వేగంగా వరి కొను‘గోల్‌’

26 Dec, 2021 03:25 IST|Sakshi

60 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

ఇప్పటివరకు 10.55 లక్షల మంది రైతుల నుంచి పంట కొనుగోళ్లు

ఏడు జిల్లాల్లో ముగిసిన ప్రక్రియ.. 3,252 కేంద్రాల్లో కొనసాగుతున్న సేకరణ

మరో 30 లక్షల టన్నుల ధాన్యం రావొచ్చని అధికారుల అంచనా  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వానాకాలం పంట కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగుతోంది. అన్ని జిల్లాల్లో కలిపి 10.55 లక్షల మంది రైతుల నుంచి ఇప్పటివరకు సుమారు 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాలశాఖ సేకరించింది. ఇప్పటికే ఏడు జిల్లాల్లో ధాన్యం సేకరణ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 6,950 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి 6,862 కేంద్రాలను తెరిచారు. వాటిలో కొనుగోళ్లు పూర్తయిన 3,382 కేంద్రాలను శుక్రవారం నాటికి మూసివేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,252 కొనుగోలు కేంద్రాలు మాత్రమే నడుస్తున్నాయి. 

చాలా జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తి..
కోతలు ముందుగా ప్రారంభమైన ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్‌ జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ దాదాపుగా ముగిసింది. ఆలస్యంగా కోతలు జరిగిన సిరిసిల్ల, నిర్మల్‌ జిల్లాలలోని పదేసి గ్రామాల్లో రైతుల కోరిక మేరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తున్నప్పటికీ త్వరలోనే మూసివేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట, మంచిర్యాల, వరంగల్, జనగాం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, మహబూబ్‌నగర్, మేడ్చల్‌ జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయిన గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. 

ప్రైవేటుగానూ అమ్మకాలు..
రాష్ట్రంలో ఈ వానాకాలంలో 1.30 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికార యంత్రాంగం అంచనా వేసింది. వ్యక్తిగత అవసరాలు, మిల్లర్లు కొనుగోళ్లు, విత్తనాల ధాన్యం పోగా 1.04 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అనుకున్నారు. అయితే అక్టోబర్‌ రెండో వారంలో మొదలు కావలసిన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ఆ నెలాఖరుకు మొదలయ్యాయి. చాలా జిల్లాల్లో నవంబర్‌ నెలాఖరు వరకు కూడా కొనుగోళ్లు మొదలు కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వడ్ల కొనుగోళ్లపై టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య రాజకీయ దుమారం చెలరేగింది.

ఈ పరిస్థితుల్లో ధాన్యం విక్రయించేందుకు రోజుల తరబడి వేచి చూడలేని రైతులు మిల్లర్లకు, ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయించారు. ఇప్పటికీ వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో నేరుగా మిల్లర్లకే ధాన్యం విక్రయిస్తున్న ఉదంతాలు ఉన్నాయి. దీంతో కోటి మెట్రిక్‌ టన్నులకుపైగా కొనుగోలు కేంద్రాలకు వస్తుందనుకున్న ధాన్యం ఇప్పటివరకు 60 ఎల్‌ఎంటీ వరకే వచ్చింది. ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నుంచి ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి అదనంగా మరో 30 లక్షల వరకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 

చివరి గింజ వరకు సేకరిస్తాం 
తెలంగాణ రైతాంగంపై కక్ష కట్టిన కేంద్రం యాసంగి పంటను తీసుకోబోమని చెప్పడంతోపాటు వానాకాలం పంటను ఎంత సేకరిస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వరకే సేకరిస్తామని గతంలో పేర్కొనగా ఇప్పటికే ఆ లక్ష్యం దాటింది. ఏడు జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. మిగతా జిల్లాల నుంచి ఇంకా 30 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు వస్తుందని భావిస్తున్నాం. ఎంత ధాన్యం వచ్చినా ఈ వానాకాలం పంటను చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. 
– మంత్రి గంగుల కమలాకర్‌

మరిన్ని వార్తలు