మెదక్‌ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు..

25 Dec, 2020 09:22 IST|Sakshi

క్రిస్మస్‌కు మెదక్‌ సీఎస్‌ఐ చర్చి సిద్ధం

కోవిడ్‌ నిబంధనలు పాటించాలని భక్తులకు ఎస్పీ సూచన

క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా మెదక్‌ పట్టణంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్‌ఐ చర్చి ముస్తాబైంది. గురువారం రాత్రి విద్యుత్‌ దీప కాంతుల్లో మెరిసిపోయింది. చర్చి ప్రాంగణంలో శాంతాక్లాజ్, క్రిస్మస్‌ ట్రీలను ఏర్పాటు చేశారు. అలాగే మహాదేవాలయంలో జరిగే ప్రత్యేక ఆరాధనలకు తరలివచ్చే భక్తులకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. శుక్రవారం తెల్లవారు జామున జరిగే మొదటి ఆరాధనను బిషప్‌ సాల్మాన్‌రాజ్‌ ప్రారంభించనున్నారు. రెండో ఆరాధన ఉదయం 9గంటలకు ప్రారంభమవుతుంది. పోలీసుల నిఘా కోసం ప్రత్యేకంగా ఔట్‌పోస్టు ఏర్పాటు చేసి అక్కడే బస చేస్తున్నారు. బందోబస్తును ఎస్పీ చందనాదీప్తి పర్యవేక్షిస్తున్నారు

సాక్షి, మెదక్‌ : కరుణామయుడు, లోకరక్షకుడు ఏసుక్రీస్తు జననం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో క్రిస్మస్‌ సందడి నెలకొంది. చర్చిలను విద్యుత్‌ కాంతులతో అత్యంత సుందరంగా అలంకరించారు. క్రిస్మస్‌ పండుగకు ముందు రోజైన గురువారం అర్థరాత్రి నుంచే ఆధ్యాత్మికత వైభవం వెల్లివిరిసింది. ప్రత్యేక ట్రీలు, క్రీస్తు జననాన్ని తెలిపే పూరిపాక ఘట్టాలు, దైవదూత విగ్రహాలు తీరొక్క విద్యుత్‌ దీపాలు శోభాయమానంగా వెలిగిపోయాయి. అంతటా కోలాహలం నెలకొంది.  క్రిస్మస్‌ వేడుకలు అంగ రంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆసియా ఖండంలో అతి పెద్ద  మెదక్ చర్చిలో యేసు పుట్టిన రోజు వేడుకలు అర్ధరాత్రి నుంచి మొదలయ్యాయి. చర్చి పాస్టర్ సాల్ మాన్ రాజు  ఆరాధన  యేసు సందేశాలు అందిస్తున్నారు.

దివ్యతార దిగి వచ్చిన వేళ..
గజ్వేల్‌రూరల్‌: ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా గజ్వేల్‌ పట్టణంలోని అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రాన్ని రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. అతి పవిత్రమైన ఈ చర్చిని సందర్శించేందుకు గజ్వేల్‌ పట్టణ ప్రజలతో పాటు సమీప గ్రామాలే కాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. గురువారం అర్థరాత్రి నుంచి బాలయేసు పుణ్యక్షేత్రంలో ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు మొదలై శుక్రవారం రాత్రి వరకు కొనసాగుతాయి. చర్చి ఆవరణలో పశువుల పాక, స్టార్, ఏసు జననం వంటి కళాకృతులను అందంగా అలంకరించారు. క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చర్చి ఆవరణను అందంగా తీర్చిదిద్దారు. 

మెథడిస్ట్‌ చర్చి.. మైమరపించెన్‌ 
జహీరాబాద్‌: క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చీలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. జహీరాబాద్‌లోని పలు చర్చీలను రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. సంగారెడ్డి జిల్లాలోనే అతిపెద్ద చర్చి అయిన ఎంఆర్‌హెస్‌ఎస్‌ ఆవరణలో నిర్మించిన మెథడిస్ట్‌ చర్చి విద్యుత్‌ కాంతులతో విరాజిల్లుతోంది. ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని టౌన్‌ చర్చితో పాటు పలు కాలనీల్లో ఉన్న చర్చీలను సైతం అందంగా అలంకరించారు. 

ముస్తాబైన చర్చిలు
చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి చిలప్‌చెడ్‌ మండలంలోని పలు చర్చిలు ముస్తాబయ్యియి. గురువారం మండల కేంద్రమైన చిలప్‌చెడ్‌ గ్రామంలోని చర్చిని అందంగా అలంకరించారు. 
నర్సాపూర్‌ రూరల్‌: నేటి క్రిస్మస్‌ పండుగ వేడుకల కోసం నర్సాపూర్‌ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న చర్చిలను రంగులు, విద్యుత్‌ దీపాలతో ముస్తాబు చేశారు. నర్సాపూర్‌ సీఎస్‌ఐ చర్చితో పాటు నాగులపల్లి, అవంచ, ఎల్లాపూర్, ఖాజీపేట, పెద్దచింతకుంట చర్చిలకు పెద్ద ఎత్తున్న భక్తులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. వీరిని దష్టిలో పెట్టుకొని అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 

దివ్య సందేశం
దుబ్బాకటౌన్‌: పెద్దగుండవెల్లి సీఏస్‌ఐ చర్చిలో ప్రతి ఏటా క్రిస్మస్‌ సంబురాలు ఘనంగా జరుపుతారు. క్రిస్మస్‌ సందర్భంగా క్రిస్మస్‌ తాతయ్య (శాంతక్లాజ్‌) వేషధారణతో గ్రామంలో తిరుగుతూ పిల్లలకు చాక్లెట్లు పంచుతారు. చర్చిలో 100 కుటుంబాలు ఒకేచోట ఉండి సంబురాలు ఆనందంగా జరుపుకొంటారు. 

క్రిస్మస్‌ శుభాకాంక్షలు 
సిద్దిపేటకమాన్‌: నేడు జరుపుకోనున్న పవిత్ర క్రిస్మస్‌ పండగను పురస్కరించుకుని క్రిస్టియన్‌ సోదరి, సోదరులకు సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సీపీ ఆకాంక్షించారు.  

 విద్యుత్‌ కాంతుల్లో మెదక్‌ సీఎస్‌ఐ చర్చి 

మరిన్ని వార్తలు