HYD: 300 బస్సులు ఎక్కడ?.. డొక్కు బస్సులే దిక్కా?

6 Feb, 2023 06:59 IST|Sakshi

రోజురోజుకూ తగ్గిపోతున్న సర్వీసుల సంఖ్య  

సాయం కోసం గ్రేటర్‌ ఆర్టీసీ ఎదురుచూపులు 

విస్తరిస్తున్న మహా నగరం  

ఇంకా రోడ్డెక్కని 300 ఎలక్ట్రిక్‌ బస్సులు 

సాక్షి, సిటీబ్యూరో: ఏడాదికోసారి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఊరించి ఉసూరుమనిపిస్తూనే ఉంది. ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో ఏళ్లకు ఏళ్లుగా కాలం చెల్లిన సిటీ బస్సులే నడుస్తున్నాయి. దశాబ్ద కాలంగా  ఒక్క కొత్త బస్సు కూడా రోడ్డెక్కలేదు. మరోవైపు  హైదరాబాద్‌ మహానగరం విస్తరిస్తోంది. ఔటర్‌కు వెలుపల సైతం వదలాది కాలనీలు  వెలిశాయి. ఆయా కాలనీలన్నీ ప్రజా రవాణాకు దూరంగానే ఉన్నాయి. ప్రైవేట్‌ వాహనాలు, ఆటోలు, వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడి లక్షలాది మంది నగరవాసులు రోజువారీ రాకపోకలు సాగిస్తున్నారు. పొరుగున ఉన్న ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో  ప్రజా రవాణా పరుగులు తీస్తుండగా హైదరాబాద్‌లో మాత్రం చతికిలపడటం గమనార్హం.  

ఈ– బస్సులేవీ? 
రెండేళ్లుగా ఎలక్ట్రిక్‌ బస్సులపై ఊరిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సర్వీసు కూడా అందుబాటులోకి రాలేదు. అద్దె ప్రాతిపదికన ఈ బస్సులను నడిపేందుకు గతేడాది టెండర్ల ఆహ్వానించారు. కొన్ని సంస్థలు  ముందుకొచ్చాయి. వాటిలో ఒక సంస్థ సాంకేతిక సామర్థ్యంపై అనర్హత కారణంగా టెండర్ల  ప్రక్రియలో వివాదం చోటుచేసుకుంది. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ వివాదం పరిష్కారమైనప్పటికీ ఇంకా ప్రతిష్టంభన తొలగిపోలేదు. దీంతో గతేడాది డిసెంబర్‌ నాటికే  నగరంలోని వివిధ మార్గాల్లో సుమారు 300 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వస్తాయని భావించినప్పటికీ  ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు.  

ప్రస్తుతం గ్రేటర్‌లోని 28 డిపోల పరిధిలో సుమా రు 2,850  బస్సులు ఉన్నాయి. వీటిలో కనీసం వెయ్యికిపైగా డొక్కు బస్సులే. కాలం చెల్లిన వీటితోనే ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నారు. ప్రతి రోజు సుమారు 22 లక్షల మంది ప్రయాణం చేస్తుండగా ఈ అరకొర బస్సులతోనే ఆర్టీసీ అధికారులు పాట్లు పడుతున్నారు. ప్రయాణికుల డిమాండ్‌ మేరకు బస్సులను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లోని కాలనీలకు రోజుకు 8 ట్రిప్పుల డిమాండ్‌ ఉంటే  కేవలం 4 ట్రిప్పులే నడుపుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  

6 వేల బస్సులు అవసరం.. 
రవాణారంగ నిపుణుల అంచనా మేరకు విస్తరిస్తున్న హైదరాబాద్‌ అవసరాల మేరకు ఇప్పటికిప్పుడు కనీసం 6 వేల బస్సులు కావాలి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో వేలకొద్దీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరులో నిత్యం 6వేల బస్సులు నడుస్తుండగా అదనంగా మరిన్ని కొనుగోలుకు చర్యలు చేపట్టారు. ముంబైలో ఎలక్ట్రిక్‌ డ బుల్‌ డెక్కర్‌ బస్సులు అందుబాటు లోకి వచ్చాయి. వాహన కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీలో సీఎన్‌జీ బస్సులను భారీ ఎత్తున కొనుగోలు  చేసి నడుపుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో అందుకు విరుద్ధంగా బస్సుల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం.   

మరిన్ని వార్తలు