తెలంగాణకే తలమానికం! ట్విన్‌ టవర్స్‌

29 Jul, 2022 10:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సిటీ పోలీసు కమిషనరేట్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు పేరు ఖరారైంది. ట్విన్‌ టవర్స్‌గా పిలుస్తున్న దీన్ని తెలంగాణ స్టేట్‌ ఇంటిగ్రేడెట్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (టీఎస్‌ఐసీసీసీ)గా నామకరణం చేశారు. ఆగస్టు 4న సీఎం కేసీఆర్‌ దీన్ని ప్రారంభించనున్నారు. వాస్తవానికిది నాలుగు టవర్స్‌తో కూడిన సముదాయం.

టీఎస్‌ఐసీసీసీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉన్నతాధికారులకు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించారు. 2015 నవంబర్‌లో దీని నిర్మాణం ప్రారంభమైంది. గురువారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌  తదితరులు ‘టీఎస్‌ఐసీసీసీ’ని సందర్శించి పనులపై సమీక్షించారు. 

83.4 మీటర్లకు పరిమితం 
బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12లోని ఏడెకరాల్లో ఈ జంట భవనాలను 135 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని తొలుత భావించారు. అప్పుడున్న నిబంధనల ప్రకారం బంజారాహిల్స్‌లో 15 మీటర్లకు మించిన ఎత్తులో నిర్మాణాలు జరపకూడదు. ఈ ఆంక్షలను సడలిస్తూ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ భవనానికి పురపాలక శాఖ అనుమతి ఇచ్చింది.

మరోపక్క ఇంత ఎత్తైన భవనాలు నిర్మించాలంటే దానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 83.4 మీటర్ల ఎత్తుతో నిర్మించుకోవడానికి సివిల్‌ ఏవియేషన్‌ శాఖ అనుమతించింది. ఈ మేరకు పోలీసు విభాగం 20 అంతస్తులతో 83.4 మీటర్ల ఎత్తులో నిర్మించారు.  

టీఎస్‌ఐసీసీసీ’లో స్వరూప, స్వభావాలివీ.. 
నగర పోలీసు కమిషనరేట్‌ ఆగస్టు ఆఖరు కల్లా టీఎస్‌ఐసీసీసీలోకి తరలనుంది. 18వ అంతస్తులో కొత్వాల్‌ కార్యాలయం ఉంటుంది. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్, టెక్నాలజీ ఫ్యూజన్‌ సెంటర్, ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌ తదితరాలు సైతం అక్కడికే వెళ్తాయి.  

  • నాలుగు బ్లాకుల్లో (ఏ, బీ, సీ, డీ) 5.5 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు. 
  •  బ్లాక్‌–ఏలో 20 అంతస్తులు (16216 చదరపు మీటర్లు విస్తీర్ణం), బ్లాక్‌–బీలో 18 అంతస్తులు (12320 చదరపు మీటర్లు విస్తీర్ణం), బ్లాక్‌–సీలో జీ+2 ఫ్లోర్లు (7920 చదరపు మీటర్లు విస్తీర్ణం), బ్లాక్‌–డీలో జీ+1 ఫ్లోర్‌ (2230 చదరపు మీటర్లు విస్తీర్ణం). 
  • పూర్తిస్థాయిలో డబుల్‌ ఇన్సులేటెడ్‌ గ్లాస్‌తో నిర్మించే ఈ టవర్స్‌లో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్యానెల్స్‌ అదనపు ఆకర్షణ. భవనంపై హెలిప్యాడ్, 17వ అంతస్తులో పబ్లిక్‌ అబ్జర్వేషన్‌ డెస్క్, పోలీసు మ్యూజియం ఉంటాయి. 900 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడిటోరియం, 740 వాహనాలకు పార్కింగ్‌ వసతి ఉంది.  

(చదవండి: పేపర్‌ లీక్‌ వ్యవహారం.. ఐదుగురు అధికారుల సస్పెన్షన్‌)

మరిన్ని వార్తలు