Chinnaswamy Rajendran: ఇక్కడ దొరికే సంతోషం ఎక్కడా దొరకదు

1 Sep, 2022 12:18 IST|Sakshi
మహాగణపతికి కంటిపాప అమరుస్తున్న శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్‌

18 ఏళ్ల వయసులోనే ఖైరతాబాద్‌ గణేషుడిని రూపు దిద్దాను

నాకు, నా కుటుంబానికి మహా గణపతితో ప్రత్యేక గుర్తింపు

మట్టి మహాగణపతిని రూపుదిద్దాలనే పదేళ్ల కోరిక నెరవేరింది

‘సాక్షి’తో శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్‌   

సాక్షి, హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ మహాగణపతిని ప్రతి యేటా వివిధ రూపాల్లో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతూ భక్తుల మన్ననలు పొందుతున్నారు. ఆయనకు 18 ఏళ్లు ఉన్నప్పుడే మహాగణపతిని రూపుదిద్దారు. నూతన యవ్వనంలో ఉన్న పిల్లోడు గణపతి ప్రతిమను ఇంత బాగా తయారు చేశాడా? అని అంతా వేనోళ్ల పొగిడారు. ఇప్పటివరకు తయారు చేసినవాటిలో ఎలుక రథంపై ఉన్న గణేష్‌ విగ్రహమే తనకు అత్యంత ఆనందాన్నిచ్చిందంటున్నారు. 1978 నుంచి ఖైరతాబాద్‌ మహా గణపతిని తయారు చేస్తూ వస్తున్న శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్‌.. ‘సాక్షి’తో తన  అనుభవాలను పంచుకున్నారు.    


మహాగణపతి తయారీ అవకాశం మీకెలా దక్కింది?   

1978లో రిజర్వ్‌బ్యాంక్‌లో ఉద్యోగి ఏసుపాదం నా వద్దకు వచ్చి ఖైరతాబాద్‌లో శంకరయ్య ఆధ్వర్యంలో వినాయకుడిని 14 అడుగుల ఎత్తులో  తయారు చేయాలని తీసుకువెళ్లారు. నాకు అప్పుడు 18 ఏళ్లు. ఇంత చిన్న పిల్లోడు విగ్రహం ఎలా తయారు చేస్తాడు? అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశా. తొలిసారిగా ఖైరతాబాద్‌లో ఆరు బయట స్టేజీ వేసి విష్ణు అవతారంలో వినాయక విగ్రహాన్ని రూపొందించాను.  ఆ తర్వాత నాట్య వినాయకుడు, 1980లో పంచముఖ వినాయకుడిని శారదా స్టూడియోలో చేసి ఇక్కడకు తీసుకువచ్చాం. 1982లో ఎలుక రథంతో ఖైరతాబాద్‌ మంటపంలో వీలు ఉండే స్టాండ్‌లో కర్రలతో తయారు చేశాం. అప్పుడు సాగర సంగమం సినిమా షూటింగ్‌లో భాగంగా కమల్‌హాసన్‌తో ఇక్కడే ఓ పాటను రికార్డింగ్‌ చేశారు.  

ఇన్నేళ్లలో ఎప్పుడైనా విరామం ఇచ్చారా? 
1983లో అనివార్య కారణాలతో రాలేకపోయాను. అప్పుడు ఆర్టిస్టు బ్రహ్మం 25 అడుగులతో వెల్డింగ్‌తో వినాయకుడిని తయారు చేశారు. చివర్లో మళ్లీ 10 రోజులు నేను వచ్చి తుది మెరుగులు దిద్దాను. 1993 నుంచి 1999 వరకు 7 ఏళ్లపాటు  ఖైరతాబాద్‌ మహాగణతికి శిల్పిగా వ్యవహరించలేదు. 2000 నుంచి 2005 వరకు కమిటీ వాళ్లు ఇచ్చిన డ్రాయింగ్‌ మేరకు విగ్రహ తయారీ జరిగేది. 2006 నుంచి దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ పంచాగం చూసి నామకరణం, ఆకారం ఎలా ఉండాలో సూచించేవారు అదే విధంగా ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్నాం. నామకరణం పెట్టిన తర్వాత మహాగణపతికి పేరు ప్రతిష్ఠలు పెరిగాయి. 


మీకు అత్యంత ఆనందాన్నిచ్చిన గణపతి?   

1982లో ఎలుక రథంపై చేసిన వినాయకుడు బాగా సంతోషం కలిగింది. ఆ తర్వాత విశ్వరూప వినాయకుడు, మత్స్య వినాయకుడి రూపంలో చేసినవి నాకెంతో సంతృప్తినిచ్చాయి. ప్రతిసారి నాలోని శక్తినంతా కూడదీసుకుని తయారు చేస్తూ వస్తున్నా.  

విగ్రహ తయారీ సమయంలో ఎలాంటి అనుభూతి పొందుతారు?  
2003లో యాదాద్రి సురేంద్రపురిలో పని చేస్తుండంతో నేను ఆ ఏడాది విగ్రహం తయారు చేయలేనని చెప్పాను. తర్వాత నేను టూ వీలర్‌పై వెళ్తుండగా పెద్ద ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో నా బండి పూర్తిగా ధ్వంసమైనా నాకేమీ కాలేదు. అప్పుడు నా మదిలో మెదిలింది ఖైరతాబాద్‌ మహాగణపతే. దాంతో ఆ సంవత్సరం కూడా నేను శిల్పిగా వ్యవహరించి వినాయకుడిని పూర్తి చేశా. నేను బతికి ఉన్నంత కాలం మహాగణపతి తయారీలో ముందుంటాను. 

మీ స్వగ్రామంలో మీకెలాంటి గుర్తింపు ఉంది? 
మా సొంతూరు తమిళనాడులోని పెరంబలూరు జిల్లా పుదువేటైకుడి. తల్లిదండ్రులు చిన్నస్వామి, మరుదాయి. నేను రెండో సంతానం. చిన్నస్వామి రాజేంద్రన్‌ అని పేరు పెట్టారు. ఖైరతాబాద్‌ వినాయకుడిని చేసినప్పటి నుంచి నాతో పాటు నా కుటుంబానికి మంచి గుర్తింపు వచ్చింది. ఎక్కడకు వెళ్లినా ఖైరతాబాద్‌ విగ్రహ తయారీ శిల్పిగా గుర్తింపు వచ్చింది. 

మీ వ్యక్తిగత జీవితం గురించి వివరిస్తారా?
ఖైరతాబాద్‌ మహాగణపతికి శిల్పిగా వ్యవహరిస్తున్నప్పటి నుంచి నా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా ఉంది. 68వ సంవత్సరంలో కూడా 50 అడుగులపై గోవా కట్టెలు ఎక్కి పని చేస్తున్నానంటే అన్నీ మహాగణపతి దీవెనలే. నా భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు మోహన్‌కృష్ణ, కూతురు మాలతి ఎప్పుడూ  నాకు సపోర్ట్‌గా ఉంటారు. అన్ని వేళలా సహాయ సహకారాలు అందజేస్తారు.  

నగరంతో మీకున్న అనుబంధం? 
హైదరాబాద్‌లో ఎక్కడా లేని విధంగా వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఉత్సవాలకు హాజరు కావడం నాకెంతో సంతోషాన్నిస్తుంది. ఇక్కడ దొరికే సంతోషం ఎక్కడా దొరకదు. అందరి అభిమానం మరువలేను. 


ఈ ఏడాది మట్టి వినాయకుడి తయారీపై మీ ఫీలింగ్‌?  

మట్టి వినాయకుడిని చేయాలనేది గత 10 ఏళ్లుగా నా కోరిక. గత సంవత్సరం ఉత్సవ కమిటీ చైర్మన్‌ సింగరి సుదర్శన్‌తో.. మట్టి విగ్రహాన్ని తయారు చేస్తానని చెప్పాను. విగ్రహం తయారు చేస్తున్నప్పుడు వర్షం అడ్డంకిగా మారినా ఏమాత్రం వెనుకంజ వేయకుండా నిర్విఘ్నంగా పూర్తి చేశా. అంతా ఆ మహాగణపతి చల్లని చూపులే కారణం. (క్లిక్‌: ఖైరతాబాద్‌లో కొలువు దీరిన మహా గణపతి)

మరిన్ని వార్తలు