మానవత్వం చాటుకున్న సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌.. సొంత ఖర్చులతో..

20 Jul, 2021 09:29 IST|Sakshi
ఆస్పత్రిలో బిడ్డతో బుద్రి

సాక్షి, చర్ల(ఖమ్మం): స్థానిక సీఐ బి.అశోక్‌ ఔదార్యం చూపారు. రెండు నెలల కిందట మారుమూల ఆదివాసీ గ్రామమైన ఎర్రంపాడుకు చెందిన ఆదివాసీ మహిళ వెట్టి మాసేకు పాముకాటు వేసి ప్రాణాపాయ స్థితిలోకి చేరిన సందర్భంలో ఆమెను సకాలంలో వైద్యశాలకు చేర్చి ప్రాణాలు కాపాడిన విషయం విదితమే. మళ్లీ అదే గ్రామానికి సమీపంలోని మరో ఆదివాసీ గ్రామంలో ఓ గర్భిణికి పురుటినొప్పులు వస్తుండగా అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో సొంత ఖర్చులతో ప్రత్యేకంగా ఓ వాహనాన్ని ఆ గ్రామానికి పంపి ఆమెను వైద్యశాలకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి.

మండలంలోని మారుమూల గ్రామమైన చెన్నాపురంకు చెందిన గర్భిణి కలుము బుద్రికి నెలలు నిండి పురిటి నొప్పులు వస్తుండడంతో కుటుంబ సభ్యులు తిప్పాపురం సమీపంలోకి వచ్చి అంబులెన్సుకు ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌ అందుబాటులో లేదని ప్రత్యామ్నాయం చూసుకోవాలని వారికి కాల్‌ సెంటర్‌ నుంచి సమాధానం రావడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సమాచారం మీడియా ద్వారా చర్ల సీఐ అశోక్‌కు తెలియడంతో ఆయన వెంటనే చర్ల నుంచి ప్రత్యేకంగా ఓ వాహనాన్ని చెన్నాపురంకు పంపించి అక్కడి నుంచి గర్భిణిని సత్యనారాయణపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యాధికారిణి మౌనిక గర్భిణికి ప్రసవం చేశారు. ఈ సందర్భంగా సీఐ అశోక్‌కు బుద్రి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సీఐని గ్రామస్తులు అభినందించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు