ప్రజల మనిషి నవలను చదివాను: సీజేఐ ఎన్వీ రమణ

29 Dec, 2021 05:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిఒక్కరూ పుస్తకం చదివి, ఇతరులతో చదివించడాన్ని ఒక ఉద్యమంలా ముం దుకు తీసుకెళ్లాలని భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సూచించారు. ప్రపంచగతిని సాహిత్యమే మార్చిందని, ఎంతోమంది మహానుభావులు ప్రపంచాన్ని అర్థం చేసుకొని రాసిన గ్రం థాలే సమాజాలను ముందుకు నడిపించేందుకు దోహదం చేశాయని అన్నారు. గాంధీజీ, నెహ్రూ వంటి జాతీయనేతలు రాసిన పుస్తకాలు జాతీయోద్యమానికి స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు. హైదరాబాద్‌ 34వ జాతీయ పుస్తక ప్రదర్శన ముగింపు సందర్భంగా మంగళవారం ఎన్టీఆర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

జస్టిస్‌ రమణ మాట్లాడుతూ చదివేవాళ్లు కరువవుతున్నారని, పుస్త కం భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన చెందుతున్న తరుణంలో వేలాదిమంది యువత పుస్తక ప్రదర్శనలో కనిపించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. పుస్తకం భవిష్యత్తు ప్రశ్నార్థం కాబోదని, అది సజీవంగానే ఉంటుందనే ఆశ చిగురించిందని చెప్పారు. తాను చదువుకొనే రోజుల్లో కోఠిలోని నవయుగ, విశాలాంధ్ర వంటి పుస్తకాల షాపుల్లోనే పుస్తకాలు లభించేవని పేర్కొన్నారు.  డిజిటల్‌ రీడింగ్‌ ప్రమాదకరం ఇప్పుడు చదవాల్సిన అవసరం లేకుండా, చదివి వినిపించే డిజిటల్‌ రీడర్స్‌ అందుబాటులోకి వచ్చాయని, కానీ ఈ పద్ధతి ప్రమాదకరమని జస్టిస్‌ రమణ చెప్పారు. పుస్తకాలు, పత్రికలు చదివినప్పుడే మేధోవికాసం లభిస్తుందని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలు పుస్తకాలను చదివేవిధంగా ప్రోత్సహించాలని సూచించారు. తాను చిన్నప్పుడు రోజూ గ్రంథాలయానికి వెళ్లి మూడు, నాలుగు గంటలపాటు పత్రికలు, పుస్తకాలు చదివేవాడినని పేర్కొన్నారు. ప్రస్తుతం స్కూళ్లలో గ్రంథాలయాలు, ఆటస్థలాలులేవని, వాటి ఏర్పాటుకు అందరూ కృషి చేయాలన్నారు.భావాల వ్యక్తీకరణకు లేఖలు రాయడానికి మించిన మార్గం లేదని చెప్పారు.

నేనూ ఓ పుస్తకం రాస్తా.. 
రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, తగి నన్ని నిధులు ఇవ్వాలని జస్టిస్‌ రమణ కోరారు. మహాకవి శ్రీశ్రీ 1930 నుంచే రచనలు చేసినప్పటికీ ఆయన మహాప్రస్థానం వెలువడిన తరు వాతే ఎంతోమంది చదివి చైతన్య వంతులయ్యా రని అన్నారు. పుస్తక ప్రచురణ సంస్థల కష్టాలు తనకు తెలుసునని, లా చదివే రోజుల్లో కొంతకాలంపాటు ‘నడుస్తున్న చరిత్ర’పత్రిక నిర్వహించి చాలా కష్టాలు పడ్డానని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్నో అద్భుతమైన పుస్తకాలు తెలుగులో వస్తున్నాయని, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు ప్రచురించిన మేరీ టైలర్‌ జైలు జీవితం పుస్తకం చాలా బాగుందన్నారు.

తాను చదువుకొనే రోజుల్లో అమ్మ నవలను ఎన్నోసార్లు చదివినట్లు చెప్పారు. పదవీ విరమణ అనంతరం పుస్తకాలు చదువుతానని, ఒక పుస్తకం కూడా రాస్తానని జస్టిస్‌ రమణ చెప్పారు. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకికి చెందిన ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం వ్యవస్థాపకుడు, దాశరథీ పురస్కార గ్రహీత డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్యను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృ తిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కమిటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్, కోశాధికారి పి.రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.   

   

తెలుగులోనే తీర్పులివ్వాలి 
మన తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టు తీర్పులను తెలుగు, హిందీ భాషల్లో వెలువరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సూచించారు. సుప్రీంకోర్టు తీర్పులను ఇప్పటికే కొంతకాలంగా ప్రాంతీయ భాషల్లోకి అనువదించి వెబ్‌సైట్‌లో ఉంచుతున్నట్లు చెప్పారు. తాను గతంలో హైకోర్టులో పనిచేసిన సమయంలో తెలుగులోనే తీర్పులివ్వాలనే ఉద్దేశంతో అప్పట్లో జూబ్లీహాలులో జడ్జిలకు సంవత్సరం పాటు శిక్షణ ఇప్పించామన్నారు. ఈ శిక్షణ పొంది తెలుగులోనే తీర్పులిచ్చిన వారిని అభినందించి, అవార్డులు కూడా అంద చేశామని ఆయన గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు