు, రాళ్ల మధ్య దాక్కున్న సులువుగా గుర్తించే వీలు చిక్కుతుందని.. అందుకే మావోలు నేరుగా పోలీసులను గురిపెట్టి కాల్చారని అంటున్నారు. మావోయిస్టులు ఆధునిక రాకెట్‌ లాంచర్లు వాడటంతో నేరుగా సిబ్బందిని తాకాయని.. క్షణాల్లో జరిగిన అంబుష్‌లో తప్పించుకునే వీల్లేక ఎక్కువ మంది పోలీసులు బలయ్యారని చెప్తున్నారు. అచ్చంగా 2008లో బలిమెల తరహాలోనే ఎత్తైన ప్రాంతం నుంచి కాల్పులు జరపడంతో మృతుల సంఖ్య పెరిగింది. 

2వేల మంది ఒక్కసారిగా వెళ్లడం వైఫల్యమే.. 
తెర్రం దాడిలో భద్రతా దళాల నిర్లక్ష్యం, రక్షణ చర్యలను విస్మరించడం కూడా అత్యధిక ప్రాణనష్టానికి దారితీశాయని తెలంగాణకు చెందిన పలువురు రిటైర్డ్‌ పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. మార్చి 24న మావోయిస్టు కమాండర్‌ హిడ్మా ఉన్నాడంటూ మావోయిస్టులే.. చత్తీస్‌ఘడ్‌ భద్రతా దళాలకు వ్యూహాత్మకంగా సమాచారమిచ్చి రప్పించారని ఇప్పుడు పోలీసులకు అర్థమైంది. ఆ సమాచారం ఆధారంగానే.. 2వేల మందికిపైగా భద్రతా దళాలతో పదిరోజులుగా అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. సరిగ్గా ఇక్కడే తెలంగాణ పోలీసులకు– చత్తీస్‌గఢ్‌ పోలీసులకు స్పష్టమైన తేడా కనిపించింది. మామూలుగా ఎవరైనా మావోయిస్టు లీడర్‌ ఉన్నాడంటూ సమాచారం వస్తే.. తెలంగాణ పోలీసులు ముందుగా కొందరు సభ్యులతో ఓ టీమును పంపుతారు. వారు ఇచ్చిన సమాచారంతో తర్వాతి టీం బయల్దేరుతుంది.

ఒకవేళ ముందు వెళ్లిన టీం ఆపదలో చిక్కుకున్నా.. తర్వాతి టీం ఆగమాగంగా వెళ్లదు. ఎందుకంటే మావోయిస్టులు దాడి చేసినప్పుడు కొందరిని చంపకుండా వదిలేయడం, వారిని కాపాడేందుకు వచ్చిన ఇతర దళాలపై దాడి చేయడం వంటి వ్యూహాలు అమలు చేస్తారు. అందుకే తెలంగాణ పోలీసులు అదనపు బలగాల్ని పంపాల్సి వస్తే.. మొదటి దళం వెళ్లిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళతారు. ఘటనాస్థలాన్ని మూడు వైపులా చుట్టుముడతారు. అయితే ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో 2113 మందికిపైగా సీఆర్‌పీఎఫ్, రాష్ట్ర పోలీసులు హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో హిడ్మాను వెదుకుతూ వెళ్లారు. తాము ఉచ్చులో పడ్డామన్న సంగతి దాడి మొదలయ్యేంత వరకూ గ్రహించలేకపోయారు. ఇక బుల్లెట్‌ గాయాల వల్ల తీవ్రంగా రక్తస్రావం కావడం, మండుతున్న ఎండ కారణంగా డీహైడ్రేషన్, వడదెబ్బతో పోలీసుల మరణాలు పెరిగాయని వైద్యులు చెప్పారు. 

పొగలు చూసి వెళ్లారా? 
తెర్రం ప్రాంత గుట్టలపై బాగా పట్టున్న మావోలు.. హిడ్మా అక్కడే ఉన్నాడని పోలీసులు నమ్మేలా చేశారు. డ్రోన్లతో వెళ్లిన పోలీసు లకు.. దూరంగా ఎత్తయిన ప్రాంతానికి సమీ పంలో పొగలు కనిపించాయి. హిడ్మా అక్కడే దళం తో ఉన్నాడని, అక్కడ వంటలు చేసుకుంటున్నారని పొరబడి వెళ్లి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చుట్టూ కొండలు, ఒక పక్కన పలుచగా అడవి, కొంత మైదానం లా ఉన్న ప్రాంతానికి భద్రతాదళాలు వచ్చేలా చేయడంలో మావోలు సఫలీకృతమయ్యారు. 

గతంలో జరిగిన భారీ దాడులు! 
2008 జూన్‌ 29: బలిమెల 

ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని బలిమెల రిజర్వాయర్‌లో పడవల్లో కూంబింగ్‌కు వెళ్తున్న గ్రేహౌండ్స్‌ పోలీసులపై.. గుట్టలపై నక్కి ఉన్న మావోయిస్టులు దాడి చేశారు. పడవల్లో ఉన్న 60 మంది పోలీసులు రిజర్వాయర్‌లో దూకి ఒడ్డుకు వచ్చేందుకు యత్నించారు. ఈ క్రమంలో మావోయిస్టులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఊచకోతలో మొత్తం 38 మంది పోలీసులు చనిపోయారు. 

2010 ఏప్రిల్‌ 6: చింతల్నార్‌ 
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా చింతల్నార్‌ అటవీ ప్రాంతంలో 200 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ప్రయాణిస్తోన్న కాన్వాయ్‌పై.. దాదాపు 300 మందికిపైగా మావోయిస్టులు అకస్మాత్తు దాడికి దిగారు. ఆ దాడిలో 75 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే మరణించారు. బాంబులు విసురుతూ, కాల్పులు జరిపిన మావోయిస్టులు.. గాయపడ్డ వారిని కత్తులతో పొడిచారు. ఒక సీఆర్‌పీఎఫ్‌ జవాను శరీరంపై 78 కత్తిపోట్లు ఉన్నాయని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఇక సీఆర్‌పీఎఫ్‌ జరిపిన ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు.  

2010 మే 17: బస్సుపై దాడి 
75 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను చంపిన నెలన్నర రోజుల్లోనే మావోయిస్టులు.. మరోసారి పాశవిక దాడికి దిగారు. మావోయిస్టులకు చిక్కకూడదన్న ఉద్దేశంతో సీఆర్‌పీఎఫ్, ఎస్పీవో (స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌)లు బస్సులో సాధారణ ప్రజలతో కలిసి ప్రయాణిస్తుండగా.. మావోయిస్టులు ఆ బస్సును పేల్చివేశారు. బస్సులో ఉన్నవారిలో 44 మంది చనిపోగా.. ఆరుగురే బతికారు. మృతుల్లో 18 మంది ఎస్పీవోలు కాగా, మిగిలినవారిలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, సాధారణ మహిళలు, చిన్నారులు ఉండటం కలచివేసింది. 

2013 మే 25: సుక్మా 
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో జరిగిన రాజకీయ ర్యాలీలో పాల్గొని తిరిగి వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలపై మావోయిస్టులు దాడికి దిగారు. బస్తర్‌ జిల్లా దర్బాఘాట్‌ వద్ద చెట్లు నరికి కాన్వాయ్‌ ను ఆపారు. మొదట ల్యాండ్‌ మైన్‌ పేల్చి, తర్వాత ఆపకుండా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మావోయిస్టులపై పోరుకు గిరిజనులతో ‘సల్వాజుడుం’ అనే ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ నేత మహేంద్ర కర్మ, ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నందకుమార్‌ పటేల్, విద్యాచరణ్‌ శుక్లా, భద్రతా సిబ్బందితో కలిపి మొత్తం 32 మంది చనిపోయారు.  

మరిన్ని వార్తలు