Chikoti Praveen Case: అన్నా.. మనల్ని పిలుస్తారే!.. బెంబేలెత్తుతున్న ఎమ్మెల్యేలు, మాజీలు

10 Aug, 2022 11:31 IST|Sakshi

చీకోటి ప్రవీణ్‌ వ్యవహారంలో బెంబేలెత్తుతున్న ఎమ్మెల్యేలు, మాజీలు

క్యాసినో సందర్భంగా జరిపిన చాట్‌ను నెమరేసుకుంటున్న నేతలు 

హవాలాపై ఈడీ ప్రశ్నిస్తే ఏం చెప్పాలనే దానిపై లాయర్లు, సీఏలతో చర్చోపచర్చలు

సాక్షి, హైదరాబాద్‌: క్యాసినో వ్యవహారంలో హవాలా వ్యవహారం ఇప్పుడు పలు­వురు రాజకీయ నేతలను, ప్రముఖులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చీకోటి ప్రవీణ్‌కుమార్‌తో సన్నిహితులుగా ఉన్నవారితోపా­టు ఆయన కస్టమర్లుగా ఉన్నవారి మెడకు ఈడీ ఉచ్చు బిగిసేలా కనిపిస్తోంది. చీకోటి ప్రవీణ్‌ వాట్సాప్‌ ద్వారా సందేశాలు సా­గించిన ఎమ్మెల్యేలు, మాజీఎమ్మెల్యే­లు, మం్ర­తుల్లో ఇప్పటికే తీవ్ర చర్చ మొదలైనట్టు తెలుస్తోంది. క్యాసినో హవాలా దందాపై చీకోటి ప్రవీణ్‌తోపాటు మాధవరెడ్డి, సంపత్, గౌరీశంకర్‌ తదితర నింది­తు­ల నివాసాల్లో సోదాలతోపాటు నాలు­గు రోజులపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వి­చారించింది.

అయితే ఈ సందర్భంగా వె­లు­గులోకి వచ్చిన సంచలనాత్మకమైన వా­ట్సాప్‌ సందేశాలతో ఓ మంత్రితోపా­టు పలువురు ఎమ్మెల్యేలకు సంబంధాలున్నా­యని ఈడీ బలంగా విశ్వసిస్తోంది. దీనికి తగ్గట్టుగా సాగిన వాట్సాప్‌ చాట్‌లను రిట్రీవ్‌ చేసిన ఈడీ సంబంధిత ప్ర­ము­ఖులకు శ్రీముఖాలు జారీచేయా­లని భావిస్తోంది. ఈడీ నిజంగానే తమను పిలుస్తుందా? పిలిస్తే ఏంటన్న పరిస్థితిపై ఎ­మ్మె­ల్యేలు ఒకరికొకరు చర్చించుకుంటున్నట్టు అనుచరుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  

చదవండి: (Telangana: డీజీపీ కుర్చీ ఎవరికి?.. రేసులో ఆ ముగ్గురు..!)

క్యాసినో.. హవాలా.. ఏం చెప్పాలి 
ఈడీ పిలిస్తే ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశముందనే అంశాలపై లాయర్లు, చార్టర్డ్‌ అకౌంటెంట్లతో పలువురు ఎమ్మెల్యేలు చర్చిస్తున్నట్టు తెలిసింది. క్యాసినోకు ఎన్నిసార్లు వెళ్లారు, ప్రవీణ్‌కు అందించిన డిపాజిట్‌.. అందులో హవాలా వ్యవహారం ఏంటన్న అంశాలను నెమరేసుకుంటున్నట్టు తెలిసింది.

డిపాజిట్‌కు పంపిన డబ్బుకు లెక్క చెప్పాల్సి వస్తే ఏం చేయాలన్న దానిపై సీఏలతో చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే కేవలం క్యాసినోకు వెళ్లినవారిలో పెద్దగా భయం లేకున్నా, క్యాసినో చాటున హవాలా వ్యవహారం సాగించిన వారిలోనే తీవ్ర అలజడి నెలకొన్నట్లు తెలుస్తోంది. హవాలా సాగించే అంత రేంజ్‌ ఉన్న నేతలు ఎవరన్నదానిపై ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 

హవాలా ఆధారాలుంటే..
చీకోటి ప్రవీణ్‌ ఈడీకి ఏం చెప్పా­డు, ఎవరెవరు ఎన్నిసార్లు వచ్చారు, డిపాజిట్‌ చేసిన మొత్తంలో క్యాసినోకు ఉపయోగించిందెంత, మిగిలిన హవా­లా ఎంత అన్న అంశాలపై నేతలు ఆరా తీస్తున్నారు. ఒకవేళ హవాలా వ్యవహారంలో ఈడీకి పక్కగా ఆధారాలు దొరికితే పరిస్థితి ఏంటన్న దానిపైనా నేతలు ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. పైగా తమను విచారణకు రావాలని నోటీసులిస్తే రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం ఉంటుందన్న కలవరం కూడా నేతల్లో ఉన్నట్టు కనిపిస్తోంది.

ఇప్పటికే ఈడీ దాడులపై రాజకీయంగా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అటు బీజేపీ నేతలు నిత్యం ఈడీ దాడులపై ప్రకటనలు చేస్తుండటం ప్రముఖనేతలకు నిద్ర పట్టకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. కొంతమంది నేతలు చీకోటిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే ఈడీ విచారణలో తెలిపిన అంశాలు ఏమాత్రం బయటకు పొక్కినా చీకోటి ప్రవీణ్‌కు చట్టప్రకారం కొత్త కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని ఆయన తరపు లాయర్లు స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో క్యాసినో జాబితాలో ఉన్నవారంతా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు