అమ్మానాన్నల ప్రోత్సాహం.. బావ సహకారంతో సివిల్స్‌ రాశా..

12 Jun, 2022 17:03 IST|Sakshi

సాక్షి, వరంగల్ (మహబూబాబాద్‌) : నాన్న వైద్యుడిగా పనిచేయడంతో చిన్నతనం నుంచి నాన్న దగ్గరకు వచ్చే గిరిజనులు, పేదవాళ్లను చూసి.. వారి కష్టాలు తీర్చాలని అనిపించేది.. పెద్దయ్యాక పేదలకోసం ఏదైనా చేయాలని ఆలోచన ఉండేది.. ఐఐటీ చదువుతున్నప్పుడు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆ ఆలోచన మరింత బలపడింది.. ఆ తర్వాత అమ్మ, నాన్నల ప్రోత్సాహం.. బావ సహకారంతో సివిల్స్‌లో 658 ర్యాంకు సాధించానంటున్న మానుకోట మణిహారం సభావట్‌ అమిత సివిల్స్‌ ర్యాంకు సాధించిన సందర్భంగా “సాక్షి’తో మాట్లాడారు.

పరీక్షలంటే భయంలేదు.. 
చిన్నప్పటి నుంచి ప్రత్యేకతలు ఏమీ లేకుండా అమ్మా నాన్నలు చెప్పింది వింటూ ఏడో తరగతి వరకు మహబూబాబాద్‌లో, తర్వాత ఇంటర్‌ వరకు హైదరాబాద్‌లో, ఐఐటీ కాన్పూర్‌లో ఇంజనీరింగ్‌ చదివాను.. అయితే  పరీక్షలు వచ్చినప్పుడు కాకుండా ఎప్పటి విషయాలు అప్పుడు చదవడం చిన్ననాటి నుంచి అలవాటు దాంతో ఏ పరీక్షనైనా భయం లేకుండా రాసేదాన్ని..

సేవ చేయాలనే ఆలోచన.. 
గిరిజనులు ఎక్కువగా ఉండే మానుకోటలో పుట్టి పెరిగాను. నేనూ గిరిజన బిడ్డనే కావడంతో వారు పడుతున్న ఇబ్బందులు, కష్టాలను చూసి వారికి ఏదైనా చేయాలని ఆలోచిందే దాన్ని. కాన్పూర్‌లో ఐఐటీ చదువుతున్నప్పుడు మా కోర్సులో భాగంగా ఎన్‌జీఓలో పనిచేయాల్సి వచ్చింది. అప్పుడు మహిళలు, దివ్యాంగులు, పిల్లల సమస్యలు వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయడం అలవాటైంది. మహిళలపై వేధింపులు చూసినప్పుడల్లా.. వీటిని నివారించే అవకాశం వస్తే బాగుండు అనుకున్నాను. అందుకోసమే సివిల్స్‌ రాశాను. 

అమ్మతో అనుబంధం ఎక్కువ..
నా ఆలోచనను అమ్మానాన్నలు చిన్నప్పటి నుంచి గమనిస్తున్నారు. అమ్మతో నాకు ఎక్కువ అనుబంధం.. సివిల్స్‌ రాస్తానంటే ధైర్యం చెప్పింది.. 2018లో 975వ ర్యాంకు వచ్చింది.. డిఫెన్స్‌లో సెక్షన్‌ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరాను. ఉద్యోగం చేస్తూనే మళ్లీ చదవడం ప్రారంభించాను.. ఇంతలోనే కోవిడ్‌ మహమ్మారితో ఇల్లు విడిచి వెళ్లలేని పరిస్థితి.. ఈ పరిస్థితిలో నాకు ఏ ఇబ్బంది రాకుండా చూసింది అమ్మ. ఆన్‌లైన్‌లో చదడం ప్రారంభించాను. మెటీరియల్, ఇంటర్వ్యూ ఎలా చేయాలి.. ఏ అంశాలు చదవాలి అనే సందేహాను నివృత్తి చేసింది. బావ దేవేందర్‌ సింగ్‌(ఐఏఎస్‌ మహారాష్ట్ర కేడర్‌). ఇలా అమ్మానాన్న, బావ సహకారం నన్ను మరిన్ని గంటలు చదివేలా చేసింది.. ఇలా రోజుకు 12 గంటలకు పైగా చదివి..  ఈ సారి 658వ ర్యాంకు సాధించాను

కలిసొచ్చిన ఇంటర్వ్యూ..
నాకు రిటన్‌ టెస్ట్‌కన్నా.. ఇంటర్వ్యూలో అత్యధిక మార్కులు స్కోర్‌ చేసే అవకాశం వచ్చింది. నేను సెంట్రల్‌ డిఫెన్స్‌లో ఉద్యోగం చేయడంతో ఇంటర్వ్యూ చేసే పెద్దలు నన్ను సహ ఉద్యోగిగా చూశారు. గిరిజనులు, జీవన విధానం, సామాజిక సేవా మొదలైన అంశాలపై ప్రశ్నలు అడిగారు. దీంతో నాకు సమాధానాలు చెప్పడం సులువైంది. 

మనమేమీ తక్కువ కాదు.. 
మానుకోట.. మారు మూల జిల్లా.. ఇక్కడ చదివిన వాళ్లు ఏం సాధిస్తారు. అనే ఆలోచన ఇక్కడి విద్యార్థులు, యువతలో ఉంటుంది.. కానీ, లక్ష్యం ఎంచుకొని శ్రమిస్తే సాధించలేనిది ఏమీ లేదు. మనమేమీ తక్కువ కాదు.. ఇతరులు మనకన్నా గొప్పేం కా దు.. కష్టపడితే విజయం వరిస్తుంది. యువత భయ పడకుండా కష్టపడి ఉన్నతస్థానాల్లో ఉండాలనేది నా ఆకాంక్ష.నా చిన్ననాటి స్వప్నం సాకారమయ్యే రోజు వచ్చింది. నాకు వచ్చిన ర్యాంక్‌తో ఐపీఎస్‌ లేదా.. ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్‌లు వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని సామాజిక సేవకు ప్రాధాన్యత ఇస్తా.. ముఖ్యంగా మహిళలు, గిరిజనులకు సహాయ పడేందుకు ప్రయత్నం చేస్తా. 

చాలా గర్వంగా ఉంది
పెద్ద పాప డాక్టర్, అమిత చిన్ననాటి నుంచి వినూత్నంగా ఆలోచించేది.. అందుకోసమే సివిల్స్‌ రాస్తా ను అనగానే ధైర్యం చెప్పాం.. బిడ్డ రోజు నిద్రపోకుండా చదువుతుంటే బాధ అనిపించేంది.. కానీ ఆమెతోపాటు మేం మేల్కొని ఉండి సాయం చేసేవాళ్లం.. మంచి ర్యాంకు సాధించినందుకు గర్వ పడుతున్నాం..   – డాక్టర్‌ భీంసాగర్, భూ లక్ష్మి, అమిత తల్లిదండ్రులు 

మరిన్ని వార్తలు