ఎర్లీబర్డ్‌’..యమా సక్సెస్‌!

30 Apr, 2022 08:02 IST|Sakshi

సాక్షి హైదరాబాద్‌: కరువు కాలంలో 5 శాతం రాయితీ అయినా ఎంతో ఊరటే. అందుకే కాబోలు ‘ఎర్లీబర్డ్‌’ స్కీమ్‌కు నగర వాసులు బాగా స్పందించారు. ఆస్తిపన్ను చెల్లింపులో రాయితీ అవకాశాన్ని వినియోగించుకొని దాదాపు 36 శాతం మంది తమ ఆస్తిపన్ను చెల్లించారు. తద్వారా జీహెచ్‌ఎంసీ ఖజానాకు ఒక్కనెలలోనే రూ.600 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.

శుక్రవారం సాయంత్రం వరకు రూ.616 కోట్ల ఆస్తిపన్ను జీహెచ్‌ఎంసీ ఖజానాలో చేరింది. శనివారం వరకు ఎర్లీబర్డ్‌ పథకాన్ని వినియోగించుకొని 5 శాతం రాయితీతో చెల్లించేందుకు అవకాశం ఉంది. దీంతో గడువు ముగిసేలోగా దాదాపు రూ.700 కోట్ల వరకు రావచ్చని అధికారుల అంచనా.  

ఇది ఒకవైపు దృశ్యం కాగా.. మరోవైపు మిగతా సంవత్సరమంతా ఎలా నెట్టుకురావాలా అన్న ఆలోచనలోనూ అధికారులున్నారు. ఎర్లీబర్డ్‌ పథకం పాత బకాయిలు లేని, కొత్త ఆర్థికసంవత్సరం(2022–23)ఆస్తిపన్ను చెల్లించేవారికి వర్తిస్తుంది. ఎర్లీబర్డ్‌ రాయితీ వినియోగించుకోవాలనుకుంటే ముందు బకాయిలన్నీ చెల్లించాలి. పాత బకాయిలు కాకుండా, ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను అంచనా దాదాపు రూ.1500 కోట్లు.

అంటే వచ్చే ఆస్తిపన్నులో దాదాపు సగం మొత్తం ఈ ఒక్కనెలలోనే వసూలైతే మిగతా 11 నెలలు ఎలా నెట్టుకురావాలన్నదే అధికారుల ఆలోచన. జీహెచ్‌ఎంసీకి ఉన్న ఆదాయ వనరుల్లో సింహభాగం ఆస్తిపన్నే. వీటిద్వారానే సిబ్బంది, పెన్షన్‌దారుల జీతభత్యాల చెల్లింపులు తదితరమైనవి జరుపుతున్నారు. మున్ముందు వసూలయ్యే ఆస్తిపన్ను తగ్గనున్నందున ఆదాయం ఎలా సమకూర్చుకోవాలా అనే ఆలోచనలో పడ్డారు.

నేడు  రాత్రి 10 గంటల వరకు సీఎస్సీలు పనిచేస్తాయి.. 

  • జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్నును ఆన్‌లైనా ద్వారా, మీసేవా కేంద్రాలు, సిటిజెన్‌ సర్వీస్‌ సెంటర్ల (సీఎస్సీలు)ద్వారా చెల్లించేందుకు అవకాశం ఉంది. ఎర్లీబర్డ్‌ అవకాశానికి చివరి రోజైన శనివారం ప్రజల సదుపాయార్థం జీహెచ్‌ఎంసీ అన్ని సర్కిళ్లలోని సీఎస్సీలు రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంటాయని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి 12 గంటల లోపు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే సదుపాయం ఉంది.  
  • గత రెండు సంవత్సరాల్లో  కరోనాను దృష్టిలో ఉంచుకొని ఎర్లీబర్డ్‌ అవకాశాన్ని ఏప్రిల్‌ నెలలోనే కాకుండా మే నెలాఖరు వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అప్పట్లో రెండునెలల గడువు ఇచ్చినా ఏ ఒక్క సంవత్సరం కూడా రూ.600 కోట్లు వసూలు  కాలేదు. 
  • (చదవండి: టైమ్‌సెన్స్‌ లేక..)
మరిన్ని వార్తలు