నిగర్వి.. పెద్దల మాటను గౌరవించే వ్యక్తి జగన్‌ 

8 Feb, 2022 03:30 IST|Sakshi
ముచ్చింతల్‌ ఆశ్రమంలో సీఎం జగన్‌ను సత్కరించిన చినజీయర్‌ స్వామి

వైఎస్సార్‌ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పని చేశారు 

ఏపీలోని అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారు 

కొనియాడిన చినజీయర్‌ స్వామి  

సాక్షి, హైదరాబాద్‌: ‘విద్య, ధనం, వయసు, అధికారం కలిగి ఉన్న వారు ఇతరుల సలహాలు తీసుకోరు. కానీ జగన్‌కు ఈ నాలుగు ఉన్నప్పటికీ ఎలాంటి గర్వం లేదు. పెద్దల మాటను గౌరవిస్తారు. పెద్దలు ఇచ్చే సూచనలు, సలహాలను స్వీకరిస్తారు.. పాటిస్తారు. జగన్‌మోహన్‌రెడ్డి మరింత ఉన్నత స్థానానికి ఎదిగి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నా..’ అని త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు. రామానుజాచార్యుల విగ్రహాన్ని సందర్శించేందుకు వచ్చిన ఏపీ సీఎం జగన్‌ను మైహోం ఎండీ రామేశ్వర్‌రావు జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం చినజీయర్‌ స్వామి మాట్లాడుతూ.. యువకుడు జగన్‌ ధర్మ పరిరక్షణకు, సమాజంలో సమానత కోసం ఏం కావాలో తెలుసుకొని దాని కోసం కృషి చేస్తున్న వ్యక్తి అని అన్నారు.


ముచ్చింతల్‌ క్షేత్రంలో తీర్థప్రసాదాలను స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనకు తెలుసని, ముఖ్యమంత్రి కాక ముందు ఆయన తనను కలిశారని గుర్తు చేసుకున్నారు. ఏ పాలకుడికైనా ఉండాల్సింది అన్ని వర్గాల ప్రజలను, వారి ప్రయోజనాలను సమానంగా చూడటమేనని.. జగన్, వైఎస్సార్‌ల ఆలోచన ఇదేనని చెప్పారు. ‘వారు అన్ని వర్గాల వారి హక్కులను కాపాడుతూ, వారి సంక్షేమానికి పాటుపడాలని భావించారు. ఏపీలోని అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న జగన్‌ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయా. సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహ సందర్శనకు సమాజంలో అన్ని వర్గాలకు మంచి జరగాలని కోరుకున్న వారిని ఆహ్వానించాం.


ముచ్చింతల్‌ క్షేత్రంలో తీర్థప్రసాదాలను స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సమానత్వం పట్ల ఉన్న దృఢ సంకల్పంతో జగన్‌ రావడం సంతోషకరం’ అని చినజీయర్‌ చెప్పారు. నెల్సన్‌ మండేలా నల్ల, తెల్ల జాతీయుల మధ్య సమానత్వం కోసం పాటుపడ్డారని, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ కూడా ఇదే తరహాలో కృషి చేశారన్నారు. ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ పేరిట సమానత్వం కోసం ప్రపంచవ్యాప్తంగా పనిచేసిన వారి చిత్రపటాలను ఏర్పాటు చేస్తామని, ఆ హాల్లోకి ప్రవేశించి ఆ చిత్రాలను స్పృశించగానే వారి గురించి హెడ్‌ఫోన్స్‌ ద్వారా వినే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమానత్వం కోసం కృషి చేసిన 150 మందిని ఇప్పటివరకు గుర్తించామన్నారు. వీరందరి కన్నా ముందు వెయ్యేళ్ల క్రితమే సామాజిక, ఆర్థిక, లింగ వివక్షలపై పోరాడి సమానత్వం కోసం తపించిన మహనీయుడు రామానుజాచార్యుడని చినజీయర్‌ స్వామి కీర్తించారు. పాలకులు, అధికారులు, మేధావులు, సాధారణ ప్రజల ఆలోచనలు ఒకేవిధంగా ఉండవని, అయితే రామానుజాచార్యులు ఈ నలుగురి ఆలోచనలను ఒకే తోవలోకి తీసుకొచ్చారని కొనియాడారు.  


చినజీయర్‌ స్వామికి దండ వేస్తున్న సీఎం జగన్‌

చెవిరెడ్డి దగ్గరుండి సేవలు చేశారు 
జగన్‌ తొలిసారి క్షేత్రానికి వచ్చినా, ఆయన తరపున చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి చాలా రోజుల నుంచే ముచ్చింతల్‌లో ఏర్పాట్లు చూశారని చినజీయర్‌ స్వామి చెప్పారు. ఉత్సవాలకు ముందే సంక్రాంతి నుంచి ఏర్పాట్లు చూశారన్నారు. ‘మంచిగా చూడవయ్యా..’ అంటూ పూలు, పండ్ల అలంకరణలన్నీ దగ్గరుండి చేయించారన్నారు. ‘మా బాస్‌ చెప్పారు... చేస్తున్నాం’ అని చెప్పేవారని, ఆయనను జగన్‌ ప్రోత్సహించడం ముదావహమని చినజీయర్‌ అన్నారు. ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి, స్వర్ణమ్మల సేవలను చినజీయర్‌ స్వామి అభినందించారు. వీరందరికి రామేశ్వర్‌ రావు జ్ఞాపికలను అందజేశారు.    


సీఎం జగన్‌ను ఆశీర్వదిస్తున్న చినజీయర్‌ స్వామి

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు