తెలంగాణ గ్రిడ్‌పై డ్రా‘గన్‌’

3 Mar, 2021 01:34 IST|Sakshi

తెలంగాణ విద్యుత్‌ వ్యవస్థపై చైనా నుంచి సైబర్‌ దాడులు

ఎస్‌ఎల్డీసీ, ట్రాన్స్‌కో సిస్టంలతో కమ్యూనికేట్‌ కావడానికి యత్నాలు

ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ హెచ్చరిక

అప్రమత్తమై రక్షణ చర్యలు తీసుకున్న ట్రాన్స్‌కో..

స్కాడా పరిధి నుంచి చైనా పరికరాల తొలగింపు

రిమోట్‌ ద్వారా గ్రిడ్‌ నిర్వహణ తాత్కాలికంగా నిలుపుదల..

సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సరఫరా వ్యవస్థ (గ్రిడ్‌)పై చైనా నుంచి సైబర్‌ దాడులకు ప్రయత్నాలు జరుగు తున్నాయని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్టీ–ఇన్‌) హెచ్చరించింది. చైనాకు చెందిన ‘కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సర్వర్లు’.. తెలంగాణ రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్డీసీ)తోపాటు తెలంగాణ ట్రాన్స్‌కో కంప్యూటర్‌ సిస్టంలతో ‘కమ్యూనికేట్‌’ కావడానికి ప్రయత్నిస్తున్నాయని, విద్యుత్‌ వ్యవస్థ భద్రత దృష్ట్యా సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరింది.

భారతదేశ సైబర్‌ భద్రత అవసరాల కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ 2004లో ‘సీఈఆర్టీ–ఇన్‌’ను ఏర్పాటు చేసింది. సీఈఆర్టీ–ఇన్‌ తాజా హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ట్రాన్స్‌కోఅప్రమత్తమై తక్షణ చర్యలు తీసుకుంది. సీఈఆర్టీ–ఇన్‌ గుర్తించి పంపిన ‘చైనీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సర్వర్ల ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌(ఐపీ) అడ్రస్‌లను ట్రాన్స్‌కో బ్లాక్‌ చేసింది. దీంతో చైనీస్‌ సైబర్‌ నేరగాళ్లు నిర్వహిస్తున్న ఈ సర్వర్లు.. ట్రాన్స్‌కో, ఎస్‌ఎల్డీసీకు చెందిన కంప్యూటర్‌ సిస్టంలతో కమ్యూనికేట్‌ కావడానికి దారులు మూసేసినట్టు అయింది.

- హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధలో ఉన్న లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్డీసీ) నుంచి రిమోట్‌ ఆపరేషన్‌ ద్వారా రాష్ట్రంలోని వివిధ విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలోని సర్క్యూట్‌ బ్రేకర్లను నియంత్రించే వ్యవస్థ పనిచేయకుండా తాత్కాలికంగా డిజేబుల్‌ చేసింది. దీంతో హాకర్లు రిమోట్‌ ఆపరేషన్‌ ద్వారా గ్రిడ్‌ను నియంత్రణలోకి తీసుకోవడానికి, కుప్పకూల్చడానికి అవకాశం లేకుండా పోయింది. 
- దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) వెబ్‌సైట్‌కు సంబంధించి లాగిన్‌ యూజర్‌ ఐడీలు, పాస్‌వర్డ్‌లను మార్చివేసింది.


- గ్రిడ్‌ భద్రతను కట్టుదిట్టం చేయడానికి .. సూపర్వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అక్విజేషన్‌ (స్కాడా) కంట్రోల్‌ సెంటర్‌ పరిధి నుంచి అనుమాస్పద పరికరాలను దూరంగా తరలించి ఐసోలేట్‌ చేశారు. ప్రధానంగా చైనా నుంచి కొనుగోలు చేసిన పరికరాలను గుర్తించి స్కాడా పరిధి నుంచి దూరంగా తరలించారు. రాష్ట్రంలోని వినియోగదారులకు నిరంతర విద్యుత్‌ సరఫరాకు ఎలాంటి ప్రమాదం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌ రావు తెలిపారు.

నష్టమేంటి!

  • సైబర్‌ నేరగాళ్లు మన విద్యుత్‌ సంస్థల కంప్యూటర్‌ వ్యవస్థలోకి చొరబడితే... మొత్తం సరఫరా వ్యవస్థను వారు నియంత్రించగలుగుతారు. గ్రిడ్‌ను కుప్పకూల్చే ప్రమాదం ఉంటుంది.
  • గ్రిడ్‌ కుప్పకూలితే విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి రాష్ట్రం అంధకారం అవుతుంది. కొన్ని గంటల పాటు కరెంటు ఉండదు. పరిస్థితి తీవ్రతను బట్టి ఈ సమయం పెరుగుతుంది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు.
  • మెట్రో రైలు సర్వీసులకు అంతరాయం కలుగుతుంది.
  • థర్మల్‌ పవర్‌స్టేషన్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోతుంది. పునరుద్ధరించాలంటే ఒకట్రెండు రోజుల సమయం పడుతుంది. ఒకేసారి అన్ని యూనిట్లలో ఉత్పత్తిని పునరుద్ధరించడం సాధ్యం కాదు. క్రమేపీ ఒక్కో యూనిట్‌ను స్టార్ట్‌ చేస్తూ... పూర్తి సామర్థ్యానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.

కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సర్వర్లు అంటే? 
హాకింగ్, సైబర్‌ దాడుల కోసం సైబర్‌ నేరస్థులు వినియోగించే కంప్యూటర్లను ‘కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ (సీ అండ్‌ సీ) సర్వర్లు’అంటారు. ఈ సర్వర్ల నుంచి దాడులు చేయాల్సిన కంప్యూటర్లకు కమాండ్స్‌ (సాంకేతిక ఆదేశాలు) పంపించి డేటాను చోరీ చేయడం లేదా మొత్తం కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను తమ నియంత్రణలోకి తీసుకోవడం చేస్తుంటారు. సిస్టమ్స్‌లో మాల్‌వేర్‌ చొప్పించి ఈ దాడులకు పాల్పడుతారు. ఈ ప్రక్రియ అంతటికీ కమ్యూనికేట్‌ కావడమే కీలకం. ఒకసారి గనక సైబర్‌ నేరగాళ్లు మన వ్యవస్థలో ఒక సిస్టంతో సంబంధాలు నెలకొల్పుకోగలిగితే చాలు. ఆపై మొత్తం నెట్‌వర్క్‌ను తమ ఆధీనంలోకి తీసుకోగలుగుతారు.

ముంబై తర్వాత టార్గెట్‌ హైదరాబాద్‌?
చైనా నుంచి సైబర్‌ దాడుల ఫలితంగానే గతేడాది అక్టోబర్‌లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ కుప్పకూలి ముంబై నగరం అంధకారమైందని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక సోమవారం సంచలన కథనం రాసింది. గాల్వాన్‌ లోయలో భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత భారత దేశానికి గట్టి హెచ్చరికలు జారీ చేయాలన్న ఉద్దేశంతో చైనా ఈ సైబర్‌ దాడికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తం చేసింది. మరుసటి రోజే సీఈఆర్టీ–ఇన్‌ నుంచి రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు చైనా నుంచి సైబర్‌ దాడులకు పొంచి ఉన్న ముప్పుపై హెచ్చరికలు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలోని ఎన్నో వ్యూహాత్మక సంస్థలకు నిలయమైన హైదరాబాద్‌ నగరాన్ని సైతం లక్ష్యంగా చేసుకుని చైనా సైబర్‌ దాడులకు ప్రయత్నాలు చేసినట్టు తాజా హెచ్చరికలు స్పష్టం చేస్తున్నాయి.

అంతటా ఆటోమేషన్‌..
విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్వహణ నుంచి విద్యుత్‌ సరఫరా వ్యవస్థ (గ్రిడ్‌) నిర్వహణ వరకు ప్రస్తుతం అంతటా ఆటోమేషన్‌ ద్వారానే సాగుతోంది. ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లతో నడిచే కంప్యూటర్‌/ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలతో మన అవసరాలకు తగ్గట్లు విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా జరిగేలా గ్రిడ్‌ను అనుక్షణం నియంత్రిస్తుంటారు. చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకొనే పరికరాల్లో ముందే మాల్‌వేర్‌/వైరస్‌ చొప్పించి ఉంటే మన విద్యుదుత్పత్తి, సరఫరా వ్యవస్థలను సైబర్‌ నేరస్థులు హైజాక్‌ చేసి గ్రిడ్‌ను కుప్పకూల్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతేడాది ముంబైలో గ్రిడ్‌ కూలిపోవడం వెనక ఇదే కారణమని చర్చ జరుగుతోంది.

గతేడాది కేంద్రం హెచ్చరికలు
విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్‌ నిర్వహణ సంబంధ ఎలక్ట్రానిక్‌ పరికరాలు, విడిభాగాల్లో మాల్‌వేర్‌/ట్రోజన్స్‌ తదితర వైరస్‌లను హ్యాకర్లు చొప్పించే ప్రమాదం ఉందని, వాటి వాడకం వల్ల విద్యుత్‌ సరఫరా వ్యవస్థ (గ్రిడ్‌)పై సైబర్‌ దాడులు జరిగే అవకాశాలున్నాయని గతేడాది నవంబర్‌లో కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వ్యూహాత్మకమైన విద్యుత్‌ రంగాన్ని పరిరక్షించడానికి రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.

చైనా నుంచే అత్యధిక దిగుమతులు
చైనా నుంచి భారత్‌కు దిగుమతుల్లో విద్యుత్‌ పరికరాలు, విడిభాగాలదే ప్రథమ స్థానం. సాధారణ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి స్మార్ట్‌ గ్రిడ్ల నిర్వహణకు అవసరమైన అత్యాధునిక పరికరాలు చైనాలో అత్యంత చౌకగా లభిస్తుండటమే దీనికి కారణం. 2018–19లో చైనా నుంచి రూ. 1.84 లక్షల కోట్లు, 2019–20లో రూ. 1.44 లక్షల కోట్ల విలువైన విద్యుత్‌ పరికరాలు, విడిభాగాలను మన దేశం దిగుమతి చేసుకుంది.
   

మరిన్ని వార్తలు