Hyderabad: అదనపు డీజీ అయినా నో చాన్స్‌! 

16 Aug, 2021 06:50 IST|Sakshi
కమిషనరేట్‌లో జెండా ఆవిష్కరిస్తున్న చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ సుధారాణి

హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ ‘జెండాకు’ దూరమే.. 

ప్రొటోకాల్‌ విధులే అందుకు ప్రధాన కారణం  

కమిషనరేట్లో ఎగురవేసేది అడ్మిన్‌ అధికారులే.. 

సాక్షి, హైదరాబాద్‌: ఆగస్టు 15, జనవరి 26న దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జెండా వందనం ఉంటుంది. సంబంధిత కార్యాలయ అధిపతి జాతీయ జెండాను ఎగురవేస్తారు. అదనపు డీజీ స్థాయిలో ఉండే నగర పోలీసు కమిషనర్‌కు మాత్రం ఆ చాన్స్‌ ఉండదు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు మాత్రం అప్పుడప్పుడు అవకాశం చిక్కుతుంటుంది. నగర కొత్వాల్‌కు ఉండే కీలకమైన బాధ్యతే అందుకు కారణం.  

హైదరాబాద్‌ కమిషనరేట్‌కు అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు(ఏడీజీ) స్థాయి అధికారి, సైబరాబాద్, రాచకొండలకు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(ఐజీ) స్థాయి అధికారి కమిషనర్లుగా ఉంటారు. ప్రస్తుతం మాత్రం ఆ రెండు కమిషనరేట్లకూ ఏడీజీలే కమిషనర్లుగా ఉన్నారు.
 
► రాష్ట్ర డీజీపీకి సైతం లేని విధంగా ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ సహా వివిధ ప్రత్యేక అధికారాలు ఈ ముగ్గురు కమిషనర్లకూ ఉంటాయి. కీలక హోదా కలిగిన ఈ ముగ్గురికీ జెండా ఎగురవేసే అవకాశం ఉండదు. మిగిలిన ఇద్దరికీ అప్పుడప్పుడూ ఆ చాన్స్‌ దొరుకుతుంది. 

► జీహెచ్‌ఎంసీలో ప్రధాన కమిషనర్, కలెక్టరేట్లలో కలెక్టర్లు, న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు, జలమండలిలో దాని ఎండీ.. ఇలా వాటి అధిపతులే జాతీయ జెండాలను ఎగురవేస్తారు. కమిషనరేట్లలో మాత్రం ఇతర అధికారులకే ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

► హైదరాబాద్‌లో చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఎన్‌.సుధారాణి, సైబరాబాద్‌లో మహిళా భద్రత విభాగం డీసీపీ సి.అనసూయ ఆదివారం జెండా వందనం చేశారు. రాచకొండలో మాత్రం కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ఎగరేశారు. ఇలానే అప్పుడప్పుడు సైబరాబాద్‌ కమిషనర్‌ కూడా జెండాను ఆవిష్కరిస్తుంటారు. హైదరాబాద్‌ కొత్వాల్‌ మాత్రం ఎగరేసిన దాఖలాలు లేవు.  

► ఆయనకు కీలక బాధ్యతల కారణం హైదరాబాద్‌ కమిషనర్‌కు జెండా ఎగురవేసే అవకాశం ఉండదు. గణతంత్ర వేడుకలైనా, స్వాతంత్య్ర దినోత్సవమైనా నగరంలో అధికారిక ఉత్సవాలు జరుగుతాయి. వీటికి జనవరి 26న గవర్నర్, ఆగస్టు 15న సీఎం (ఈ రెండు సందర్భాల్లో ఇద్దరూ హాజరైనా అధికారికంగా గౌరవ వందనం స్వీకరించేది ఒకరే) హాజరవుతారు. వారితో పాటే మంత్రులు, అత్యున్నత అధికారులూ వస్తారు. దీంతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలి.  

► ఈ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షించాల్సిన బాధ్యత పోలీసు విభాగంలోని ఇతర ఉన్నతాధికారుల కంటే కమిషనర్‌కే ఎక్కువ. 

► ఇలాంటి కీలక బాధ్యతలు ఉన్నందువల్లే హైదరాబాద్‌ కమిషనర్‌కు ఎప్పుడూ తన కార్యాలయంలో జెండా ఎగురవేసే అవకాశం చిక్కదు.

మరిన్ని వార్తలు