అచ్యుతరావుకు కరోనా సోకిందిలా...

24 Jul, 2020 07:46 IST|Sakshi

బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు 

అచ్యుతరావుకు కరోనా సోకిందిలా...  

నలుగురు అన్నదమ్ములంతా ఉమ్మడి కుటుంబంలోనే.. 

కుటుంబ సభ్యులంతా కరోనా బాధితులే  

కోలుకున్న కుటుంబ సభ్యులు 

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌ మహమ్మారికి బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు బలికావడం ఆయన కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. నలుగురు అన్నదమ్ములతో కలిసి ఉంటూ ఉమ్మడి కుటుంబాలకు ఆదర్శంగా నిలుస్తోన్న అచ్యుతరావు ఫ్యామిలీలో తొలుత అతడి కుమారుడు కోవిడ్‌ బారిన పడ్డారు. సమీపంలోనే నివాసం ఉండే అతను ప్రతిరోజూ రాత్రి డిన్నర్‌ సమయంలో  ఉమ్మడి కుటుంబంలో ఉండే అచ్యుతరావు నివాసానికి వచ్చి భోజనం చేసి వెళ్లేవాడు. కుమారుడు జూన్‌ 15న కోవిడ్‌ బారిన పడినా..తొలుత ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ఆ తర్వాత స్వల్ప లక్షణాలు కనిపించడంతో హోం ఐసోలేషన్‌లో ఉండి  పూర్తిగా కోలుకున్నారు. (మూగబోయినబాలలగొంతు)

అచ్యుతరావుకు జూలై 13న కోవిడ్‌ నిర్ధారణ అయ్యింది. అస్తమాతో బాధపడుతున్న ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో చికిత్స కోసం మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. పది రోజులు కోవిడ్‌తో పోరాడి బుధవారం తనువు చాలించారు. అతని సోదరుడు సైతం కరోనా బారిన పడి అదే ఆస్పత్రిలో రెండురోజులపాటు చికిత్సపొంది ఇటీవలే డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే చింతలకుంటలో నివాసం ఉంటున్న అచ్యుతరావు కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు, వారి భార్యలు, పిల్లలు మొత్తంగా పది మంది ఉంటారు. వీరంతా కోవిడ్‌ బారినపడ్డారు. ప్రస్తుతం  అందరూ హోం క్వారంటైన్‌లో ఉండి కోవిడ్‌ను జయించడం విశేషం.

కొందరిలో కనిపించని లక్షణాలు.. 
కోవిడ్‌ మహమ్మారి చాపకింద నీరులా ప్రవేశించి పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. ఆయా కుటుంబాల్లో యువకులు, ఆరోగ్యవంతులకు కోవిడ్‌ సోకినా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో వారంతా ఇతర కుటుంబ సభ్యులతో కలిసే ఉంటున్నారు. టిఫిన్, భోజనం, డిన్నర్‌ కలిసే చేస్తున్నారు. తద్వారా ఇంట్లో ఉన్న అందరూ కరోనా బారినపడుతున్నారు. ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధులు, అస్తమా తదితర శ్వాసకోశ వ్యాధులున్నవారికి కోవిడ్‌ ప్రాణాంతకంగా మారుతోంది. మరోవైపు కోవిడ్‌పై అన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న సమాచారంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న కోవిడ్‌ రోగులు సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌తో ప్రాణాలు విడుస్తుండటం గమనార్హం.  (వాడిన మాస్క్లను ఎలా పడేయాలంటే..)

కలిసి భోజనం చేయడంతో... 
ప్రతిరోజూ అచ్యుతరావు కుటుంబ సభ్యులంతా రాత్రి భోజనం కలిసే చేస్తారు. ఈ సమయంలో తొలుత అతని కుమారుడు కోవిడ్‌ బారినపడటం, అతనికి ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో రోజూ అందరూ కలిసి భోజనానికి కూర్చోవడంతో కోవిడ్‌ ఆ కుటుంబం మొత్తానికి సోకినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోవిడ్‌ లక్షణాలున్నవారు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని..హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటించడం ద్వారా కోవిడ్‌ను జయించవచ్చని చెబుతున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు