Sammakka - Saralamma: చినజీయర్‌ స్వామి క్షమాపణ చెప్పాలి 

17 Mar, 2022 02:14 IST|Sakshi
చినజీయర్‌స్వామి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న పూజారులు, ఆదివాసీ నాయకులు 

వనదేవతలమీద స్వామి వ్యాఖ్యలపై మేడారం పూజారుల మండిపాటు 

ఎస్‌ఎస్‌ తాడ్వాయి/గుండాల: సమ్మక్క, సారలమ్మ వనదేవతలమీద త్రిదండి చినజీయర్‌ స్వామి చేసిన వ్యాఖ్యలపై పూజారులు మండిపడ్డారు. స్వామి వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం సమ్మక్క, సారలమ్మ పూజారులు, వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వా యి మండలంలోని మేడారంలో చినజీయర్‌ స్వామి దిష్టిబొమ్మను దహనం చేశారు. అయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న స్వామి మాటలపై పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు మాట్లాడుతూ చినజీయర్‌ స్వామి ఇంగీత జ్ఞానం లేకుండా సమ్మక్క, సారలమ్మ దేవత కాదని అనడం అవివేకమన్నారు.

కోట్లాది మందికి అశీర్వాదాలు అందించే తల్లులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఆదివాసీ ప్రజానీకానికి, వనదేవతలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా, స్వామి వ్యాఖ్యలను తప్పుబడుతూ భద్రాద్రి కొత్త గూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డలోని పగిడిద్దరాజు గుడివద్ద అరెం వంశీయులు బుధవారం నిరసన తెలిపారు. సమ్మక్క, సారలమ్మ విషయంలో స్వామి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.

మరిన్ని వార్తలు