High Court: హఠాత్తుగా వాహనం దిగి.. హోంగార్డును అభినందించి..

9 Apr, 2022 08:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అది ఎల్బీ స్టేడియం పక్కన ఉన్న బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం చౌరస్తా... రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా అబిడ్స్‌ ట్రాఫిక్‌ ఠాణా హోంగార్డు అష్రఫ్‌ అలీ ఖాన్‌ విధుల్లో ఉన్నారు. ఉదయం 9.20 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ వాహనం ఆ దారిలో వెళ్తోంది.  హఠాత్తుగా సీజే తన వాహనాన్ని స్లో చేయించి అలీని దగ్గరకు పిలిచారు. వాహనం నుంచి కిందికి దిగిన జస్టిస్‌ సతీశ్‌చంద్ర.. అలీని ‘వెల్డన్‌ ఆఫీసర్‌’ అంటూ అభినందించి పుష్పగుచ్ఛం ఇచ్చారు. దీంతో అలీఖాన్‌తోపాటు అక్కడున్న వాళ్లూ ఆశ్చర్యపోయారు.

విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన అష్రఫ్‌ 24 ఏళ్ల క్రితం హోంగార్డుగా అడుగుపెట్టారు. రెండున్నరేళ్లుగా అబిడ్స్‌ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. అలీ నిత్యం బీజేఆర్‌ స్టాట్యూ చౌరస్తాలోని పాయింట్‌లో డ్యూటీ చేస్తుంటారు. జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ రాకపోకలు సాగించేది ఈ చౌరస్తా మీదుగానే. అత్యంత ప్రముఖుల జాబితాలో ఉండే ఆయనకు ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌చానల్‌ ఇస్తుంటారు. సీజే ప్రయాణించే సమయంలో, ఆ మార్గంలో మిగిలిన వాహనాలను ఆపి, ఆయన వాహనాన్ని ముందుకు పంపిస్తారు. బీజేఆర్‌ స్టాట్యూ వద్ద అలీ ఒక్క రోజు కూడా చిన్న ఇబ్బందీ రానీయలేదు.

అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న అలీని కొన్నాళ్లుగా గమనిస్తున్న సీజే శుక్రవారం అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. హోంగార్డు అలీ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఇన్నేళ్లల్లో ఒక్కసారి కూడా సీజే స్థాయి వారిని దగ్గర నుంచి కూడా చూడలేదు. అలాంటిది సీజే నా వద్దకు వచ్చి అభినందించడంతో షాకయ్యా’ అని ఉబ్బితబ్బిబ్బయ్యారు. సీజే ఇచ్చిన స్ఫూర్తిని అలీ జీవితకాలమంతా గుర్తుపెట్టుకుంటారని డీజీపీ మహేందర్‌రెడ్డి ట్టిట్టర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు