Chitti In Town: చిట్టి ఇన్‌ టౌన్‌.. రోబో@ రెస్టారెంట్‌ 

14 Aug, 2021 10:41 IST|Sakshi
ఆహారాన్ని తీసుకొస్తున్న రోబో ఫొటోను తమ ఫోన్లలో బంధిస్తున్న అతిథులు

ఏడాదిన్నర కాలంగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మనిషి జీవనశైలిలోనే కాదు ఆతిథ్య రంగంలోనూ మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో వెయిటర్లు వడ్డిస్తే తినడానికి ప్రజలు ఆలోచిస్తున్నారు. దీంతో ఓ రెస్టారెంట్‌ నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించి వెయిటర్ల స్థానంలో రోబోలను తీసు కొచ్చారు. వినియోగదారులు ఇచ్చే ఆర్డర్లను తీసుకొని సర్వ్‌ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీనికి సరూర్‌నగర్‌ హూడాకాంప్లెక్స్‌లోని ‘చిట్టి ఇన్‌ టౌన్‌’ రోబో రెస్టారెంట్‌ వేదికగా మారింది.

సాక్షి, హుడాకాంప్లెక్స్‌: కరోనాకు భయపడి చాలా మంది  రెస్టారెంట్‌ ఫుడ్‌కు దూరంగా ఉంటున్నారు. ఫుడ్‌ సర్వ్‌ చేసే వాళ్లకి కరోనా లక్షణాలు ఉంటే తమకు ఎక్కడ సోకుతుందోనని ప్రజలు హోటల్, రెస్టారెంట్‌కి వెళ్లడానికి జంకుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మలక్‌పేట్‌కు చెందిన మణికాంత్‌గౌడ్‌ వినూత్నంగా ఆలోచించాడు. వెయిటర్ల స్థానంలో రోబోలను పెట్టి ఫుడ్‌ సర్వ్‌ చేసేలా.. ఆర్డర్‌ తీసుకునేలా ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించాలని పూనుకున్నాడు. కొత్తపేట్‌లోని హుడాకాంప్లెక్స్‌లో ‘చిట్టి ఇన్‌ టౌన్‌’పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. 

ప్రస్తుతం ఇక్కడ నాలుగు రోబోలను అందుబాటులో ఉంచారు. రెస్టారెంట్‌కు వచ్చే వారి ఆర్డర్లు తీసుకోవడం.. వచి్చన ఆర్డర్లను షెఫ్‌కు అందజేయడం... ఆహారం రెడీ అయిన తర్వాత ఆహారప్రియులకు వడ్డిస్తున్నాయి. అంతే కాకుండా తిన్న తరువాత ప్లేట్లను తీసుకెళ్లి శుభ్రం చేయడం.. బిల్లు జారీ చేయడం.. కస్టమర్‌ ఇచ్చిన డబ్బులను తీసుకెళ్లి కౌంటర్‌లో జమ చేయడం పనులన్నీ రోబోలే చేస్తుండటం విశేషం. రోబోలు చేస్తున్న ఈ పనులను చూసి కస్టమర్లు మంత్రముగ్ధులవుతున్నారు. మరో రోబో వచ్చి రెస్టారెంట్‌కు వచ్చిన వారితో ముచ్చటిస్తుంది. వచి్చన వారికి బోరు కొట్టకుండా చూస్తూ అతిథులను అమితంగా ఆకట్టుకుంటోంది.  

మంచి ఆదరణ..
కోవిడ్‌భయంతో రెస్టారెంట్‌కు రావడానికి జనాలు భయపడేవారు. నలుగురు మిత్రులం కలిసి వినూత్నంగా ఈరెస్టారెంట్‌ను ప్రారంభించాం. ఇప్పటికే మేం రోబోటిక్‌ కోర్సులను పూర్తి చేసి ఉండటంతో రోబోల తయారీ, పనితీరుపై మాకు అవగాహన ఉంది. ఇది మాకు కలిసి వచ్చింది. వీటిని చూసేందుకు చాలా మంది వస్తున్నారు. 120 సీటింగ్‌ సామర్థ్యం ఉన్నరెస్టారెంట్‌కు రావాలంటే ఆన్‌లైన్‌ బుకింగ్‌ తప్పని సరి. నేరుగా వచ్చేవారు వేచిఉండాల్సి ఉంటుంది. ఈ రోబోలతో రెస్టారెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.    
– మణికాంత్‌ గౌడ్, రెస్టారెంట్‌ యజమాని

మరిన్ని వార్తలు