బిడ్డా.. తమ్ముడు పైలం..!

29 May, 2021 10:22 IST|Sakshi

 బిడ్డలకు జాగ్రత్తలు చెప్పిన తల్లి

ఈనెల 19న ప్రసవానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..

ఐదు నెలల క్రితం కరోనాకు తండ్రి బలి

అమ్మానాన్నను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో చిన్నారులు

 అమ్మ వస్తుందని ఇంకా ఆశతో ఎదురుచూస్తున్న పసిహృదయాలు

సాక్షి, జగిత్యాల: వారిది పేద కుటుంబం. పనిచేస్తేనే పూటగడిచేది. కూలీపని చేసుకుంటూనే భీమయ్య చేపలు కూడా పడుతూ ఇంటికోసం కష్టపడేవాడు. భార్య రాజకళ కూడా కూలీ పనులు చేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. ఇలా ఆ దంపతులు కష్టపడుతూ తమ ఇద్దరు పిల్లలతో ఆనందంగా జీవిస్తున్నారు. గర్భిణి అయిన తన భార్యను కంటికి రెప్పలా చూసుకుంటున్న భీమయ్యకు ఐదు నెలల క్రితం కరోనా సోకింది. కనికరం చూపని ఆ మహమ్మారి అతడ్ని బలితీసుకోగా.. వారం క్రితం రాజకళ సైతం ప్రసవ సమయంలో పరలోకానికి చేరింది. దీంతో వారి ఇద్దరు కొడుకులు గణేశ్‌(13), మనోజ్‌ (7) తల్లిదండ్రులు లేని వారయ్యారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తికి చెందిన సాతాపురం భీమయ్య(40), ఆయన భార్య రాజకళ (32) దీనగాథ ఇది. 

బిడ్డా.. మళ్లొస్తానని చెప్పి..
ఐదు నెలల క్రితం కరోనాతో భీమయ్య చనిపోయిన సమయంలో అతని భార్య రాజకళ గర్భిణీ. భర్త చనిపోయిన బాధను దిగమింగుకుని రాజకళ కూలీ పనిచేస్తూ పిల్లలను పోషించుకుంది. అదే అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించింది. ఈ నెల 19న పురిటినొప్పులు వచ్చాయి. చుట్టుపక్కల వారే ప్రసవం కోసం జగిత్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెళ్లేప్పుడు పిల్లలకు జాగ్రత్తలు చెప్పింది. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవాలని గణేశ్‌కు చెప్పింది. మళ్లీ వస్తానంటూ వెళ్లింది. ఆస్పత్రికి వెళ్లేసరికి కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది. తీవ్ర రక్తస్రావమైంది. రక్తం ఎక్కిస్తేనే బతుకుతుందని వైద్యులు చెప్పారు. ఎంత ప్రయత్నించినా రక్తం దొరకలేదు. దీంతో ఆమె పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. కరోనా విజృంభణ నేపథ్యంలో గ్రామానికి చెందిన బీజేపీ, ఆరెస్సెస్‌ నాయకులు మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తీసుకొచ్చారు. పీపీఈ కిట్లు వేసుకుని వారే అంత్యక్రియలు పూర్తిచేశారు. పిల్లలకు దూరం నుంచి తల్లి మృతదేహాన్ని చూపించారు. 

చేరదీసిన దూరపు బంధువు 
అభంశుభం తెలియని వయసులో చిన్నారు లిద్దరూ.. ఐదునెలల వ్యవధిలో తల్లిదండ్రులిద్దరినీ పోగొట్టుకున్నారు. చిన్నారులకు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు సైతం లేరు. మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌కు చెందిన వరుసకు అమ్మమ్మ అయ్యే సాయమ్మ వీరిని చేరదీసింది. చిన్నారులు ఉంటున్న అద్దె ఇంట్లోనే ఆ వృద్ధురాలు ఉంటూ వారి ఆలనా పాలనా చూస్తోంది. మండలానికి చెందిన కొందరు దాతలు చిన్నారులకు అండగా నిలిచి కొంత ఆర్థిక సాయం చేస్తున్నారు.

నా జీవునం ఉన్నంత వరకు సూసుకుంట..
పిల్లల తండ్రి కరోనా వచ్చి సచ్చిపోయిండు. తల్లి కాన్పుకు పోయి తిరిగి రాలేదు. పిల్లలు ఆగమయ్యిర్రు. నా జీవునం ఉన్నంత కాలం వీళ్లను సూసుకుంట. ప్రభుత్వం పిల్లలను ఆదుకోవాలె. డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తే రుణపడి ఉంటాం.
– సాయమ్మ, చిన్నారుల బంధువు

చదవండి: బాలిక గర్భంపై ‘సోషల్‌’ వార్‌.. ఎమ్మెల్యేకు తలనొప్పి  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు