సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటే సక్సెస్‌ సాధ్యం

5 Jun, 2022 02:22 IST|Sakshi
‘సాక్షి’ తరపున స్నేహను సన్మానించి  మెమొంటో అందజేస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి  

‘సాక్షి’ పోటీ పరీక్షల అవగాహనా సదస్సులో సివిల్స్‌ విజేత స్నేహ

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: సోషల్‌ మీడియాకు వీలైనంత దూరం ఉంటే సక్సెస్‌ త్వరగా సాధ్యమవుతుందని సివిల్స్‌ ఆలిండియా 136 ర్యాంక్‌ సాధించిన అరుగుల స్నేహ అన్నారు. సక్సెస్‌ అయ్యాక మాత్రం సోషల్‌ మీడియాలో మనమే ఉంటామని చెప్పారు. శనివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

కార్యక్రమానికి అతిథిగా హాజరైన స్నేహ పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులు అడిగిన సందేహాలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విషయాన్ని ఎంత తొందరగా ఆకళింపు చేసుకుంటామనే దాన్నిబట్టి ఎన్ని గంటలు చదవాలనే దానిపై ప్రణాళిక నిర్దేశించుకోవాలని సూచించారు. నెగెటివ్‌ ఆలోచనలను రాకుండా చూసుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. ఓటములను గెలుపునకు నాందిగా భావించాలని చెప్పారు. తాను మూడు విడతల్లో విఫలమై, మూడో విడతలో ఒకే ఒక్క మార్కుతో సివిల్స్‌ ర్యాంక్‌ కోల్పోయినప్పటికీ పట్టు వదలకుండా నాలుగో విడతలో విజేతగా నిలిచానన్నారు.

స్నేహితులతో ఎప్పటికప్పుడు గ్రూప్‌ డిస్కషన్స్‌ ద్వారా అనేక సందేహాలు నివృతి చేసుకున్నట్లు స్నేహ పేర్కొన్నారు. అభ్యర్థులు కరెంట్‌ అఫైర్స్‌ కోసం దినపత్రికలను రోజూ కచ్చితంగా చదవి నోట్స్‌ తయారు చేసుకోవాలని వివరించారు. ‘సాక్షి’ తరపున జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి స్నేహను సన్మానించి మెమొంటో అందజేశారు.

మరిన్ని వార్తలు