‘మీకు పెన్‌ ఉంటే, మాకు గన్‌ ఉంది’.. జర్నలిస్టుపై పోలీస్‌ దురుసు ప్రవర్తన

18 Apr, 2022 12:21 IST|Sakshi

జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులు

ఆందోళన చేపట్టిన జర్నలిస్టులు

 పుష్కర విధుల నుంచి ఇద్దరు ఖాకీల తొలగింపు?

సాక్షి, వరంగల్‌: మీకు పెన్‌ ఉంటే మాకు గన్‌ ఉంది.. ఈయన మీద ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేయండి. పోలీసులంటే ఏమనుకుంటున్నాడో తెలియాలి.. అంటూ ఓ సీఐ కాళేశ్వరం వద్ద పుష్కరాల విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుపై దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించాడు. ఆయన తీరును నిరసిస్తూ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సదరు వివాదాస్పద అధికారిని పుష్కరాల విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలానికి చెందిన ఓ టీవీ చానల్‌ రిపోర్టర్‌ పుష్కరాల సందర్భంగా ఆదివారం కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల పూజలను వీడియో తీశాడు.

అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై మొగిలి సదరు జర్నలిస్టును అడ్డుకొని వీడియో తీయొద్దంటూ ఆలయం ఎదుట ఉన్న సీఐ జానీ నర్సింహులు వద్దకు తీసుకొచ్చాడు. ఆలయంలో వీడియో తీయడానికి అనుమతి లేదంటూనే జర్నలిస్టు చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను సీఐ బలవంతంగా లాక్కున్నాడు. తాను స్థానిక రిపోర్టర్‌నని మొర పెట్టుకున్నప్పటికీ పోలీసులంటే ఏమనుకుంటున్నావు.. మీ దగ్గర పెన్‌ ఉంటే.. మా దగ్గర గన్‌ ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పలువురు జర్నలిస్టులు గొడవను ఆపేందుకు ప్రయత్నించగా వారిపై కూడా సీఐ దురుసుగా ప్రవర్తించాడు.

దీంతో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు పోలీస్‌ ఔట్‌పోస్ట్‌లో ఉన్న కాటారం డీఎస్పీ బోనాల కిషన్‌ వద్దకు వెళ్లి జరిగిన సంఘటనను వివరించి నిరసన తెలిపారు. ఈ విషయాన్ని డీఎస్పీ ఫోన్‌ ద్వారా ఎస్పీ జె.సురేందర్‌రెడ్డికి తెలియజేశాడు. ఈ క్రమంలోనే వివాదానికి తెరలేపిన సీఐ జానీ నర్సింహులు అక్కడికి చేరుకొని ఇగో అన్న.. నా ఫిర్యాదు.. జరిగిందంతా ఇందులో రాసిన.. వాళ్ల మీద ఎఫ్‌ఐఆర్‌ చెయ్‌ అన్నాడు. ఇందుకు డీఎస్పీ బదులిస్తూ విషయాన్ని ఎస్పీకి తెలియజేశాను.. కొద్దిసేపట్లో సార్‌ నిర్ణయం తీసుకుంటారు.. మీరు ఏదైనా చెప్పాలనుంకుంటే ఎస్పీ సంప్రదించండి అని వెల్లడించాడు.
చదవండి: మూడేళ్ల కిందట మాటలు బంద్‌.. మూగవాడికి మాటలొచ్చాయ్‌!

అయినప్పటికీ వినకుండా సీఐ కొద్దిసేపు డీఎస్పీతో వాగ్వాదానికి దిగి  ఫిర్యాదు అక్కడే ఉంచి వెళ్లిపోయాడు. కాగా, ఈ సంఘటనపై ఆరా తీసిన ఎస్పీ సురేందర్‌రెడ్డి పుష్కర విధుల నుంచి సీఐ జానీ నర్సింహులు, ఎస్సై మొగిలిని తొలగించినట్లు అనధికారిక సమాచారం. ఇదిలా ఉండగా సీఐ జానీ నర్సింహులు తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవా లని టీయూడబ్ల్యూజే(హెచ్‌143) రాష్ట్ర నాయకుడు తడక రాజ్‌నారాయణగౌడ్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా నాయకులు సామంతుల శ్యాం, క్యాతం సతీష్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.  
చదవండి: రంజాన్‌ మాసంలో.. ఇది తప్పనిసరి! ఫుల్‌ డిమాండ్‌

మరిన్ని వార్తలు