అసెంబ్లీని సందర్శించిన ఛత్తీస్‌గఢ్‌ స్పీకర్‌ 

14 May, 2022 01:34 IST|Sakshi
చరణ్‌దాస్‌కు జ్ఞాపికను బహూకరిస్తున్న గుత్తా, పోచారం 

సభ నిర్వహణ తీరుతెన్నులపై స్పీకర్, కౌన్సిల్‌ చైర్మన్‌తో చర్చ  

సాక్షి, హైదరాబాద్‌: అధికారిక పర్యటనలోభాగంగా ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ స్పీకర్‌ డాక్టర్‌ చరణ్‌దాస్‌ మహంత శుక్రవారం తెలంగాణ శాసనసభను సందర్శించారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ వి.నరసింహాచార్యులు ఛత్తీస్‌గఢ్‌ స్పీకర్‌కు స్వాగతం పలికారు.

రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నిర్వహణ తీరుతెన్నులపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పార్లమెంటరీ, లెజిస్లేటరీ సభల నిర్వహణలో రావాల్సిన మార్పులు, సభ్యుల పనితీరు తదితరాలపై చర్చించారు. శాసనసభ లాబీతోపాటు సమావేశ మందిరాన్ని కూడా మహంత పరిశీలించారు. సుమారు గంటపాటు పోచారం, సుఖేందర్‌రెడ్డితో చరణ్‌దాస్‌ భేటీ అయ్యారు. అనంతరం ఆయనకు తెలంగాణ అసెంబ్లీ తరఫున జ్ఞాపికను బహూకరించారు. గతంలో కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన చరణ్‌దాస్‌ మహంత, ఛత్తీస్‌గఢ్‌ హోం, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగానూ పనిచేశారు.  

మరిన్ని వార్తలు