రూ.400 కోట్లతో పౌర విమానయాన పరిశోధన కేంద్రం

4 Mar, 2023 04:37 IST|Sakshi

400 కోట్లతో పౌర విమానయాన పరిశోధన కేంద్రం

బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు

జూలై నుంచి పరిశోధనలు  ప్రారంభించడమే లక్ష్యంగా పనులు 

తెలంగాణలో మరో పరిశోధనా సంస్థ రూపుదిద్దుకుంటోంది. పౌర విమానయాన రంగంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన పరిశోధనా సంస్థను హైదరాబాద్‌లో నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.400 కోట్లకుపైగా అంచనా వ్యయంతో బేగంపేట విమానాశ్రయంలో సివిల్‌ ఏవియేషన్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (సీఏఆర్‌వో)కు శ్రీకారం చుట్టింది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రంలో మున్ముందు విమానయాన రంగంలో చోటుచేసుకోనున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా పరిశోధనలు జరగనున్నాయి.

‘గృహ–5’ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ పరిశోధనా కేంద్రంలో ఈ ఏడాది జూలై నుంచి పరిశోధనలు ప్రారంభించడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేశారు. భారతదేశంలో మొదటిసారిగా నిర్మిస్తున్న ఈ కేంద్రంలో విమానాశ్రయాలు, ఎయిర్‌ నావిగేషన్‌ సేవలకు సంబంధించిన పరిశోధనా సౌకర్యాలు, ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ కమ్యూనికేషన్స్, డొమైన్‌ సిమ్యులేటర్, నెట్‌వర్క్‌ ఎమ్యులేటర్, విజువలైజేషన్‌ – అనాలసిస్‌ ల్యాబ్స్, సరై్వలెన్స్‌(నిఘా) ల్యాబ్స్, నావిగేషన్‌ సిస్టమ్స్‌ ఎమ్యులేషన్‌ – సిమ్యులేషన్‌ ల్యాబ్స్, సైబర్‌ సెక్యూరిటీ – థ్రెట్‌ అనాలసిస్‌ ల్యాబ్స్, డేటా మేనేజ్‌మెంట్‌ సెంటర్, ప్రాజెక్ట్‌ సపోర్ట్‌ సెంటర్, సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ – టూల్స్‌ సెంటర్, నెట్‌వర్క్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెంటర్‌సహా పలు పరిశోధనలు జరగనున్నాయి.  
 

మరిన్ని వార్తలు