ప్రజలంటే గౌరవం లేదు 

29 Jan, 2021 04:49 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సామాన్యులతో దురుసుగా ప్రవర్తన

విషయ పరిజ్ఞానం లేక పనిలో అసమర్థత బాధ్యతలను ఇతరులపై తోసేస్తుండటంతో తీవ్ర జాప్యం

క్షేత్ర స్థాయిలో విచ్చలవిడిగా అవినీతి

పీఆర్సీ నివేదికలో ప్రభుత్వ ఉద్యోగులపై పౌరుల ఫిర్యాదులు

ఖాళీలు, పనిభారం కారణమని ఉద్యోగ సంఘాల వివరణ పలు సంస్కరణలను సిఫారసు చేసిన కమిషన్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘సామాన్య ప్రజలంటే ఏ మాత్రం గౌరవం లేదు. వారితో అగౌరవంగా వ్యవ హరిస్తుంటారు. ఉద్యోగులు తమ పనికి సంబంధిం చిన విషయ పరిజ్ఞానాన్ని కలిగి లేకపోవడంతో సత్ఫలితాలు రావట్లేదు. బాధ్యతలను ఇతరులపై నెట్టేస్తుండటంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిర్ణయాలు తీసుకునే సమర్థత కొరవడింది. క్షేత్ర స్థాయిలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది’ ఇవీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహార తీరుపై తెలంగాణ తొలి వేతన సవరణ సంఘానికి (పీఆర్సీ) పౌర సమాజం నుంచి అందిన ఫిర్యా దులు. ఉద్యోగులపై పౌరుల ఫిర్యాదులు, వీటిపై ఉద్యోగ సంఘాల వివరణలు, వీటి పరిష్కారానికి తీసుకోవాల్సిన సంస్కరణలను వేతన సవరణ కమిషన్‌ తన నివేదికలో ‘హ్యూమన్‌ రిసోర్సెస్‌’ పేరుతో ఓ అంశంగా పొందుపర్చింది.

‘ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సమస్యలు పరిష్కరించాల్సింది పోయి తమ వ్యవహార శైలితో వారి సమస్యలను పెంచుతున్నారు. ప్రభుత్వ పరిపాలన వ్యవస్థ ఆశించిన రీతిలో పని చేయట్లేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు’అని కమిషన్‌  తన నివేదికలో పేర్కొంది. ప్రజల నుంచి ఫిర్యాదులను తగ్గించడంతో పాటు ప్రభుత్వ పని తీరుపై సంతృప్తి కలిగించేందుకు.. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు, సమర్థత, ఫలితాలతో జీతాల పెంపును ముడిపెట్టాలని పౌరుల నుంచి సూచనలు వచ్చినట్లు కమిషన్‌ ప్రస్తావించింది.

పని ఒత్తిడి వల్లే..
‘ప్రభుత్వ శాఖల్లో పని భారం పెరిగినా ప్రస్తుత సిబ్బందితోనే నెట్టుకురావాల్సి వస్తుండటంతో ప్రజలకు అన్ని రకాల ప్రభుత్వ సేవలను సమ ర్థంగా అందించలేకపోతున్నాం. అన్ని శాఖల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉండటం, పెరిగిన పనిభారం వల్లే ఇలా జరుగుతోంది. రెవెన్యూ ఇన్‌ స్పెక్టర్‌ స్థాయి నుంచి క్షేత్ర స్థాయిలో పనిచేసే అధి కారులు, సిబ్బందికి వాహనాలు కేటాయించలేదు. దీంతో క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరువ కాలేకపోతున్నారు. ప్రభుత్వం వీరికి వాహనాలు కేటాయించాలి. లేదంటే సొంత వాహనాలు వాడితే ఫిక్స్‌డ్‌ ట్రావెల్‌ అలవెన్సులు ఇవ్వాలి. కార్మిక శాఖ వంటి కొన్ని శాఖల్లో క్షేత్ర స్థాయి సిబ్బందికి వాహనాలు అందించడంతో ప్రభుత్వ ఆదాయం పెరిగింది’అని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పీఆర్సీ కమిషన్‌  కు వివరణ ఇచ్చారు.

ఈ శాఖల్లో మరింత సమస్యలు..
ఉద్యోగుల పనితీరుపై ప్రజల నుంచి వ్యక్తమైన ఆందోళనలు ప్రభుత్వ శాఖల పట్ల ఉండే సర్వ సాధారణ అభిప్రాయమని, ప్రజలకు అత్యధికంగా రెవెన్యూ, హోం, పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల పనితీరు వల్ల ఇబ్బందులు కలుగుతున్నా యని పీఆర్సీ కమిషన్‌  వ్యాఖ్యానిం చింది. ఐటీ, కంప్యూటర్‌ పరిజ్ఞానం లేక ప్రజలకు సరైన సేవలందట్లేదని, 3, 4వ గ్రేడ్‌ ఉద్యోగులకు ఎలాంటి శిక్షణ లేదని పేర్కొంది.

వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కమిషన్‌  సూచించింది. సంస్థాగత సామర్థ్యంతో పాటు ఉద్యోగుల సాధి కారతను పెంపొందించడానికి చర్యలు తీసుకోవా లని ప్రభుత్వాన్ని కోరింది. మల్టీ టాస్కింగ్‌ స్కిల్స్‌ తో పాటు విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవ డం, సమస్యలను పరిష్కరించే వ్యవహార శైలి, నిర్ణయాలు తీసుకునే సమర్థతను ఉద్యోగులకు కల్పించేందుకు క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వాలని సూచించింది. ఉద్యోగుల పని తీరును మెరుగు పర్చడానికి పీఆర్సీ–2014 చేసిన సిఫారుసుల్లోని కొన్నింటిని మరోసారి సిఫారసు చేస్తున్నట్లు తన నివేదికలో పొందుపర్చింది.

  • టీఎస్‌పీఎస్సీ/డీఎస్సీ/ఇతర నియామక సంస్థల ద్వారా జరిపే ఉద్యోగ నియామకాలు, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ నియామకాలకు సంబంధించిన హెచ్‌ఆర్‌ ప్లాన్‌ను ప్రభుత్వం కలిగి ఉండాలి. అన్ని స్థాయిల్లోని ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు ఉండాలి. ఉద్యోగ జీవితంలో కనీసం రెండు పదోన్నతులు వచ్చేలా సర్వీస్‌ రూల్స్‌ను సమీక్షించాలి.
  • క్షేత్ర స్థాయిలో పనిచేసే గ్రూప్‌–1, 2 అధికారులు, సహాయ సిబ్బందికి రవాణా సదుపాయం, టీఏ సదుపాయం కల్పించాలి.
  • సేవలు మెరుగుపరిచేందుకు ప్రయత్నించాలి. 
  • క్షేత్ర స్థాయిలో సేవలందించే సిబ్బందికి మొబైల్‌ ఫోన్‌ , సీయూజీ సదుపాయం కల్పించాలి.
  • గ్రూప్‌–1, 2 అధికారులకు ల్యాప్‌టాప్‌/ నోట్‌బుక్‌లను ఇంటర్నెట్‌తో పాటు అందించాలి.
  •  మీ–సేవ పరిధిలో ప్రభుత్వ శాఖలు తమ సేవలను తీసుకురావాలి.
మరిన్ని వార్తలు